విద్య, ఉపాధిరంగాలకు వెలుగు | Bright for Education, Employment sectors in Ys rajasekhara reddy's rule | Sakshi
Sakshi News home page

విద్య, ఉపాధిరంగాలకు వెలుగు

Published Fri, Apr 25 2014 1:10 AM | Last Updated on Tue, Aug 14 2018 4:46 PM

విద్య, ఉపాధిరంగాలకు వెలుగు - Sakshi

విద్య, ఉపాధిరంగాలకు వెలుగు

(చింతికింది గణేష్): వైఎస్ రాజశేఖరరెడ్డి పాలనలో విద్య, ఉపాధి రంగాలు ఓ వెలుగు వెలిగాయి. ప్రాథమిక విద్య నుంచి ప్రొఫెషనల్ కోర్సుల వరకు కొత్త విధానాలు అవలంబించడం వల్ల ఎన్నో విద్యాసంస్థలు ఏర్పాటయ్యాయి. పేద విద్యార్థులు సైతం ఉన్నత విద్య అభ్యసించాలనే లక్ష్యంతో వైఎస్సార్.. ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం ప్రవేశపెట్టి వారికి చేయూత అందించారు. మహానేత కృషితో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, బిట్స్ వంటి ప్రతిష్టాత్మక సంస్థలు హైదరాబాద్‌లో ఏర్పాటయ్యాయి. సాంకేతిక విద్యను అందించే కళాశాలలు, ఫార్మసీ కాలేజీలు అనేకం హైదరాబాద్ పరిసరాల్లో ఏర్పాటయ్యాయి.
 
 వైఎస్ హయాంలో రాష్ట్రానికి వచ్చిన సంస్థలు
 హెచ్‌ఎస్‌బీసీ, కాగ్నిజెంట్ టెక్నాలజీ సొల్యూషన్స్, సిబే సిస్టమ్స్, సొనాటా, ఇంటె లి గ్రూప్, నొవార్టిస్, పత్నీ, హనీవెల్ టెక్నాలజీ సొల్యూషన్స్ ల్యాబ్, అమెజాన్ డాట్‌కామ్, వెరిజాన్, ఇన్‌ఫినిట్ హెల్త్ అండ్ వెల్‌నెస్ గ్రూప్, థామ్సన్ కార్పొరేషన్, ఆస్ట్రియా మైక్రో సిస్టమ్స్, సీమెన్స్, ఐకనోస్ కమ్యూనికేషన్స్, కంట్రీవైడ్ ఫైనాన్షియల్, మహీంద్రా-బీటీ టెలికాం, గేమ్‌లాఫ్ట్, సెలెక్టికా, ఐగేట్, జెన్‌ప్యాక్ట్, హెచ్‌సీఎల్ ఇన్ఫోసిస్టమ్స్, మెక్‌గ్రా హిల్, మైండ్ ట్రీ కన్సల్టింగ్, బ్యాంక్ ఆఫ్ అమెరికా.
 
సాంకేతిక విద్యకు పెరిగిన ప్రాధాన్యం
 వైఎస్ హయాంలో సాంకేతిక, వృత్తివిద్యకు అధిక ప్రాధాన్యం ఏర్పడింది. రాష్ట్రవ్యాప్తంగా 750కిపైగా ఇంజినీరింగ్ కాలేజీలు ఉంటే ఒక్క హైదరాబాద్ పరిసరాల్లోనే 30శాతం కళాశాలలు ఉండడం విశేషం. పదో తరగతి తర్వాత డ్రాపౌట్స్‌ను తగ్గించేందుకు వైఎస్ ప్రభుత్వం పాలిటెక్నిక్ కళాశాలలను విస్తరించింది. ప్రైవేటు కాలేజీలతోపాటు ఇంజినీరింగ్ కళాశాలల్లోనూ సెకెండ్ షిప్ట్ పద్ధతిలో పాలిటెక్నిక్ కోర్సుల నిర్వహణకు చర్యలు చేపట్టింది.
 
