ప్రొద్దుటూరు: చిన్న కేసు దర్యాప్తులో కూడా పోలీసులు తొమ్మిది నెలలు అయినా పురోగతి సాధించలేదు. తన తల్లి మృతి కేసు విచారణలో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు పోలీసులపై చర్యలు తీసుకోవాలని తాను హైకోర్టును ఆశ్రయించనున్నట్లు బాధితుడు షేక్ నజీర్ తెలిపారు. బాధితుని కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. నజీర్ తల్లి ఖాదర్‌బీ (60) ఇందిరానగర్‌లో చిరువ్యాపారం చేసుకుంటూ జీవనం సాగించేది.
గతేడాది నవంబర్ 19న మార్కెట్‌కు సరుకుల కోసం వెళ్లేందుకు సమీపంలోని కొర్రపాడు రోడ్డుపై నిలిచి ఉండగా ఆమెను ద్విచక్రవాహనం ఢీకొంది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయ పడింది. వెంటనే 108 వాహనం ద్వారా స్థానిక జిల్లా ఆస్పత్రిలో చేర్పించి అక్కడి నుంచి తిరుపతికి తరలించారు. ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందినా పోలీసులు కేసు మాత్రం నమోదు చేయలేదు.
జిల్లా ఆస్పత్రి నుంచి మెరుగైన చికిత్స కోసం తిరుపతి స్విమ్స్ ఆస్పత్రికి తరలించారు. ఇతర పనులపై చెన్నైకి వెళ్లిన నజీర్ విషయం తెలుసుకుని తిరుపతిలోని తన తల్లి వద్దకు వచ్చాడు. అదే నెల 28న ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేశారు. పోలీసు కేసు నమోదు కాకపోవడంతో చేతి నుంచి ఖర్చు పెట్టుకుని వైద్యం చేయించారు.
ఈ సంఘటనపై నజీర్ అప్పటి స్థానిక ట్రాఫిక్ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. ‘మేము వాహనాన్ని ఎలా గుర్తించగలమని, నీవే వాహనం నంబర్ కనుగొని చెప్పాలి’ అని అనడంతో ఆయన నివ్వెరపోయాడు. ఈ విషయంపై పైస్థాయి అధికారులను కలిసి విన్నవించినా, ఫలాన వ్యక్తిపై అనుమానం ఉందని చెప్పినా స్పందించలేదు. మళ్లీ ఖాదర్‌బీ ఆరోగ్యం విషమించడంతో స్థానిక ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. ఆమె చికిత్స పొందుతూ గతేడాది మార్చి 17న మృతి చెందింది.
మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయించిన బాధితుడు:
తన తల్లి రోడ్డు ప్రమాదం గురించి ఎన్ని మార్లు, ఎవరికి చెప్పినా పోలీసులు కేసు నమోదు చేయకపోవడంతో విసుగు చెందిన నజీర్ పలువురి సహకారంతో గతేడాది ఏప్రిల్ 12న ఆంధ్రప్రదేశ్ స్టేట్ హ్యుమన్ రైట్స్ కమిషన్‌ను ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు. హెచ్‌ఆర్‌సీ నంబర్ 5295 మేరకు కేసు విచారణ చేయాలని అప్పటి ఎస్పీ నవీన్‌గులాఠిని కమిషన్ ఆదేశించారు.
పూడ్చిన మృతదేహాన్ని గతేడాది అక్టోబర్ 1న పోలీసులు వెలికి తీయించి రిమ్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎస్.సుధాకర్‌చే పోస్టుమార్టం నిర్వహింపజేశారు. ఎర్రన్నకొట్టాలకు చెందిన కొట్టం శివయ్యతోపాటు మొత్తం ముగ్గురు వ్యక్తులు ద్విచక్రవాహనాన్ని వేగంగా నడపడంతో ప్రమాదం జరిగిందని తేల్చారు. గత ట్రాఫిక్ ఎస్‌ఐ హుసేన్ ఈ మేరకు కేసు నమోదు చేసి విచారణ చేపట్టగా ప్రస్తుత ట్రాఫిక్ ఎస్‌ఐ జావిద్ చార్జిషీట్ వేశారు.
క్రైం నంబర్ 242/2015గా పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ పూర్తి సమాచారాన్ని ఎస్పీ నవీన్‌గులాఠి ఈ ఏడాది ఏప్రిల్ 1న మానవహక్కుల కమిషన్ డిప్యూటీ రిజిస్ట్రార్‌కు పంపడంతో వారు బాధితుడు నజీర్‌కు కేసు వివరాలు తెలిపారు. ఇదిలా ఉండగా ఖాదర్‌బీ మరణంతో మానసికంగా కుంగిపోయిన ఆమె భర్త మహబూబ్ గతేడాది డిసెంబర్ 27న మృతి చెందాడు.
అధికారి వివరణ:
ఈ విషయంపై ట్రాఫిక్ ఎస్‌ఐ జావీద్‌ను వివరణ కోరేందుకు ప్రయత్నించగా ఆయన సెలవులో ఉన్నారు. సెల్‌ఫోన్ కూడా పని చేయలేదు. ఇన్‌చార్జి బాధ్యతలు నిర్వహిస్తున్న త్రీటౌన్ ఎస్‌ఐ మహేష్‌ను వివరణ కోరగా.. తాను పరిపాలన వరకేనని, కేసులన్నీ ఆ స్టేషన్ సిబ్బందే చూసుకుంటున్నారని తెలిపారు. కేసుకు సంబంధించిన పూర్తి సమాచారం తనకు తెలియదని పేర్కొన్నారు.
ఎన్నాళ్లైనా... అంతేనా!
Published Mon, Jun 27 2016 2:55 AM | Last Updated on Tue, Aug 21 2018 5:54 PM
Advertisement
Advertisement