నాకు అర్థ బలం లేదు: కేజ్రీ
వారణాసి: ‘‘ఎన్నికల్లో పోరాడటానికి నా దగ్గర డబ్బులు లేవు. నా జేబులో కేవలం రూ.500 మాత్రమే ఉన్నాయి. కానీ సమాజంలో మార్పు తీసుకురావాలన్న ఉద్దేశంతోనే ఎన్నికల్లో పోరాడుతున్నా’’ అని ఆమ్ ఆద్మీ పార్టీ నేత అరవింద్ కేజ్రీవాల్ వెల్లడించారు. బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీని ఢీకొనేందుకు ఆయన పోటీ చేస్తున్న యూపీలోని వారణాసి లోక్‌సభ స్థానానికి కేజ్రీవాల్ బుధవారం నామినేషన్ దాఖలు చేశారు.
మొత్తం నాలుగు సెట్ల నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారికి సమర్పించారు. ఈ సందర్భంగా సమర్పించిన ఎన్నికల అఫిడవిట్‌లో తనకు రూ. 2.14 కోట్ల విలువైన స్థిర, చరాస్తులున్నట్లు కేజ్రీవాల్ పేర్కొన్నారు. తనకు ఎలాంటి అప్పులూ లేవని, తన భార్యకు మాత్రం రూ.41 లక్షల అప్పు ఉందని తెలిపారు. 2012-13లో తన మొత్తం ఆదాయం రూ.2,05,600 కాగా, తన భార్య ఆదాయం రూ.9,84,570 అని కేజ్రీవాల్ తన అఫిడవిట్‌లో పేర్కొన్నారు. వివిధ కోర్టుల్లో తనపై ఆరు కేసులు పెండింగ్‌లో ఉన్నాయన్నారు.
మోడీ, రాహుల్ ప్రచారమంతా నల్లధనంతోనే...
నామినేషన్‌కు ముందు నిర్వహించిన రోడ్ షోలో మోడీ, రాహుల్ గాంధీపై కేజ్రీవాల్ విరుచుకుపడ్డారు. ఎన్నికల ప్రచారం కోసం వారు భారీ మొత్తంలో నల్లధనాన్ని ఖర్చు చేస్తున్నారని ఆరోపించారు. ‘మోడీ రూ.5 వేల కోట్లు వెచ్చిస్తున్నారు. రాహుల్ కూడా భారీగా ఖర్చుపెడుతున్నారు. చానళ్లు, పత్రికలు, బిల్‌బోర్డులపై ప్రకటనల కోసం భారీగా సొమ్ము వెచ్చిస్తున్నారు. ఇదంతా నల్లధనమే. ఒకవేళ ఆయన (మోడీ) అధికారంలోకి వస్తే కనీసం రూ.5 లక్షల కోట్లు ఆర్జిస్తారు. అదంతా కూడా ప్రజల సొమ్మే అవుతుంది’ అని కేజ్రీవాల్ చెప్పుకొచ్చారు. మోడీ, రాహుల్‌ది హెలికాప్టర్ ప్రజాస్వామ్యమని ఎద్దేవా చేశారు. వారణాసి ప్రజలు తమకు హెలికాప్టర్ ప్రజాస్వామ్యం కావాలో లేక గ్రామాలకు వెళ్లే నాయకులు కావాలో తేల్చుకోవాలని సూచించారు. మోడీ, కేజ్రీవాల్‌లు తలపడుతున్న వారణాసి లోక్‌సభ నియోజకవర్గానికి మే 12న పోలింగ్ జరగనుంది. కాగా, మోడీ గురువారం వారణాసి నుంచి నామినేషన్ దాఖలు చేయనున్నారు.