రెవెన్యూ శాఖలో సమూల మార్పులు
Published Sun, Jan 1 2017 11:21 PM | Last Updated on Mon, Oct 1 2018 2:09 PM
– భూ సమస్యలన్నింటికీ పరిష్కారం
– డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి వెల్లడి
కర్నూలు (అగ్రికల్చర్): రెవెన్యూ శాఖ మంత్రిగా ఆ శాఖలో సమూలమైన మార్పులు తెచ్చానని.. మీ ఇంటికి మీ భూమి పేరుతో రైతులు ఎదుర్కొనే అనేక సమస్యలను పరిష్కరించినట్లు డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి తెలిపారు. ఆదివారం తన క్యాంపు కార్యాలయంలో 2017 జిల్లా అభివృద్ధి, పత్తికొండ నియోజకవర్గ అభివృద్ధిపై ముద్రించిన పుస్తకాన్ని ఆయన విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం తాను ఉప ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పూర్తి అయి జాతికి అంకితం చేస్తున్నందుకు సంతోషంగా ఉందన్నారు. జిల్లాలో 106 చెరువులకు హంద్రీనీవా నుంచి నీటి అందించడంతోపాటు 1.50 లక్షల ఎకరాలకు అదనంగా నీరిచ్చేందుకు చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. జిల్లాను గణనీయంగా అభివృద్ధి చేశానని, వచ్చే ఎన్నికల్లో తన కుమారుడున్ని పోటీకి దింపి తాను ఇంట్లో కూర్చున్నా గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్, ఎమ్మెల్సీలు శిల్పా చక్రపాణిరెడ్డి, సుధాకర్‌బాబు, ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి, జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్, జేసీ హరికిరణ్ , జిల్లా గొర్రెల పెంపకందారుల సంఘం అధ్యక్షుడు నాగేశ్వరరావు, జిల్లా సహకార కేంద్రబ్యాంకు చైర్మన్ మల్లికార్జున రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Advertisement