మైలురాయిగా ఐఐటీ క్యాంపస్
 హైదరాబాద్‌లో ఐఐటీ క్యాంపస్ ఏర్పాటు చేయాలని వైఎస్ ప్రభుత్వం అనేకమార్లు కేంద్ర మానవ వనరుల అభివృద్ధిశాఖ మంత్రికి లేఖలు రాసి చివరికి సాధించింది. క్యాంపస్ ఏర్పాటు కోసం తొలుత రాష్ట్రవ్యాప్తంగా అనేక ప్రాంతాలను ప్రతిపాదించినప్పటికీ ట్రాన్స్‌పోర్ట్, కనెక్టివిటీ కలిగి హైదరాబాద్‌కు 43 కిలోమీటర్ల దూరంలోని మెదక్ జిల్లా కంది గ్రామంలో ఏర్పాటుకు చర్యలు ప్రారంభించారు. జాతీయ రహదారికి ఆనుకుని 600 ఎకరాల్లో ఈ సంస్థను ఏర్పాటు చేశారు.
 
 బెస్ట్ క్యాంపస్‌గా బిట్స్ పిలానీ
 దేశంలోనే ప్రఖ్యాతిగాంచిన బిర్లా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్‌‌స పిలానీ మరో క్యాంపస్‌ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేయించడంలో వైఎస్ ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపింది. బిట్స్ యాజమాన్యం కొత్త క్యాంపస్‌లు ఏర్పాటు చేసే యోచనలో ఉందని తెలుసుకున్న ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధతో హైదరాబాద్‌లో కొత్తక్యాంపస్ ఏర్పాటు చేయించడంలో విజయం సాధించింది. 2008లో ఏర్పాటైన బిట్స్‌పిలానీ హైదరాబాద్ క్యాంపస్ స్వల్ప వ్యవధిలోనే బెస్ట్ అనిపించుకుంది.
 
 ట్రిపుల్ ఐటీ నిర్వహణ కోసం ఆర్‌జీయూకేటీ
 రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన ట్రిపుల్ ఐటీల నిర్వహణ కోసం వైఎస్సార్ ప్రత్యేకంగా ఓ యూనివర్సిటీనే స్థాపించారు. దానిపేరే  రాజీవ్‌గాంధీ సాంకేతిక, వైజ్ఞానిక విశ ్వవిద్యాలయం (ఆర్‌జీయూకేటీ). బాసర, ఇడుపులపాయ, నూజివీడులో రూ.800 కోటతో 2008లో ఏర్పాటు చేసిన ట్రిపుల్ ఐటీల ప్రత్యేక నిర్వహణ కోసం గచ్చిబౌలిలోని కేంద్ర ట్రిపుల్ ఐటీ ఆవరణలో దీనిని ఏర్పాటు చేశారు.
 
 టీఐఎఫ్‌ఆర్‌కు చొరవ

 టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసర్చ్ (టీఐఎఫ్‌ఆర్) హైదరాబాద్ క్యాంపస్ ఏర్పాటుకు వైఎస్ రాజశేఖరరెడ్డి ఎంతగానో కృషి చేశారు. 2008లో టీఐఎఫ్‌ఆర్ క్యాంపస్‌ల విస్తరణలో భాగంగా రాష్ట్రంలో దీనిని ఏర్పాటు చేసేందుకు వైఎస్సార్.. ప్రధానమంత్రికి స్వయంగా లేఖలురాశారు. యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ క్యాంపస్ ప్రాంగణంలోని 209 ఎకరాల భూమిని దీనికి కేటాయించారు.
 
 హెచ్‌ఎండీఏకు దార్శనికుడు..
 హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ(హెచ్‌ఎండీఏ)కు కొత్త రూపమిచ్చిన దార్శనికుడు వైఎస్ రాజశేఖరరెడ్డి. నగర శివార్లను అనుసంధానిస్తూ నాలుగు జిల్లాల పరిధిలో 849 గ్రామాలతో కలిపి మొత్తం 5965 చ.కి.మీ. విస్తీర్ణంలో  మాస్టర్‌ప్లాన్ రూపొందించడం ఆయన విజన్‌కు ప్రత్యక్ష నిదర్శనం. నగర విస్తరణ, ట్రాఫిక్ చిక్కుల నేపథ్యంలో 20 ఏళ్ల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని  అంతర్జాతీయ ప్రమాణాలతో ఔటర్ రింగ్‌రోడ్డుకు రూపకల్పన చేశారు. దేశంలోనే తొలిసారిగా రూపుదిద్దుకుంటున్న 8 లేన్ల ఎక్స్‌ప్రెస్ హైవే ఇది. సుమారు రూ.7వేల కోట్ల భారీ వ్యయంతో ఏకంగా 158 కి.మీ మేర నగరం చుట్టూ ఔటర్ రోడ్డును నిర్మించిన ఘనత వైఎస్‌కే దక్కింది. ఫలితంగా నగరంలోని కొన్ని మార్గాల్లో ట్రాఫిక్ ఒత్తిడి గణనీయంగా తగ్గింది.
 
