హోమియో కౌన్సెలింగ్
మా నాన్నగారి వయసు 86. ఆయన ఆరోగ్యంగానే ఉంటారు కానీ, ఈ మధ్య వాకింగ్‌కని వెళ్లి, ఇల్లు కనుక్కోలేక పోతున్నారు. అలాగే కళ్లద్దాలు, హ్యాండ్‌స్టిక్, సెల్‌ఫోన్ వంటి వాటిని ఒకచోట పెట్టి మరోచోట వెతుక్కుంటున్నారు. ఒక్కోసారి మా పిల్లల పేర్లు కూడా మర్చిపోతున్నారు. నాకు చాలా ఆందోళనగా ఉంది. ఆయన మతిమరపును తగ్గించవచ్చా? - కె.వి.ఆర్, హైదరాబాద్
ప్రతిమనిషి తమ జీవితంలో ఎప్పుడో ఒకసారి మరచిపోవటం సహజం. ఈ మతిమరపు ఎక్కువగా వృద్ధాప్యంలో చూడటం సాధారణం. వృద్ధులు తమ వస్తువులను ఒకచోట పెట్టి, ఆ విషయం మరచిపోయి మరోచోట వెతుక్కోవడం చూస్తూనే ఉంటాం. కొంతమందిలో కొన్ని కారణాల వల్ల ఈ మతిమరపు ఎక్కువ అవుతుంటుంది. వాకింగ్ చేస్తూండగానో, మరో పనిచేస్తుండగానో తామెందుకు ఆ ప్రదేశానికి వచ్చామో మరచిపోయి మతిభ్రమించినట్లు వెర్రిగా ప్రవర్తించటం చూస్తుంటాం. అదిచూసి ఇంటిలోని వారు విసుక్కోవటం, కోప్పడటం, బాధపడటం సాధారణం. అయితే వారు తమ సమీప బంధుమిత్రులను, ముఖ్యంగా కుటుంబ సభ్యులను కూడా గుర్తుపట్టలేక సతమతమవుతుండటం వంటి లక్షణాలను గమనించినట్లయితే వారు అల్జైమర్ డిసీజ్ అనే సమస్యతో బాధపడుతున్నట్లు గుర్తించవచ్చు.
అల్జైమర్స్ డిసీజ్ అంటే ఏమిటి?
డెమైన్షియా అనేది మెదడుకు సంబంధించిన సమస్య. దీని వలన మనిషి అలవాటు పడ్డ పనులలో తేడా రావటం గమనిస్తాము. వృద్ధాప్యంలో చూసే మతిభ్రమణ అంటే డెమైన్షియాను అల్జైమర్స్ డిసీజ్ అంటారు. ఇది మొదట మెదడు భాగాలలో ప్రభావం చూపి క్రమేపీ మనిషి ఆలోచనా విధానంలో, జ్ఞాపకశక్తిలో, భాషావిధానంలో మార్పు తీసుకు వస్తుంది. ఇది సామాన్యంగా 60 ఏళ్ల తర్వాత వస్తుంది. ఆ తర్వాత వయస్సు పెరిగేకొద్దీ వ్యాధి విపరీతమయ్యే అవకాశం ఉంది. స్త్రీ పురుషులిరువురిలోనూ ఈ వ్యాధి కనిపిస్తుంది. మెదడుకు బలమైన దెబ్బతగలటం వల్ల మెదడులో సరిగా రక్తప్రసరణ సరిగా జరగక భవిష్యత్తులో ఈవ్యాధి వచ్చే అవకాశం ఉంది.
లక్షణాలు: వ్యాధి తీవ్రత ఎక్కువైనప్పుడు రోగి ఇంటిలోనుంచి వెళ్లిపోవటం, యాంగ్జైటీకి గురవటం, తమ ఇంటినే గుర్తించలేకపోవటం వంటి లక్షణాలు కనిపించవచ్చు.
నిర్ధారణ: రోగి శారీరక, మానసిక లక్షణాలలో మార్పులను బట్టి, రక్తపరీక్ష, బ్రెయిన్ సీటీస్కాన్, ఎమ్మారై
హోమియో చికిత్స: హోమియోకేర్ ఇంటర్నేషనల్‌లో రోగి శారీరక, మానసిక లక్షణాలను విశ్లేషించి వ్యాధి కారణాలను కనుగొన్న తర్వాత వైద్యుని పర్యవేక్షణలో మందులు వాడటం ద్వారా అల్జైమర్స్ వ్యాధిని నయం చేయవచ్చు.
- డాక్టర్ శ్రీకాంత్ మోర్లావర్ సిఎండి హోమియోకేర్ ఇంటర్నేషనల్ హైదరాబాద్
గుండె పెరిగింది..!
