దళితుల శోకమే.. రాజధాని శంఖమా? | sakshi daily wright about chandra babu naidu govt scams and formers assigned packages | Sakshi
Sakshi News home page

దళితుల శోకమే.. రాజధాని శంఖమా?

Published Fri, Feb 19 2016 7:02 AM | Last Updated on Sat, Jul 28 2018 6:35 PM

దళితుల శోకమే.. రాజధాని శంఖమా? - Sakshi

దళితుల శోకమే.. రాజధాని శంఖమా?

అధికార పార్టీ నేతల ‘అసైన్డ్’ మాయ
కారుచౌక రేటుకు  1,800 ఎకరాలు కొట్టేశారు
పేద రైతులను వంచించి భూములు కాజేశారు
అసైన్డ్ భూములకు పరిహారం ఉండదని ప్రచారాలు
ముందస్తు పథకం ప్రకారమే లేటుగా అసైన్డ్ ప్యాకేజీ
అప్పటికే చౌకరేట్లకు అమ్ముకున్న రైతులు
ప్యాకేజీతో లాభపడేది ‘పచ్చ’గద్దలే
పలుమార్లు హెచ్చరించిన ‘సాక్షి’

 సాక్షి, హైదరాబాద్/గుంటూరు/విజయవాడ ; అన్యాయం.. దుర్మార్గం.. పేద దళిత రైతులను పట్టపగలు దారుణంగా వంచించారు.. పరిహారం రాదంటూ ప్రచారాలు చేసి వారి అసైన్డ్ భూములను కారు చౌకగా కొట్టేశారు. కోట్లు కొల్లగొట్టడానికి పేద రైతుల పొట్ట కూడా కొట్టడానికి వెనుకాడబోమని అధికార పార్టీ నేతలు మరోమారు రుజువు చేసుకున్నారు. రాజధాని ప్రాంతంలో పేద దళిత రైతులను మోసగించి అసైన్డ్ భూములను కారుచౌకగా కొట్టేసిన ‘పెద్దలు’ ఏకంగా రూ. 2,640 కోట్లు కొల్లగొట్టారు. ప్రభుత్వ దన్నుతో ‘పసుపు దళం’ ఒక పథకం ప్రకారం సాగించిన కుంభకోణం ఇది. నాలుగు నెలల వ్యవధిలోనే కోట్లకు పడగలెత్తిన భూబకాసురులు వేసిన పథకాలు, చేసిన కుట్రలు చూస్తే కళ్లు బైర్లు కమ్మడం ఖాయం. కొద్దిపాటి భూమిలో వ్యవసాయం చేసుకుంటూ ప్రశాంతంగా బతుకుతున్న రైతులను సామదానభేద దండోపాయాలతో మాయజేసి వారి అసైన్డ్ భూములను కాజేశారు.

వారి నోటికాడ ముద్దను లాగేశారు. రాజధాని కోసం సమీకరిస్తున్న భూములలో అసైన్డ్ భూములుంటే వాటికి పరిహారం రాదని ముందు ప్రచారం చేశారు. అసైన్డ్ భూములను ప్రభుత్వం బలవంతంగానైనా తీసేసుకుంటుంది కాబట్టి తమకిస్తే ఎంతోకొంత ఇస్తామని నమ్మించారు. ఎకరాకు ఐదారు లక్షలు చేతిలోపెట్టి సొంతం చేసుకున్నారు. వీలైనన్ని భూములను బినామీ పేర్లతో కాజేసిన తర్వాత ముందుగా వేసుకున్న పథకం ప్రకారం ప్రభుత్వం అసైన్డ్ భూములకు కూడా ప్యాకేజీ ప్రకటించింది. ఆ ప్యాకేజీ ప్రకారం అధికార పార్టీ నేతలకు దక్కుతోంది రూ.2,640 కోట్లకు పైమాటే. కానీ దళిత రైతులకు విదిల్చింది పదికోట్లు కూడా మించదు. రాజధాని ప్రాంతంలో దళితరైతుల అసైన్డ్ భూములను కాజేస్తున్నారంటూ ‘సాక్షి’ పదేపదే చేసిన హెచ్చరికలు ఇపుడు నిజమయ్యాయి. పూటకో అవినీతి వ్యవహారంతో వడివడిగా ‘అభివృద్ధి’ చెందుతున్న ‘పచ్చ’ గద్దలు రాజధాని ప్రాంతంలో చూపిస్తున్న చేతివాటం గురించి ‘సాక్షి’ అనేక కథనాలను ప్రచురించింది.

 దళిత రైతుకు జరిగిన నష్టమేమిటంటే..
రాజధాని పేరుతో రాష్ర్టప్రభుత్వం చేస్తున్న మాయలు అనేకం. బినామీల భూములను వదిలేసి మూడు పంటలు పండే భూములను రైతుల నుంచి లాక్కున్నారు.  పరిహారంగా నివాస, వాణిజ్య స్థలాలు ఎక్కడ ఇస్తారో చెప్పకుండా వారి జీవితాలతో ఆడుకుంటున్నారు. భూములు ఇవ్వని రైతుల పొలాలు తగులబెట్టించి, వారిపైనే ఎదురు కేసులు పెట్టి భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. ఇపుడు అసైన్డ్ భూమిని సాగుచేసుకుంటూ బతుకులీడుస్తున్న బడుగు రైతులనూ వదలలేదు. ఎకరా సాగుచేసుకుంటున్న ఒక దళిత రైతును ఉదాహరణగా తీసుకుంటే... అధికార పార్టీ నేతలు పరిహారం రాదంటూ రైతును బెదరగొట్టి చేతిలో పెట్టింది రూ. 5 లక్షలు. ప్రభుత్వం ప్రకటించిన అసైన్డ్ భూముల ప్యాకేజీ ప్రకారం వారికి మాత్రం ఎకరానికి 1,000 గజాల నివాస స్థలం, 200 గజాల వాణిజ్య స్థలం రానున్నాయి. నివాస స్థలంలో గజం విలువ రూ. 10 వేలు ఉంటుందని అధికార పార్టీనేతలే ప్రచారం చేస్తున్నారు.

దాని ప్రకారం వెయ్యి గజాల విలువ కోటి రూపాయలు అవుతుంది. గజం వాణిజ్య స్థలం విలువ రూ. 15 వేలుంటుందని వారు చెబుతున్నదాన్ని బట్టి 200 గజాలకు రూ. 30 లక్షలు అవుతుంది. అంటే ఎకరా అసైన్డ్ భూమికి గాను రూ. 1.30 కోట్లు పరిహారంగా పొందనున్నారు. దీంతో పాటు ఏటా రూ.30వేల చొప్పున పదేళ్లపాటు పరిహారం కూడా లభించనుంది. ఇది మెట్టప్రాంత రైతులకిచ్చే పరిహారం మాత్రమే. జరీబు భూములకు ఈ పరిహారం ఇంకా ఎక్కువ ఉంది. వెయ్యి గజాల నివాస స్థలం, 450 గజాల వాణిజ్య స్థలం ఇస్తామని చెబుతున్నారు. అంటే ఎకరా ఇచ్చినవారు రూ. 1.90 కోట్లు పరిహారంగా పొందుతారన్నమాట. దాంతోపాటు ఏటా రూ.50 వేల చొప్పున పదేళ్లపాటు పరిహారం అందనుంది. బడుగు రైతుకు ఐదులక్షలు విదిల్చిన బాబుగారి బినామీలు అలా కోట్లలో కాజేయబోతున్నారు. సాధారణ రైతులకు ఈ పరిహారాలు అందుతాయో లేదో గానీ అధికారపార్టీ నేతలు.. అందులోనూ ‘ముఖ్య’నేతల బినామీలు కాబట్టి వారికి మాత్రం పక్కాగా అందుతాయనే దాంట్లో ఎలాంటి సందేహమూ అక్కర్లేదు. అందువల్ల ఎటు చూసినా రాజధాని పేరుతో సాగుతున్న తంతులో సాధారణ రైతులు, దళితులు మాత్రమే నష్టపోతున్నారు.

 1,800 ఎకరాలు కైంకర్యం..
రాజధాని ప్రాంతంలో అసైన్డ్ భూములు 2,600 ఎకరాలుండగా అధికార పార్టీ నేతలు దాదాపు 1,800 ఎకరాల వరకు కైంకర్యం చేశారు. ఇందులో మెట్ట 1,300 ఎకరాలు, జరీబు భూములు 500 ఎకరాల వరకు ఉంటాయని అంచనా. అందులో ఎకరా మెట్ట భూమికి రూ. 1.30 కోట్ల చొప్పున 1,300 ఎకరాలకు గాను రూ. 1,690 కోట్లు, జరీబు భూములు ఎకరాకు రూ.1.90 కోట్ల చొప్పున 500 ఎకరాలకు రూ. 950 కోట్లు కొట్టేశారు. అంటే మొత్తం రూ. 2,640 కోట్లు. కానీ 1,800 ఎకరాలకు గాను పేద దళిత రైతులకు ఇచ్చింది రూ. 9 కోట్లకు లోపే.