 సైబరాబాద్ పోలీసింగ్ సత్వర సేవలు

 2007లో వైఎస్ సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ కోసం అత్యాధునిక వసతులతో కూడిన భారీ భవనాన్ని గచ్చిబౌలిలో నిర్మించారు. సైబరాబాద్ పరిధిలోని శాంతిభద్రతల కోసం బాలానగర్, శంషాబాద్, ఎల్బీనగర్, మల్కాజ్‌గిరి, మాదాపూర్‌గా ఐదు జోన్లు చేసి పౌరులకు సత్వర సేవలు అందేలా చర్యలు తీసుకున్నారు. బాధితుడు ఒక్క ఫోన్‌కాల్ చేస్తే స్వయంగా పోలీసులే అతని వద్దకు వచ్చి ఫిర్యాదు తీసుకునే కొత్త విధానానికి వైఎస్ శ్రీకారం చుట్టారు. ప్రజలకు పోలీసులు మరింత చేరువయ్యేందుకు ఠాణా పరిధిలోని ముఖ్య కూడళ్లలో ఔట్‌పోస్టులు  ఏర్పాటు చేయించారు.
 
 ఐటీకి జవసత్వాలు
వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ఐటీరంగ అభివృద్ధికి విశేషకృషి జరిగింది. బాబు అనంతరం పాలనా పగ్గాలు చేపట్టిన వైఎస్ హయాంలో ఐటీ అభివృద్ధి సైబర్ టవర్స్‌ను దాటి నగరం నలుచెరగులా విస్తరించింది. అసెంచర్, ఆప్‌ల్యాబ్స్, మైక్రోసాఫ్ట్, ఇన్ఫోసిస్, సీఎస్‌ఈ, ఒరాకిల్, విప్రో, జీఈ, ఐగేట్, ఏడీపీ, డెల్, డెలాయిట్, హెచ్‌ఎస్‌బీసీ, ఐబీఎం, సత్యం, బిర్లాసాఫ్ట్, టీసీఎస్, అమేజాన్, గూగుల్, హెచ్‌పీ, క్యాబ్‌జెమినీ, సీఏ, క్వాల్‌కామ్, సీటీఎస్, హెచ్‌సీఎల్, బ్యాంక్ ఆఫ్ అమెరికా, వేరీజాన్, పొలారిస్, సిరియా అట్లాంటిక్, సైబర్‌పెర్ల్, మైండ్‌స్పేస్ ఐటీ పార్క్, వ్యానన్‌బర్గ్ ఐటీపార్క్, ఫ్యూచురా ఐటీపార్క్ వంటివి ఏర్పాటయ్యాయి.
 
 ఫలితంగా ఐటీ అభివృద్ధి పరుగులు తీసింది.  2004-09 మధ్యకాలంలో హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, వరంగల్, కాకినాడ లో మొత్తం 1206 ఐటీ కంపెనీలు ఏర్పాటయ్యాయి. వీటి ఏర్పాటు ద్వారా సుమారు 2.51 లక్షలమందికి ప్రత్యక్షంగా, మరో ఆరు లక్షల మందికి పరోక్షంగా ఉపాధి లభించింది. అంతేకాక టైర్-2 నగరాలైన విజయవాడ, కాకినాడ, తిరుపతి, వరంగల్ నగరాల్లో ఐటీ అభివృద్ధికి పక్కా ప్రణాళికలు సిద్ధం చేశారు. 2007-08 మధ్యకాలంలో విశాఖపట్నంలో రూ.372 కోట్లతో పలు ఐటీ కంపెనీలు ఏర్పాటయ్యాయి. 2008-09మధ్య రూ.502 కోట్ల మేర పెట్టుబడులొచ్చాయి.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement