ఒక తెలివైన ప్రేమ కథ
ప్రేమ గుడ్డిది.. అని అంటుంటారు. అన్ని ప్రేమల సంగతి ఏమిటో కానీ కొన్ని ప్రేమలు చాలా తెలివైనవి. అలాంటి ప్రేమ కథల్లో ఒకటి ‘టూ స్టేట్స్’. సంస్కృతి, సంప్రదాయాలపరమైన తేడాను, కులం గోడలను దాటి ప్రేమను విజయవంతం చేసుకొన్న ఒక తెలివైన జంట కథ ఇది. అహ్మదాబాద్ ఐఐఎమ్‌లో మొదలై నవలగా, ఇప్పుడు ‘2స్టేట్స్’ సినిమాగా థియేటర్లలో సందడి చేస్తున్న కథ ఇది.
ప్రపంచమంతా ప్రేమ పెళ్లిళ్లు సులభంగా జరిగిపోతాయి. అబ్బాయి అమ్మాయిని ప్రేమిస్తాడు, అమ్మాయి అబ్బాయిని ప్రేమిస్తుంది. వాళ్లిద్దరూ పెళ్లి చేసుకొంటారు. భారతదేశంలో మాత్రం ఇంకొన్ని మెట్లు ఉంటాయి. అబ్బాయి అమ్మాయిని, అబ్బాయిని అమ్మాయి ప్రేమించిన తర్వాత అమ్మాయి కుటుంబం అబ్బాయిని ప్రేమించాల్సి ఉంటుంది. అబ్బాయి కుటుంబం అమ్మాయిని ప్రేమించాల్సి ఉంటుంది.
ఇలాంటి దశల వారీ ప్రక్రియలా జరిగే ప్రేమ కథే 2 స్టేట్స్. చేతన్‌భగత్ నవలగా రచించిన తన సొంత ప్రేమ కథ ఇప్పుడు సినిమాగా మారింది. అర్జున్ కపూర్, ఆలియాభట్‌లు జంటగా వచ్చిన ఈ సినిమా కమ్ నవల కథ మన సంస్కృతిలో ప్రేమ ప్రయాణాన్ని కొనసాగించే జంటలకు ఆసక్తికరంగా ఉంటుంది.
ప్రేమించడానికి రెండు మనసులు కలిస్తే చాలు, కానీ పెళ్లి చేసుకోవాలంటే రెండు కుటుంబాలు కలవాలి. అలా కలవని సందర్భాల్లో... ఒకవైపు పరువు హత్యలు మరోవైపు పెద్దలను ఎదురించి చేసుకొని పెళ్లిళ్లు చేసుకొనే జంటలు.. ఇటువంటి పరిణామాల మధ్య పెద్దలను ఒప్పించి, రెండు కుటుంబాలను కలిపి ఒక్కటయ్యే జంట కమ్మని కథ ఇది. తన నవల 90 శాతం వినోదాన్ని 10 శాతం సొసైటీ రీఫార్మింగ్‌కోసం సందేశాన్ని ఇస్తుందని చేతన్‌భగత్ అంటాడు.
కాలేజీలో ఎంపిక చేసుకొన్న అమ్మాయికి ఎదురుపడితే ఎలా ఉంటుంది? అది కూడా తరచూ! ఆ ఎదురుపడటం యాదృచ్ఛికంగా జరిగిందని అవతలి వారికి అనిపించి కళ్లూకళ్లూ కలిశాయంటే సమ్మోహనం మొదలయినట్టే. ఇలాంటి సమ్మోహనమే మొదలవుతుంది అనన్య, క్రిష్‌ల మధ్య. ఐఐఎమ్‌లో ఇంటరాక్షన్ క్లాస్‌లోనే వారి పరిచయం మొదలవుతుంది.
మనిషి మనసులో ప్రేమ పుట్టడం అనేది హార్మోన్ల ప్రభావం అని, లవ్ ఈజ్ కెమిస్ట్రీ అని అంటారు శాస్త్రజ్ఞులు అయితే ఒక అమ్మాయి, అబ్బాయి చూపుల మధ్య ఒకేసారి అలాంటి కెమిస్ట్రీ వర్కవుటవ్వడం మాత్రం చాలా కష్టమైన పని. దాన్ని సాధించాలంటే చాలా కష్టమే ఉంటుంది. దానికి చొరవ కూడా ముఖ్యం. క్రిష్‌లో చొరవ ఉన్న దాన్ని ఎప్పటికప్పుడు రెసిస్ట్ చేస్తూ వచ్చిన ఆమె అప్పటికప్పుడు కన్విన్స్ కూడా అవుతూ ఉంటుంది. ఇంకేముంది వర్సిటీ డార్మ్‌రూమ్‌లోనే రొమాన్స్ మొదలు!
అంత వరకూ వాళ్లిద్దరికీ ఉన్న పరిచయం వేరు, పెళ్లి ఆలోచన వచ్చాక కలిగే పరిచయం వేరు. అబ్బాయి పంజాబీ హిందూ, అమ్మాయి తమిళ బ్రాహ్మణకుటుంబానికి చెందిన యువతి... సంప్రదాయాల్లోని సవాలక్ష తేడాలు. ఇరు కుటుంబాల పెద్దల అభ్యంతరాలు. కుటుంబాల మధ్య స్పర్థలతో పెళ్లి వద్దు, అనుకొనేంత వరకూ వెళుతుందామె. కానీ చివరకు తమ పెళ్లిని కాదన్న పెద్దలను ఒప్పించి, మెప్పించి పెళ్లి చేసుకోవడంతో కథ సుఖాంతం అవుతుంది.
మనది కులాల, మతాల, సంప్రదాయాల తేడాతో రంగురంగులుగా మెరిసే సీతాకోకచిలుక లాంటి సమాజం. ఇలాంటి వ్యవస్థలో ప్రేమ వ్యవహారాలు రక్తసిక్తవర్ణాలకు కూడా దారితీస్తున్నాయి. ఇలాంటి నేపథ్యంలో కులాంతర, ప్రాంతాంతర వివాహం చేసుకొని ఆ విషయాన్ని తన వాళ్ల చేత ఒప్పించి, దాన్ని నవలగా గ్రంథస్థం చేసి సమాజం చేత కూడా ఒప్పించే ప్రయత్నం చేశాడు చేతన్‌భగత్. ఆ ప్రయత్నం సినిమాగా కూడా సక్సెస్‌ఫుల్‌గా సాగుతోంది. ఇలాంటి కథలు కొన్ని పరువు హత్యలను నివారించినా, కొందరు ప్రేమికులను తెలివైన వారిగా తీర్చిదిద్దినా మంచిదే కదా!
- జీవన్ రెడ్డి.బి