 పేద రైతులను ఇలా మోసగించారు...
‘సీఆర్‌డీఏ’ భూ సమీకరణ విషయంలో టీడీపీ సర్కారు ఆది నుంచి మోసపూరితంగా వ్యవహరించింది. అసైన్డ్ భూములకు పరిహారం ఇస్తామనే విషయాన్ని ప్రకటించకుండా దాచి ఉంచడం ద్వారా పేదలు, ఎస్సీ, ఎస్టీల చేతుల్లో భూములు లేకుండా పోయేలా కుట్రపూరితంగా వ్యవహరించింది. ‘అసైన్డ్ భూములను ప్రభుత్వం సీఆర్‌డీఏ కోసం వెనక్కు తీసుకుంటుంది. ప్రభుత్వం తీసుకుంటే పైసా కూడా రాదు. మాకు అమ్ముకుంటే అంతో ఇంతో ఇస్తాం. కుటుంబ అవసరాలకు వస్తుంది... ’ అని చెప్పడం ద్వారా పేదలను అధికారపార్టీ నేతలు భయపెట్టారు. అక్కడి రెవెన్యూ, సీఆర్‌డీఏ అధికారులు కూడా అసైన్డ్ భూములకు పరిహారం రాదంటూ వారికి వంతపాడారు.

దీంతో పేదలు  ఆందోళనకు గురై దిక్కుతోచక ఊరికే భూమి పోతుందనే భయంతో తమ అసైన్డ్ భూములను నామమాత్రపు ధరకు టీడీపీ నేతలకు రాయించారు. ప్రభుత్వం ఇలా మోసపూరితంగా వ్యవహరించకుండా ముందే అసైన్డ్ భూములకు కూడా పట్టా భూములతో సమానంగా పరిహారం ఇస్తామని (బుధవారం జీవో ఇచ్చిన ప్రకారం) బహిరంగంగా ప్రకటించి ఉంటే పేదలు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు పప్పు బెల్లాలకు చందంగా భూములు అమ్మేవారు కాదు. ప్రభుత్వ పెద్దలు ఇలా మోసపూరితంగా పరిహారం విషయాన్ని ప్రకటించకుండా రహస్యంగా ఉంచడం వెనుక పేదల నుంచి కారు చౌకగా భూములు కొనాలనే స్వార్థమే కారణం. వారి లక్ష్యం నెరవేరింది. అంతిమంగా పేదలు దారుణంగా నష్టపోయారు.

 చట్టానికి తూట్లు
1954 జూన్ 18వ తేదీ తర్వాత ప్రభుత్వం ఇచ్చిన అసైన్‌మెంట్ (పేదలకు ఇచ్చిన) భూములను వారు లేదా వారి వారసులు అనుభవించి ఫలసాయం పొందాలే గానీ ఎవరికీ బదలాయించడానికి వీలులేదు. అనగా ఈ తేదీ తర్వాత అసైన్‌మెంట్ కింద భూములు పొందిన వారికి విక్రయించే హక్కు లేదు. ఎవరైనా కొనుగోలు చేసినా ప్రభుత్వం స్వాధీనం  చేసుకుని ప్రజోపయోగ కార్యక్రమాలకుగానీ, వేరే పేదలకు గానీ ఇవ్వాలి. 1977 ప్రొహిబిషన్ ఆఫ్ ట్రాన్స్‌ఫర్ (పీఓటీ) యాక్టు ఇదే చెబుతోంది.

 చంద్రబాబు సర్కారు చేస్తున్నదేమిటి?
అసైన్డ్ భూములను విక్రయించుకునేందుకు వీలుగా 1988 పీఓటీని సవరించాలని చంద్రబాబు సర్కారు ప్రయత్నాలు ఆరంభించింది. ఇందులో భాగంగానే ఈ చట్ట సవరణకు అవసరమైన ప్రతిపాదనలు పంపాలని ప్రభుత్వం కోరింది.  కొన్ని రాష్ట్రాల్లో అసైన్‌మెంట్ భూములను విక్రయించుకునేలా చట్టం ఉందని,  అదే విధంగా సవరించుకోవచ్చంటూ రాష్ట్ర భూ పరిపాలన ప్రధాన కమిషనరేట్  ప్రభుత్వానికి ప్రత్యుత్తరమిచ్చింది. దీనిపై స్పష్టమైన సమాచారంతో ప్రతిపాదన పంపాలని ముఖ్యమంత్రి కార్యాలయం ఆదేశించినట్లు మీడియాలో వార్తలు రావడం, ప్రజల్లో వ్యతిరేకత వస్తుందని ప్రభుత్వానికి సమాచారం రావడంతో తాత్కాలికంగా ఈ ప్రతిపాదనను ఆపి ఉంచాలని మౌఖికంగా ఆదేశించింది.

