ప్రభావం చూపేవాళ్ల మాటే పారుతుంది.. మంచి, చెడు.. హక్కు, బాధ్యత.. దేని గురించైనా సరే! అందుకే ప్రజాచైతన్య ప్రచారాలన్నిటికీ అంబాసిడర్స్‌గా సినిమా నటులు, క్రీడాకారులే ఉంటారెక్కువగా! కరోనా వ్యాప్తికి చెక్ పట్టే క్యాంపెయిన్‌క్కూడా సినిమావాళ్లు ముందుకొచ్చారు.
మాలీవుడ్ కాస్త క్రియేటివ్‌గా ఆలోచించి.. బ్రేక్ ది చైన్‌ను షార్ట్ ఫిల్మ్స్‌గా తీసింది. ఒక నిమిషం నిడివిగల ఆ చిత్రాలన్నీ మన సామాజిక బాధ్యతను గుర్తుచేస్తూ వాటిని పాటించే అవసరాన్ని తెలియజేస్తున్నాయి. ఈ లఘుచిత్రాలను ‘ది ఫిల్మ్ ఎంప్లాయ్స్ ఫెడరేషన్ ఆఫ్ కేరళ (ఓఉఊఓఅ) నిర్మించి .. వాటికోసమే ప్రత్యేకంగా ఒక యూట్యూబ్ చానెల్‌నూ పెట్టి.. ప్రసారం చేస్తోంది. ‘వండర్ ఉమన్’, ‘సూపర్ మ్యాన్’, ‘అన్‌నోన్ హీరోస్’ పేరుతో తొమ్మిది షార్ట్ ఫిల్మ్స్‌ను చిత్రీకరించారు. ప్రముఖ నటి మంజు వారియర్, నటుడు కె. బొబాన్‌ల వ్యాఖ్యానంతో ఎండ్ అవుతాయి ఈ సినిమాలు.
వండర్ ఉమన్ వనజ..
కోర్టు కేసులతో క్షణం తీరికలేని లాయరమ్మ తమ పనమ్మాయికి చెప్తుంది.. ‘రేపటి నుంచి ఇంట్లో పని నేనే చేసుకుంటాను. నువ్వు సెలవు తీసుకో’ అని. ఖంగు తింటుంది పనమ్మాయి. గ్రహించిన లాయర్.. ‘కంగారు పడకు.. నీ జీతం నీకు అందుతుంది’ అంటూ వెళ్లి సబ్బుతో 20 సెకన్లు శుభ్రంగా చేయి కడుక్కుంటుంది. తన యజమాని చర్యనే గమనిస్తూంటుంది తదేకంగా పనమ్మాయి. ఇందులో ముత్తుమణి, శ్రీజాదాస్ నటించారు.
సూపర్‌మ్యాన్ సుబైర్..
సుబైర్‌కు క్యాబ్ ఉంటుంది. దానికి తనే డ్రైవర్. రోడ్డు మీద వెళ్తూంటే.. ముగ్గురు విదేశీయులు కనపడతారు అతనికి... దారెంట వెళ్లే వాహనాలను లిఫ్ట్ అడుగుతూ! కనీసం వాళ్ల వంకైనా చూడకుండా వెళ్లిపోతుంటారు వాహనదారులు. సుబైర్ తన కారు ఆపుతాడు వాళ్లకు లిఫ్ట్ ఇవ్వడానికి సిద్ధపడుతూ. అయితే వాళ్లు కారు దగ్గరకు వచ్చేలోపే.. తాను కారు దిగి.. అందులోంచి శానిటైజర్ తీసి వాళ్ల చేతుల్లో వేసి.. శుభ్రపర్చుకోమంటాడు. శానిటైజర్ రుద్దుకున్నాక.. వాళ్లను కార్లో కూర్చోబెట్టుకొని తీసుకెళ్తాడు సుబైర్. ఇందులో సోహన్ శీనులాల్ నటించాడు.
సూపర్‌మ్యాన్ సదానందన్..
సదానందన్ .. గల్ఫ్ నుంచి వస్తాడు తన మేనకోడలి పెళ్లి ఉందని. తీరా ల్యాండ్ అయ్యాక కరోనా ఎఫెక్ట్ బోధ పడుతుంది అతనికి. దాంతో స్వీయ నిర్బంధం విధించుకుంటాడు. మేనకోడలు ఫోన్ చేస్తుంది.. ‘అయ్యో నా పెళ్లికోసమనే వచ్చి.. పెళ్లి చూడకుండా ఇందేంటి మామయ్య’ అంటూ బాధపడుతుంది. ‘ఇది నా కోసం.. నీ కోసం.. మనందరి క్షేమం కోసం తల్లీ... ఇంతకు మించిన శుభకార్యం ఏం ఉంటుంది చెప్పు.. బాధపడకు’ అంటూ ఫోన్‌లో మేనకోడలిని సముదాయిస్తాడు. ఇదీ సూపర్‌మ్యాన్ సదానంన్ స్టోరీ. విదేశాల నుంచి వచ్చినవాళ్ల బాధ్యతను గుర్తుచేసే కథ. ఇందులో సదానందన్‌గా జానీ ఆంటోనీ నటించాడు.
వండర్ ఉమన్ విద్య..
విద్యకు షాపింగ్ పిచ్చి. అవసరం ఉన్నా లేకపోయినా అన్నీ కొనేస్తూంటుంది. అలా ఎప్పటిలాగే ఇప్పుడూ సూపర్‌మార్కెట్‌కు వెళ్లి.. అన్నీ కొంటూ.. ఆ షాప్‌లో మిగిలిన రెండు శానిటైర్స్‌నూ ట్రాలీలో వేసుకుంటుంది. విద్య వెనకాలే లైన్‌లో ఉన్న అమ్మాయి ‘అయ్యో రెండూ తీసేసుకున్నారా ఈవిడ’ అని నిట్టూరిస్తుంది నిరాశగా. విషయం అర్థమైన విద్య ఒక శానిటైజర్‌ను మళ్లీ యథాస్థానంలో పెట్టేస్తుంది. క్లిష్టపరిస్థితులు, కొరత సమయాల్లో.. మిగిలిన వాళ్ల అవసరాలనూ గ్రహించాలి.. అందరూ సురక్షితంగా ఉండాలని చెప్తుందీ ‘వండర్ ఉమన్ విద్య’. ఆన్నా రేష్మా రాజన్, మృదుల నటించారు.
‘ఏ సూపర్ ఉమన్‌దో.. ఏ సూపర్‌మ్యాన్‌దో కాదు ఈ బాధ్యత. మనందరిదీ. ఈ బాధ్యత నిర్వర్తించి మనమంతా సూపర్ హీరోస్ కావచ్చు’ అనే కామెంట్‌తో ఎండ్ అవుతుంది ప్రతిచిత్రం. ప్రస్తుతం యూట్యూబ్‌లో ఉన్న నాలుగు సినిమాలు ఇవి. వండర్ ఉమన్ సారా, సూపర్‌మ్యాన్ సునీ, సూపర్‌మ్యాన్ షాజీ, సూపర్‌మ్యాన్ ఆంటోనీ, అన్‌నోన్ హీరోస్.. అనే ఇంకో అయిదు షార్ట్ ఫిల్మ్స్ విడుదల కావల్సి ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment