పిల్లలు పుట్టలేదని చంపేశారు!
పిల్లలు పుట్టలేదని చంపేశారు!
Published Sat, Apr 8 2017 9:56 PM | Last Updated on Mon, Jul 30 2018 8:37 PM
- పోలీసులకు ఫిర్యాదు చేసిన తల్లిదండ్రులు
- అనుమానాస్పద మృతి కేసు నమోదు
- ఐరన్‌గల్‌లో ఘటన
కోసిగి/ఆదోని టౌన్: పిల్లలు పుట్టలేదని తమ కుమార్తె ఆవుల కవిత(30)ను కొట్టి చంపేశారని తల్లిదండ్రులు యంకమ్మ, నర్సింహారెడ్డి..శనివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు కోసిగి ఎస్‌ఐ ఇంతియాజ్ బాషా విలేకరులకు తెలిపారు. ఎస్‌ఐ, మృతురాలి తల్లిదండ్రులు తెలిపిన వివరాల మేరకు .. కోసిగి మండలం ఐరన్‌గల్‌కు చెందిన విశ్వనాథరెడ్డితో తొమ్మిదేళ్ల క్రితం తిమ్మాపురం గ్రామానికి చెందిన ఆవుల కవితకు వివాహమైంది.
పెళ్లి సందర్భంగా లక్షా యాభై వేల రూపాయల నగదు, రెండు తులాల బంగారం కట్నకానుకల కింద ఇచ్చారు. పెళ్లై తొమ్మిదేళ్లైనా సంతానం కలుగకపోవడంతో అత్తింట్లో శారీరకంగా, మానసికంగా వేధింపులు ప్రారంభమయ్యాయి. రెండు రోజుల క్రితం కవితపై భర్త, అత్తమామలు దాడి చేసి తీవ్రంగా గాయపరిచారని తల్లిదండ్రులు పోలీసుల ఫిర్యాదులో పేర్కొన్నారు. దాడిలో గాయపడిన కవితను శుక్రవారం ఆదోని ఏరియా ఆసుపత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ రాత్రి పొద్దుపోయాక మృతిచెందిందని తల్లిదండ్రులు చెప్పారు. తమ కూతురుపై విచక్షణారహితంగా దాడి చేయడం వల్లనే మృతి చెందిందని , ఇందుకు కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని పోలీసులను కోరారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ ఇంతియాజ్ బాషా తెలిపారు.
Advertisement
Advertisement