‘పెండింగ్’ పవర్..!
♦ జిల్లాలో మైనర్ పంచాయలకు గుదిబండగా మారిన విద్యుత్ బిల్లులు
♦ మూడున్నరేళ్లవుతున్నా కనిపించని టీడీపీ వాగ్దానం
♦ అక్టోబర్ 2లోపు విద్యుత్ బకాయిలు చెల్లించకుంటే చలో అమరావతి
♦ సన్నద్ధం అయిన సర్పంచ్‌లు
ఒంగోలు టూటౌన్ :
‘మైనర్ గ్రామ పంచాయతీల విద్యుత్ బిల్లులను గతంలో తెలుగుదేశం ప్రభుత్వం చేసి విధంగానే భరిస్తాం. ఒక్క రూపాయి కూడా పంచాయతీలు చెల్లించవద్దు’ ఈ హామీని 2014 ఎన్నికల ప్రచార సమయంలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఇచ్చారు. దీనిని నాటి ఎన్నికల మ్యానిఫెస్టోలో కూడా పెట్టారు. అయితే ప్రస్తుతం టీడీపీ అధికారంలోకి వచ్చి మూడున్నరేళ్లు దాటినా నేటికీ ఆ హామీ అమల్లోకి రాలేదు.
పేరుకుపోతున్న బకాయిలు
ప్రస్తుతం గ్రామ పంచాయతీల్లో విద్యుత్ బకాయిలు పెరుగుతున్నాయి. ఎప్పటికప్పుడు విద్యుత్ శాఖ నోటీసులను పంపిస్తూ హెచ్చరిస్తూనే ఉంది. ప్రస్తుతం ఏయే పంచాయతీ ఎంతెంత చెల్లించాలో అధికారులు జాబితా సిద్ధం చేస్తున్నారు. దీనిపై మైనర్ గ్రామ పంచాయతీల సర్పంచ్‌లు, కార్యదర్శులు ఆందోళన చెందుతున్నారు. పంచాయతీలకు అనుకున్న ఆదాయం లేకపోవడం విద్యుత్ బకాయిలు చెల్లించలేని స్థితిలో ఉన్నాయి.
1030 పంచాయతీలు
జిల్లాలో మొత్తం 1030 గ్రామ పంచాయతీలుండగా వీటిలో మైనర్ గ్రామ పంచాయతీలు 750 పైగా ఉన్నాయి. రూ. 5 వేల నుంచి రూ. 10 వేలకు పైగా ప్రతి నెలా విద్యుత్ బిల్లులు వస్తుంటాయి. అయితే స్థానికంగా వచ్చే ఆదాయం అంతగా లేకపోవడంతో దశాబ్దాలుగా పంచా యతీ పాలకవర్గాలు ఆర్థిక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నాయి. కేవలం కేంద్రం అభివృద్ధి పనులకు విడుదల చేసే 13, 14వ ఆర్థిక నిధులు తప్ప.. మరొక ఆదాయం రాని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో విద్యుత్ శాఖ అధికారులు విద్యుత్ బిల్లులు చెల్లించాలని అడుగుతుండటంతో సర్పంచులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు.
రూ. 20 కోట్లు?
2014 డిసెంబర్ చివరిలో ఒక దఫా జిల్లా వ్యాప్తంగా పాతబకాయిలను చెల్లించినట్లు సర్పంచుల సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు జి. వీరభద్రాచారి తెలిపారు. తిరిగి అప్పటి నుంచి ఇప్పటి వరకు పెరిగిన బకాయిల చెల్లింపుల గురించి చర్చకు రాలేదని తెలిపారు. ప్రస్తుతం దాదాపు రూ.20 కోట్ల వరకు బకాయిలుంటాయని చెప్పారు. 2014 ఎన్నికల సమయంలో మైనర్ పంచాయతీలకు విద్యుత్ బకాయిలు ప్రభుత్వమే చెల్లిస్తామన్న బాబు తన హామీని అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. పెరుగుతున్న విద్యుత్ బకాయిలు చెల్లించడానికి మైనర్ పంచాయితీలకు తగిన ఆదాయం లేదని తెలిపారు. బకాయిలు చెల్లించేలా చర్యలు చేపట్టకపోతే అక్టోబర్ 2 న చలో అమరావతి కార్యక్రమం చేపడతామని హెచ్చరించారు. దీనికి సర్పంచలంతా సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు.