టీ-టీడీపీకి ఎక్కువ సమయమివ్వలేను
ఏపీలో పని ఒత్తిడి ఎక్కువగా ఉంది: చంద్రబాబు
సాక్షి, విజయవాడ బ్యూరో: ఆంధ్రప్రదేశ్‌లో పనిఒత్తిడి ఎక్కువగా ఉండడం వల్ల.. తెలంగాణ టీడీపీ వ్యవహారాలకు తాను ఎక్కువ సమయం కేటాయించలేనని టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు టీటీడీపీ నేతలకు చెప్పినట్లు తెలిసింది. బుధవారం విజయవాడలోని ఏపీ సీఎం క్యాంపు కార్యాలయంలో.. తెలంగాణ టీడీపీ నేతలు రేవంత్‌రెడ్డి, ఎల్.రమణ, మోత్కుపల్లి నర్సింహులు, గరికపాటి మోహనరావు, మాగంటి గోపీనాథ్ తదతరులు చంద్రబాబును కలిశారు.
బుధవారం ఉదయం విడివిడిగా వారితో మాట్లాడిన చంద్రబాబు.. సాయంత్రం అందరితో కలసి సమావేశమయ్యారు. తెలంగాణలో టీడీపీని టీఆర్‌ఎస్‌లో విలీనం చేయాలని ఆ పార్టీ శాసనసభాపక్ష నేత ఎర్రబెల్లి దయాకరరావు స్పీకర్‌కు ఇచ్చిన లేఖపై, తెలంగాణలో పార్టీ పటిష్టతపై వారితో చర్చించారు. తెలంగాణలో టీడీపీ క్యాడర్ బలంగానే ఉందనీ, వారిలో ఉత్సాహాన్ని నింపేలా నాయకులు సఖ్యతగా పనిచేస్తే పార్టీ మళ్లీ పటిష్టమవుతుందని చంద్రబాబు వారికి సూచించారు.