ఇక శిబిరాలకు సన్నద్ధం | June 2 After Municipal Chairman Selection | Sakshi
Sakshi News home page

ఇక శిబిరాలకు సన్నద్ధం

Published Sun, May 11 2014 12:59 AM | Last Updated on Tue, Oct 16 2018 6:15 PM

June 2 After Municipal Chairman Selection

పరిషత్, మునిసిపల్ చైర్మన్ ఎన్నికవరకూ ఏర్పాట్లు
     ఫలితాల్లో నెగ్గినవారిని కాపాడుకునే యత్నాలు
     పధాన పార్టీల నేతలపై మరో భారం
     జూన్ 2 తరువాత జెడ్పీ, మున్సిపల్ చైర్మన్‌ల ఎన్నిక
     గెలవనున్న అభ్యర్థులకు పండగే...
     భార్య, పిల్లలతో విడిదికి రెడీ కానున్న సభ్యులు
 
 సాక్షి ప్రతినిధి, గుంటూరు :ప్రధాన రాజకీయ పార్టీల నేతలపై మరో కొత్త భారం పడనున్నది. ఫలితాల వెల్లడి తరువాత మండల, జిల్లా పరిషత్, మున్సిపల్ చైర్మన్‌ల ఎంపిక జరగాల్సి ఉంది. గతంలో వలే కాకుండా ఈ ఎంపిక ప్రక్రియకు కౌంటింగ్ తరువాత కనీసం 20 రోజుల వ్యవధి ఉండటంతో ప్రధాన రాజకీయ పార్టీలకు క్యాంపుల నిర్వహణ అనివార్యమైంది. ఇన్ని రోజులపాటు గెలిచిన అభ్యర్థులను తమకు అనుకూలంగా చేసుకోడానికి పెద్ద మొత్తంలో నిధులు ఖర్చు చేయాల్సి ఉంటుందని పార్టీలు భావిస్తున్నాయి. ఇందుకు అనుగుణంగా క్యాంపు రాజకీయాలకు నిధులు సమకూర్చుకునే యత్నంలో ఉన్నాయి. స్వాతంత్య్రంవచ్చిన తరువాత ఈ సార్వత్రిక ఎన్నికలు అత్యంత ఖరీదైనవని పరిశీలకులు భావిస్తున్నారు. ఇదే కోవలోకి చైర్మన్‌ల ఎంపిక కూడా చేరనుంది.
 
 జిల్లాలోని 12 మున్సిపాల్టీలకు మార్చి 30వ తేదీన ఎన్నికలు ముగిశాయి. ఎన్నికల షెడ్యూల్ ప్రకారం తొలుత ఏప్రిల్ 2న ఓట్ల లెక్కింపునకు అధికార యంత్రాంగం చర్యలు తీసుకుంది. వీటి లెక్కింపు జరిగితే మే నెలలో జరగనున్న సార్వత్రిక ఎన్నికలపై వీటి ఫలితాలు ప్రభావం చూపుతాయని కొందరు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై కోర్టు సానుకూలంగా స్పందిస్తూ మే 12న ఓట్ల లెక్కింపు చేపట్టి అదే రోజు ఫలితాలు వెల్లడించాలని ఆదేశాలు జారీ చేసింది. దీని ప్రకారం సోమవారం మున్సిపాల్టీల్లో ఓట్ల లెక్కింపునకు చర్యలు తీసుకుంది. ఎన్నికైన కౌన్సిలర్లు చైర్మన్‌ను వెంటనే ఎన్నుకునే అవకాశం లేకుండా పోయింది. ఈ ఎంపికలో ఎంపీ, ఎమ్మెల్యేలకు ఓటు వేసే సౌలభ్యం ఉండటంతోపాటు కొత్త రాష్ట్రం ఏర్పాటు జూన్ 2 న కావడంతో అప్పటి వరకు మున్సిపల్ చైర్మన్ కాగోరు అభ్యర్థులు తప్పక నిరీక్షించాల్సిందేనని అధికారులు చెబుతున్నారు. అదే విధంగా జిల్లా పరిషత్, మండల పరిషత్‌ల కౌంటింగ్ ఈ నెల 13న జరగనుంది. ఎన్నికైన జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులు చైర్మన్ అభ్యర్థులను ఎన్నుకునేందుకు జూన్ 2న వరకు నిరీక్షించాల్సిందే. ఫలితాల వెల్లడి తరువాత తమ పార్టీలకు చెందిన అభ్యర్థులను కాపాడుకునే యత్నంలో వైఎస్సార్ సీపీ, టీడీపీలు ఉన్నాయి. మండల పరిషత్, జిల్లా పరిషత్ చైర్మన్ పదవులను ఆశిస్తున్న నేతలు గెలిచిన సభ్యులతో క్యాంపులు నిర్వహించేందుకు సమాయత్తం అవుతున్నారు.
 
 వేసవి విడిది.. జిల్లాలోని 12 మున్సిపాల్టీలు, 57 మండల పరిషత్‌లు, జిల్లా పరిషత్‌ల చైర్మన్‌ల ఎంపిక వచ్చేనెల 2 తరువాత జరిగే అవకాశాలు ఉండటంతో అప్పటి వరకు గెలిచిన అభ్యర్థులను కాపాడుకునేందుకు వివిధ పార్టీలు క్యాంపు రాజకీయాలకు తెరలేపుతున్నాయి. ప్రస్తుతం వేసవి కావడంతో భార్య, పిల్లలతో క్యాంపులకు అభ్యర్థులు రెడీ అవుతున్నారు. గతంలో క్యాంపు రాజకీయాలు నాలుగైదు రోజులు జరిగేవి. ఇప్పటి పరిస్థితుల కారణంగా కనీసం 20 రోజులపాటు గెలిచిన సభ్యులను తమకు అనుకూలంగా ఉంచుకోవాలంటే పెద్ద మొత్తంలో నిధులు వ్యవయపరచాల్సి ఉంటుందని నేతలు భావిస్తున్నారు. పార్టీలు కూడా చైర్మన్ పదవులను ఆశిస్తున్న నేతలను ఈ ఖర్చుకు అవసరమైన నిధులు సమకూర్చుకోవాలని సూచిస్తున్నాయి. దీంతో కొందరు చైర్మన్ ఆశావహులు పుణ్యకేత్రాలకు వీరిని తీసుకువెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తుంటే మరి కొందరు ఇతర రాష్ట్రాలకు తీసుకువెళ్లేందుకు ట్రావెల్ ఏజెన్సీలను సంప్రదిస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement