ఛమ్మక్ చల్లో అన్నాడు వన్‌డే జైల్లో ఉన్నాడు!
మగాళ్లూ... మాట జాగ్రత్త
భార్యా భర్త ఉదయాన్నే వాకింగ్‌కి వెళ్లి వస్తున్నారు. తిరిగి వచ్చేటప్పుడు భార్య నీరసంతో తూలిపడింది. ఎక్కడ పడిందీ అంటే ఓ డస్ట్ బిన్ మీద. ఆ డస్ట్‌బిన్ ప్రభుత్వానిది కాదు. ఓ ప్రైవేటు వ్యక్తిది. ‘నా డస్ట్‌బిన్ మీద పడతావా!’ అని ఆ వ్యక్తి గొడవకు దిగాడు. ‘సారీ’ చెప్పింది ఆమె. డస్ట్‌బిన్ వినలేదు. అదే.. డస్ట్‌బిన్ ఓనరు వినలేదు. ‘కళ్లు నెత్తికి ఎక్కితే కాళ్లు తూలక ఏం చేస్తాయి?’ అన్నాడు. భర్తకు కోపం వచ్చింది. తమాయించుకున్నాడు. భార్య ఊరుకోలేదు. ‘తప్పైపోయింది అన్నాం కదా. చాలు, ఇక ఆపు’ అంది. డస్ట్‌బిన్ యజమానీ ఊరుకోలేదు. ‘పోవమ్మా.. ఛమ్మక్ చల్లో’ అన్నాడు.
ఇది జరిగింది 2009లో. మహరాష్ట్రలోని థానేలో జరిగింది. అప్పటికింకా ‘రా.వన్’ సినిమా విడుదల కాలేదు. షారుక్ నటించిన ఆ సినిమాలోనే ‘ఛమ్మక్ చల్లో’ సాంగ్ ఉంది. అయితే పాట కన్నా ముందే ‘ఛమ్మక్ చల్లో’ అనే మాట వాడుకలో ఉంది. అది హిందీ మాట. ‘వగలాడి’ అనే అర్థంలో వాడే మాట! డస్ట్‌బిన్ వాలా అనిన ఆ మాటకు ఆ మహిళ మనసు గాయపడింది. భర్తతో కలిసి వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కదల్లేదు. ఎఫ్.ఐ.ఆర్. ఫైల్ చెయ్యలేదు. పెట్టీ కేస్ అన్నారు. దాంతో ఆమె కోర్టుకు వెళ్లింది. కోర్టు ఆమె పిటిషన్‌ని స్వీకరించింది! కానీ విచారణకే.. 8 ఏళ్లు పట్టింది. చివరికి వారం క్రితమే అంతిమ తీర్పు వచ్చింది. ఐ.పి.సి. 509 సెక్షను కింద.. డస్ట్‌బిన్ ఓనర్‌ని దోషిగా నిర్ధా్థరించి అతడికి 1 రూపాయి జరిమానాను, కొన్ని గంటల జైలు శిక్షను విధించింది కోర్టు. స్త్రీలను మాటతో కానీ, చూపుతో కానీ, చర్యతో కానీ లైంగికంగా కించపరచడం, అవమానించడం, తేలిక చేసి మాట్లాడడం వంటి వాటిని ఈ సెక్షన్ నేరాలుగా పరిగణిస్తుంది.
మరి ఇంత చిన్న శిక్ష ఏమిటి? చిన్నదే కావచ్చు. కానీ ఆ మహిళ సాధించింది మాత్రం పెద్ద విజయం. ఆమె తన ఆత్మగౌరవాన్ని మాత్రమే కాపాడుకోలేదు. స్త్రీలందరి ఆత్మగౌరవాన్ని కాపాడింది. అలాగే ఇది ఒక వ్యక్తికి మాత్రమే పడిన శిక్ష కాదు. స్త్రీలను గౌరవించని మగజాతి అంతటికీ పడిన శిక్ష.