నిరాశలో నిరుద్యోగులు
► ఉద్యోగ ప్రకటనల కోసం అభ్యర్థుల ఎదురుచూపులు
విజయనగరం: డిగ్రీ, పీజీలు చేత పట్టుకుని కోచింగ్ సెంటర్లలో ఉంటున్న నిరుద్యోగులు ఉద్యోగ ప్రకటనల కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. తూర్పుగోదావరి, శ్రీకాకుళం, విశాఖపట్టణం, తదితర ప్రాంతాల నుంచి వందలాది మంది అభ్యర్థులు జిల్లా కేంద్రంలోని పలు కోచింగ్ సెంటర్లలో శిక్షణలు తీసుకుంటున్నారు. ఓ పక్క శిక్షణ తీసుకుంటూనే నోటిఫికేషన్ ఎప్పుడు పడుతుందా అని వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. కోచింగ్ తీసుకోవడంతో పాటు స్థానిక లైబ్రరీలలో గంటల తరబడి చదువుతూ, ఓ రకంగా యజ్ఞమే చేస్తున్నారు.
జిల్లా కేంద్ర గ్రంథాలయం ఆవరణలో ప్రతి రోజూ ఉదయం, సాయంత్రం పుస్తకాలతో కుస్తీలు పడుతూ నోటిఫికేషన్ల కోసం ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా బ్యాంకింగ్, స్టీల్‌ప్లాంట్, రైల్వే, గ్రూప్స్, తదితర పరీక్షలకు ఎక్కువ మంది అభ్యర్థులు పోటాపోటీగా చదువుతున్నారు. చాలామంది అభ్యర్థులు ఇటీవల పంచాయతీ కార్యదర్శి పోస్టులకు తలపడ్డారు. అలాగే గ్రూప్ –2 ప్రిలిమినరీ పాసై మరో రెండురోజుల్లో జరగనున్న మెయిన్స్‌కు సిద్ధపడుతున్నారు. ఐబీపీఎస్‌లో 14 వేల ఖాళీలతో నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లు ప్రకటన వచ్చింది గాని ఇంతవరకు సైట్ ఓపెన్ కావడం లేదని అభ్యర్థులు తెలిపారు.
రెండేళ్లుగా నోటిఫికేషన్లు లేవు..
రెండేళ్లుగా సరైన నోటిఫికేషన్‌లు లేవు. ప్రభుత్వం క్యాలెండర్ ప్రకారం నోటిఫికేషన్లు విడుదల చేస్తే బాగుంటుంది. అలాగే ప్రైవేట్ రంగంలో కూడా రిజర్వేషన్లు కల్పించాలి. –రమేష్, నిరుద్యోగి