తాతల కాలం నుంచి సాగులో..
వెలగపూడి గ్రామంలోని సర్వే నంబరు 270లోని 52 సెంట్ల అసైన్డు భూమిని తాతల కాలం నుంచి సాగు చేసుకుని కుటుంబాన్ని పోషించుకుంటున్నాం. అసైన్డు భూమిని రాజధాని నిర్మాణ నిమిత్తం ల్యాండ్ పూలింగ్‌కు ఇచ్చా. ఇటీవల రాజధాని శంకుస్థాపనకు బట్టలు కూడా పంపిణీ చేశారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులు, అధికార పార్టీ నేతలు అసైన్డు భూములకు పరిహారం ఇవ్వరని ప్రచారం చేశారు. దాంతో ఆందోళన చెంది భూమి అమ్ముకున్నాం. అప్పుడే ప్రభుత్వం పరిహారం ప్రకటించివుంటే మాకు బాగుండేది.
                                            - మెండెం ఆదెయ్య, అసైన్డు భూమి రైతు
అసలైన లబ్ధిదారులకు న్యాయం చేయాలి..

తరాల నుంచి సాగు చేసుకుంటున్న మా భూములు అసైన్డు భూములని,  కనుక చెక్కులు ఇవ్వడం కుదరదని అధికారులు సాకులు చెబుతున్నారు. 50 సెంట్ల భూమిలో వరి, పత్తి, మొక్కజొన్న పంటల సాగుతో కుటుంబాన్ని పోషించుకునేవాడిని. రాజధాని నిర్మాణానికి భూమిని ల్యాండ్ పూలింగ్‌కు ఇచ్చా. రాజధాని భూ సమీకరణ అనంతరం అసైన్డు భూములకు పరిహారం రాదని ప్రచారం నేపథ్యంలో తక్కువ ధరకే భూమి అమ్ముకున్నాం. ఇప్పుడు మళ్లీ ప్రభుత్వం పరిహారం ప్రకటించడం వల్ల అమ్ముకున్న మా లాంటి రైతులు నష్టపోయారు కానీ కొనుగోలు చేసిన వారు మాత్రం లాభంపొందారు. అసలైన లబ్ధిదారులు నష్టపోయారు. కొనుగోలు చేసిన వారు మాత్రం ప్రభుత్వ పరిహారంతో కోట్లు గడిస్తారు. ఇప్పటికైనా అసలైన లబ్ధిదారులకు ప్రభుత్వం న్యాయంచేయాలి. - మెండెం వెంకటేశ్వర్లు, అసైన్డు భూమి రైతు

చట్టానికి తూట్లు
1954 జూన్ 18వ తేదీ తర్వాత ప్రభుత్వం ఇచ్చిన అసైన్‌మెంట్ (పేదలకు ఇచ్చిన) భూములను వారు లేదా వారి వారసులు అనుభవించి ఫలసాయం పొందాలే గానీ ఎవరికీ బదలాయించడానికి వీలులేదు. అనగా ఈ తేదీ తర్వాత అసైన్‌మెంట్ కింద భూములు పొందిన వారికి విక్రయించే హక్కు లేదు. ఎవరైనా కొనుగోలు చేసినా ప్రభుత్వం స్వాధీనం  చేసుకుని ప్రజోపయోగ కార్యక్రమాలకుగానీ, వేరే పేదలకు గానీ ఇవ్వాలి. 1977 ప్రొహిబిషన్ ఆఫ్ ట్రాన్స్‌ఫర్ (పీఓటీ) యాక్టు ఇదే చెబుతోంది.

 చంద్రబాబు సర్కారు చేస్తున్నదేమిటి?
అసైన్డ్ భూములను విక్రయించుకునేందుకు వీలుగా 1988 పీఓటీని సవరించాలని చంద్రబాబు సర్కారు ప్రయత్నాలు ఆరంభించింది. ఇందులో భాగంగానే ఈ చట్ట సవరణకు అవసరమైన ప్రతిపాదనలు పంపాలని ప్రభుత్వం కోరింది.  కొన్ని రాష్ట్రాల్లో అసైన్‌మెంట్ భూములను విక్రయించుకునేలా చట్టం ఉందని,  అదే విధంగా సవరించుకోవచ్చంటూ రాష్ట్ర భూ పరిపాలన ప్రధాన కమిషనరేట్  ప్రభుత్వానికి ప్రత్యుత్తరమిచ్చింది. దీనిపై స్పష్టమైన సమాచారంతో ప్రతిపాదన పంపాలని ముఖ్యమంత్రి కార్యాలయం ఆదేశించినట్లు మీడియాలో వార్తలు రావడం, ప్రజల్లో వ్యతిరేకత వస్తుందని ప్రభుత్వానికి సమాచారం రావడంతో తాత్కాలికంగా ఈ ప్రతిపాదనను ఆపి ఉంచాలని మౌఖికంగా ఆదేశించింది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement