చాలా కాలతీతమైందని... పరిస్థితి చేయి దాటిందని... హిత బోధలూ, మందలింపుల వల్ల పనికాదని బీజేపీ అగ్ర నాయకత్వానికి అర్థమయి ఉండాలి. తరచు నోరు పారేసుకుంటున్న కొందరు నేతలను బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా ఆదివారం రప్పించి గట్టిగా మందలించారని మీడియాలో వార్తలొచ్చాయి. వివాదాస్పద వ్యాఖ్యలు చేసి నరేంద్ర మోదీ ప్రభుత్వ సానుకూల ఎజెండాకు తూట్లు పొడుస్తున్నారేమని నిలదీసినట్టు కథనాలు వెలువడ్డాయి. భాష మార్చుకోవాలని, పద్ధతిగా మాట్లాడటం నేర్చుకోవాలని ఆదేశించినట్టు కూడా లీకులు వచ్చాయి. తీరా మారిందేమీ లేదని సోమవారం ముంబై, ఢిల్లీల్లో జరిగిన వేర్వేరు ఉదంతాలు నిరూపించాయి.
ముంబైలో క్రికెట్ కంట్రోల్ బోర్డు కార్యాలయంపై శివసేన దాడి చేసి బోర్డు అధ్యక్షుడు శశాంక్ మనోహర్‌ను ఘెరావ్ చేసి, బీభత్సం సృష్టిస్తే...ఢిల్లీలో హిందూసేన జమ్మూ-కశ్మీర్‌కు చెందిన ఎమ్మెల్యే ఇంజనీర్ రషీద్‌పై ఇంకు కుమ్మరించింది. వీటితో మాకేమిటి సంబంధమని బీజేపీ నేతలు అనవచ్చు. ఇలాంటి ఉన్మాదులు రెచ్చిపోవడానికి అవసరమైన వాతావరణాన్ని దేశంలో కల్పించింది తామేనని ముందుగా గుర్తిస్తే తప్ప ఈ మాదిరి ఉదంతాలను నియంత్రించడం సాధ్యంకాదని వారు తెలుసుకోవాలి. గత ఏడాదిన్నర కాలంగా వివిధ నాయకులు ఎవరికిష్టం వచ్చినట్టు వారు మాట్లాడుతున్నా అగ్ర నాయకత్వం పట్టించుకోలేదు.
మరీ వివాదాస్పదం అయినప్పుడో...పార్లమెంటు స్తంభించే పరిస్థితి ఏర్పడ్డాకనో జోక్యం చేసుకోవడం తప్ప సాధారణ సమయాల్లో వారు మౌనంగా ఉండిపోయారు. కొన్ని సందర్భాల్లో అలాంటివారిని వెనకేసుకొచ్చారు. దాని ఫలితంగానే కిందిస్థాయిలో ఉన్మత్త ధోరణులు పెరిగాయి. ఇప్పుడవి చేయి దాటిపోయాయి. స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీ తన మనోగతాన్ని వ్యక్తంచేసినా...అమిత్ షా కొందరు నేతల్ని పిలిచి మందలించినా దిక్కూ మోక్కూ లేని స్థితి ఏర్పడింది. మోదీ రెండోసారి గట్టిగా హెచ్చరించిన మర్నాడే హర్యానా సీఎం మనోహర్‌లాల్ ఖట్టర్ నోరు జారారు. గొడ్డు మాంసం తినడాన్ని మానుకుంటేనే ఈ దేశంలో ముస్లింలు మనుగడ సాగించగలుగుతారని చెప్పారు. అందుకేనేమో అమిత్ షా రంగంలోకి దిగారు. దానివల్లా పెద్దగా ఫలితం లేదని బీజేపీ ఎంపీ సాక్షి మహరాజ్ రుజువు చేశారు. ఆయన ఎప్పటిలా తన ధోరణిలో తాను మాట్లాడారు. ‘మేమూ నాయకులమే. మందలించడానికీ, నోర్మూసుకోమని చెప్పడానికీ చిన్న పిల్లలం కాద’న్నారు. పైగా తమలాంటివారి మాటలవల్ల బిహార్‌లో పార్టీ ఇబ్బందికర పరిస్థితుల్లో పడుతున్నదన్న కథనాల పట్ల కూడా ఆయనకేమీ చింత కలుగుతున్నట్టు లేదు. ‘అదే జరిగితే నష్టపోయేది మోదీనో, అమిత్ షానో కాదు...బిహారే’ అని చెబుతున్నారు.
అమిత్ షా మాటల అంతరార్థం ఏమాత్రం తెలుసుకుని ఉన్నా...పార్టీకీ, కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వానికీ చెడ్డపేరు రాకుండా చూడాలనుకున్నా మహారాష్ట్రలోని ఫడణవీస్ ప్రభుత్వం అప్రమత్తంగా మెలిగేది. సరిగ్గా వారం క్రితం ముంబై నగరంలో సుధీంద్ర కులకర్ణిపై శివసేన కార్యకర్తల ఆగడాన్ని అక్కడి బీజేపీ-శివసేన ప్రభుత్వం అరికట్టలేక విమర్శలపాలైంది. మళ్లీ అదే నగరంలో సోమవారం క్రికెట్ కంట్రోల్ బోర్డు కార్యాలయంపై శివసేన కార్యకర్తలు దాడి చేయడం సామాన్యమైన విషయం కాదు. పాకిస్థాన్ క్రికెట్ బోర్డుతో చర్చలు వద్దంటూ ఈ చర్యకు దిగారు. ఈ పరిణామం తర్వాత చర్చలు ఢిల్లీలో జరపాలని నిర్ణయించారని కాస్సేపు చానెళ్లలో వార్తలొచ్చాయి.
ఇంతలోనే ఢిల్లీలో జమ్మూ-కశ్మీర్‌కు చెందిన ఎమ్మెల్యే ఇంజనీర్ రషీద్‌పై అక్కడి ప్రెస్ క్లబ్‌లో ఇంకుతో హిందూసేన కార్యకర్తలు దాడి చేశారు. ఈ దాడి పర్యవసానంగానో, మరే కారణం చేతనో ఆ చర్చలు కాస్తా రద్దయ్యాయి. ముంబై లాంటి మహా నగరంలో దాదాపు 50మంది కార్యకర్తల గుంపు ప్లకార్డులు పట్టుకుని బీసీసీఐ కార్యాలయంపై దాడికెళ్తుంటే ప్రభుత్వం నిద్రపోయిందా? పోలీసు బలగాలు చేష్టలుడిగి చూస్తూ ఉండిపోయాయా? ఆ వచ్చినవారు అదుపు తప్పి శశాంక్ మనోహర్‌పై దౌర్జన్యం చేసి ఉంటే పరిస్థితేమిటి? తమ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉంటూ చట్టవిరుద్ధమైన పనులకు పాల్పడుతుంటే సీఎం దేవేంద్ర ఫడణవీస్ శివసేనపై చర్య తీసుకోవడానికి ఎందుకు సందేహిస్తున్నారు?
కఠినంగా వ్యవహరించడానికి ముందుకు రాని పాలకుల వల్లే దేశవ్యాప్తంగా ఈ తరహా ఉదంతాలు చోటు చేసుకుంటున్నాయి. గొడ్డు మాంసం తిన్నారన్న వదంతుల పర్యవసానంగా ఒక కుటుంబంపై ఉన్మాదులు దాడి చేసి కుటుంబ యజమానిని పొట్టనబెట్టుకున్న తర్వాత...ఆవుల్ని తరలిస్తున్నారన్న కారణంతో హిమాచల్ ప్రదేశ్‌లో ఒకరిని, కశ్మీర్‌లో మరొకరిని దుండగులు హతమార్చారు. నాయకులు నోరు పారేసుకోవడం ఆగలేదు. సాహిత్య అకాడమీ అవార్డుల్ని వెనక్కి ఇస్తున్నవారిని ‘మీరు రాస్తే రాయండి...లేకపోతే మానుకోండ’ని ఎద్దేవా చేయడంతోపాటు ఇలాంటి వారి నేపథ్యంపై దర్యాప్తు జరపాల్సిన అవసరం ఉన్నదని ఒక కేంద్రమంత్రి చెప్పుకొచ్చారు. ఈ తిరుగుబాటు కావాలని సృష్టించిందేనని మరొక కేంద్రమంత్రి అవహేళన చేశారు.
ఎమర్జెన్సీలో మీరేం చేశారని ఇంకో మంత్రి ప్రశ్నించారు. ఇలా అనడం ద్వారా దేశంలో అలుముకున్న కలుషిత వాతావరణానికి సాధికారత కల్పిస్తున్నామని...ఉన్మాదుల చేతుల్లో ప్రాణాలు కోల్పోయిన వారిపట్ల అపచారం చేస్తున్నామని...నిత్యం భయంతో బతుకీడుస్తున్న మైనారిటీ వర్గాలవారిలో మరింత అభద్రతను, అవిశ్వాసాన్ని కలిగిస్తున్నామని వారు మరిచిపోతున్నారు. ఈ తరహా సమర్ధనలు విరమించుకుని, దాడులకు పాల్పడేవారిపట్ల, విద్వేషపూరిత ప్రకటనలు చేసేవారిపట్లా కఠినంగా వ్యవహరిస్తేనే పరిస్థితి చక్కబడుతుంది. కేంద్ర ప్రభుత్వమూ, బీజేపీ నాయకత్వమూ ఈ సంగతిని ఎంత త్వరగా గ్రహిస్తే అంత మంచిది.
తత్వం బోధపడిందా!
Published Tue, Oct 20 2015 2:16 AM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM
Advertisement
Advertisement