వీఆర్వోల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి
- రైతులకు సకాలంలో ఈ పాసుపుస్తకాలు ఇవ్వాలి
- రెవెన్యూ సిబ్బందితో డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి
దేవనకొండ: రైతులు ఈ–పాసు పుస్తకాలకు దరఖాస్తు చేసుకుంటే కారణాలు చెప్పకుండా ఎందుకు తిరస్కరిస్తున్నారు. ఇక నుంచి ఇలాంటివి మళ్లీ పునరావృతమైనా, పనితీరు మార్చుకోకపోయినా విధుల నుంచి తొలగిస్తామని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి రెవెన్యూ అధికారులను, సిబ్బందిని హెచ్చరించారు. మంగళవారం ఆయన పత్తికొండకు వెళ్తూ దేవనకొండలోని తహసీల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. తరా్వత జేసీ హరికిరణ్, ఆర్డీఓ ఓబులేష్, రెవెన్యూశాఖ అధికారులతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలో 417 మంది ఈ–పాసు పుస్తకాలకు దరఖాస్తులిసే్త ఎందుకు రిజెక్ట్ చేశారని సిబ్బందిని ప్రశ్నించారు. ఈ–పాసుపుస్తకాలను 30 రోజులు గడిచినా ఎందుకు ఇవ్వడం లేదో తనకు కారణాలు చెప్పాలన్నారు.ఇక నుంచి రైతులు, ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ఆదేశించారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహించొద్దని సూచించారు. ప్రభుత్వ పథకాలు ప్రతి లబ్ధిదారుడికి అందేలా చూడాలన్నారు. రేషన్ పంపిణీలో అక్రమాలకు పాల్పడితే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. అనంతరం శిథిలావస్థలో ఉన్న తహసీల్దార్ కార్యాలయానికి నూతన భవనాలను నిర్మించేందుకు నిధులు విడుదల చేయాలని ఆర్డీఓ ఓబులేష్ డిప్యూటీ సీఎంకు విన్నవించారు. తర్వాత గాలిమరల ఏర్పాటులో భూములు కోల్పోయిన రైతులకు ఉపముఖ్యమంత్రి పరిహార చెక్కులను అందజేశారు. సమావేశంలో తహసీల్దార్ తిరుమలవాణి, డిప్యూటీ తహసీల్దార్ రంగన్న, ఎంపీడీఓ ఉమామహేశ్వరమ్మ, ఆర్‌ఐ ఆదిమల్లన్నబాబు, ఆయా గ్రామాల వీఆర్వోలు పాల్గొన్నారు.