కార్డియాలజీ కౌన్సెలింగ్
నా వయసు 40 ఏళ్లు. ఈమధ్య నాకు కళ్లు తిరగడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా ఉండటం, దగ్గు, ఛాతీలో నొప్పి వస్తే మా ఫ్యామిలీ డాక్టర్‌ను సంప్రదించాను. గుండె పెరిగిందని చెప్పారు. ఇలా గుండె పెరగడానికి కారణాలు, లక్షణాలను వివరించండి. - రామారావు, వరంగల్
మన గుండె ఒక పంప్‌లా పనిచేస్తుంటుంది. ఈ పంపు బలహీనమైనప్పుడు శరీరానికి అవసరమైన రక్తాన్ని పంప్ చేయలేదు. అంతేగాక వివిధ అవయవాలకు అవసరమైన పోషకాలు అందవు. ఈ పరిస్థితినే హార్ట్ ఫెయిల్యూర్ అంటారు. ఒత్తిడి పెరిగినప్పుడు తాత్కాలికంగా గుండె విస్తరిస్తుంది. ముఖ్యంగా గర్భిణిగా ఉన్నప్పుడు, గుండె కండరాలు బలహీనమైనప్పుడు, కరొనరీ ఆర్టెరీ వ్యాధి వచ్చినప్పుడు, మహిళల్లో ముఖ్యంగా గర్భం దాల్చినప్పుడు, గుండె కండరాలు బలహీనమైనప్పుడు, గుండె కవాటాల సమస్య ఉన్నప్పుడు. గుండె అసాధారణంగా కొట్టుకున్నప్పుడు గుండె పెరుగుతుంది. కేవలం కొన్ని సందర్భాల్లో గుండె విస్తరించడాన్ని నివారించలేం. కానీ చాలా కేసుల్లో చికిత్స చేసే వీలుంది. గుండె విస్తరించడానికి కారణమయ్యే అంశాలను దృష్టిలో పెట్టుకొని చికిత్స చేస్తారు. అవసరమైతే శస్త్రచికిత్సతో కూడా వైద్యం చేస్తారు.
గుండె విస్తరించడాన్ని (హార్ట్ ఎన్‌లార్జ్‌మెంట్) వైద్య పరిభాషలో కార్డియో మెగాలీ అంటారు. ఇది వ్యాధి కాదు. ఇతర మెడికల్ కండిషన్లకు సంబంధించిన ఒక లక్షణం. ఛాతీ ఎక్స్‌రే తీసినప్పుడు అందులో గుండె విస్తరించి ఉందని వైద్యులు చెబుతుంటారు. ఆ తర్వాత ఇతర పరీక్షలు చేస్తారు. కొంతమందిలో గుండె విస్తరించినా ఎలాంటి లక్షణాలూ, చిహ్నాలు కనిపించవు. కానీ కొంతమందిలో కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. అవి... శ్వాసక్రియలో సమస్యలు, కళ్లు తిరగడం, గుండె అసాధారణంగా కొట్టుకోవడం, వాపు (ఎడీమా), ఛాతీలో నొప్పి వంటి లక్షణలు కనిపిస్తాయి. గుండె విస్తరించడాన్ని ముందుగానే గుర్తిస్తే చికిత్స చేయడం సులభమవుతుంది.
గుండె పెరగడానికి కారణాలు : అధిక రక్తపోటు, కార్డియోమయోపతి వంశపారంపర్యంగా ఉన్నా, గుండె ధమనుల్లో అడ్డంకులు ఉన్నా, పుట్టుకతో వచ్చే గుండె జబ్బు, గుండె కవాటాల వ్యాధి, అసాధారణ హృదయ స్పందన, పల్మునరీ హైపర్‌టెన్షన్, రక్తహీనత, థైరాయిడ్, అధిక ఐరన్, గుండెపోటు వంటి వాటి వల్ల గుండె విస్తరించే ముప్పు ఉంది. గుండె ఆరోగ్యంపై మీ ఆందోళనలను మీ డాక్టర్‌తో పంచుకోండి. దీనివల్ల కలిగే పరిణామాలను ఎలా నివారించాలో చర్చించండి. పైన పేర్కొన్న లక్షణాలు కనిపిస్తే వెంటనే అత్యవసర వైద్యం చేయించుకోవడం తప్పనిసరి.
డాక్టర్ హేమంత్ కౌకుంట్ల కార్డియోథొరాసిక్ సర్జన్, సెంచరీ హాసిత్పటల్స్, బంజారాహిల్స్, హైదరాబాద్.