నిండు గోదావరికి నిలువెత్తు సేవకుడు | Could be attributed to the servant of the whole of the Godavari | Sakshi
Sakshi News home page

నిండు గోదావరికి నిలువెత్తు సేవకుడు

Published Thu, Oct 9 2014 10:40 PM | Last Updated on Thu, Jul 11 2019 6:33 PM

నిండు గోదావరికి నిలువెత్తు సేవకుడు - Sakshi

నిండు గోదావరికి నిలువెత్తు సేవకుడు

 సంక్షిప్తంగా:  నేడు వీరన్న వర్ధంతి
 
తాజ్‌మహల్ నిర్మాణానికి రాళ్లెత్తిన కూలీలెవ్వరు? అని అడిగితే సమాధానం చెప్పడం కష్టమే. అయితే గోదావరి ఆనకట్ట నిర్మాణంలో సర్‌అర్థర్ కాటన్‌కు చేదోడువాదోడుగా ఉన్నదెవ్వరు? పదివేల మంది కూలీలను సమీకరించి వారికి, పనిలో శిక్షణనిచ్చి సక్రమంగా వేతనాలిస్తూ ఆదివారం జీతంతో కూడిన సెలవునిచ్చి పనిచేయించినదెవరు అంటే వీణెం వీరన్న పేరే చెప్పాలి. జనబాహుళ్యంలో ప్రాచుర్యంలోకి రాకుండా మరుగునపడిన వీరన్న వివరాలివి...
 
వీణెం వీరన్న తండ్రి కొల్లయ్య. వీరు పూర్వీకుల కాలం నుంచి కూడా రాజమండ్రి వాసులే. ఆయన తల్లి వీరరాఘవమ్మది భద్రాచలం దగ్గర ఉన్న దుమ్మగూడెం. వీరి పెద్ద కొడుకే వీరన్న. 1794, మార్చి మూడవ తేదీన పుట్టారు. వీరి తాతముత్తాతలు రాజరాజ నరేంద్రుని దగ్గర గణాంకులు. ఇతడి తండ్రి కొల్లయ్య బ్రిటిష్ పరిపాలన కార్యాలయ ఉద్యోగి. వీరన్న బాల్యం, ప్రాథమిక విద్యాభ్యాసం గోదావరి తీరానే సాగింది. మచిలీపట్నంలోని ఆంగ్లో ఇండియన్ కళాశాల, ఆ తర్వాత బెంగాల్‌లో ఇంజినీరింగ్ పూర్తిచేశారు. మద్రాసు (చెన్నై)లో ఇంజనీరింగ్, ఇంగ్లిష్‌లలో ప్రత్యేక శిక్షణ తీసుకుని 1840 నాటికి రాజమండ్రికి వచ్చి నీటిపారుదల శాఖలో ఉద్యోగిగా చేరారు.

ఇది జరిగిన తర్వాత సరిగ్గా నాలుగేళ్లకు అంటే... 1844వ సంవత్సరం ఆగస్టు మొదటి వారంలో గోదావరి పరివాహక ప్రాంతాన్ని పరిశీలించడానికి సర్ అర్థర్ కాటన్ వచ్చారు. పై అధికారులు కాటన్‌దొరకు సహాయంగా వీరన్నను నియమించారు. అప్పటి నుంచి కాటన్‌దొరకు వీరన్న అధికారిక సహాయకుడు మాత్రమే కాక దొర నివాస సదుపాయాలు, ఆహారం, ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు, ఇంట్లో నౌకర్లను ఏర్పాటు చేయడం వరకు అన్ని పనులూ చూసుకునేవారు.
 
1847లో ఆనకట్ట నిర్మాణం మొదలయ్యే నాటికి వీరన్న వయసు 53 ఏళ్లు. కాటన్ దొర, వీరన్న ఇద్దరూ కలిసి ఆనకట్ట నిర్మాణం కోసం గోదావరి తీరాన 15 వందల కిలోమీటర్ల దూరం (కొంతదూరం కాలినడకన, కొంతదూరం గుర్రం మీద) ప్రయాణించేవారు. అప్పట్లో తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాలను కలిపి రాజమండ్రి జిల్లాగా వ్యవహరించేవారు. ఆనకట్ట నిర్మాణానికి పని చేయడానికి గోదావరి జిల్లాల నుంచి శ్రామికులు ముందుకు రాలేదు. ఆ పరిస్థితుల్లో వీరన్న ఒడిస్సా, బెంగాల్ రాష్ట్రాల నుంచి వందలాదిమందిని తీసుకువచ్చి మంచి వేతనంతో పని చేయించారు.

తమ కుటుంబంతోనూ, ఇతర బంధువులతోనూ సంబంధాలు కలిగిన మన్యం ప్రాంతంలోని గిరిజనుల సమీకరించి వారికి నిర్మాణ పనిలో శిక్షణనిచ్చి పనిచేయించుకున్నారు. శ్రామికులందరికీ తాత్కాలిక నివాసాలు ఏర్పరచి, కనీస వసతులు కల్పించి, వైద్యసేవలను అందుబాటులోకి తెచ్చారు. బయటి నుంచి వచ్చిన శ్రామికులను ఉదాహరణగా చూపిస్తూ స్థానికులలో చైతన్యం తెచ్చారు. పదివేల మందితో ఐదేళ్లపాటు సాగిన నిర్మాణంలో ఒక్కరు కూడా ప్రాణాలు కోల్పోకుండా నిర్మాణం పూర్తి అయిందంటే అడుగడుగునా ఆయన ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నారో తెలుస్తుంది.

నిర్మాణం జరుగుతున్నప్పుడు మధ్యలో కాటన్ దొర అనారోగ్యం కారణంగా లండన్, ఆస్ట్రేలియాలకు వెళ్లినప్పుడు ఆనకట్ట నిర్మాణానికి ఎటువంటి అంతరాయం కలగనివ్వకుండా సమర్థవంతంగా పనిచేయించారు వీరన్న. కాటన్ దొర 1852 మార్చి 31వ తేదీకి నిర్మాణం పూర్తయింది- అని విక్టోరియా రాణికి నివేదిక పంపించి, తన డైరీలో ‘వీరన్న అనే మంచివ్యక్తి నాకు లభించకపోయి ఉంటే నేను అనుకున్నట్లుగా ఇంత వేగంగా ఆనకట్ట పూర్తిచేయలేకపోయేవాడిని. వారికి నేను జన్మతః రుణపడి ఉంటాను’’ రాసుకున్నారు. వీరన్న శ్రమకు ప్రతిఫలంగా ఆయనకు ఏదైనా మేలు చేస్తే బావుంటుందని విక్టోరియా మహారాణిని అభ్యర్థించారాయన.
 
వీరన్నకు గోదావరి ఆనకట్ట అంటే ఎంత మమకారం అంటే... ఆనకట్ట నిర్మాణం పూర్తయిన తర్వాత పదిహేనేళ్ల వరకు ఆయన గోదావరి హెడ్‌లాక్ వద్ద క్వార్టర్స్‌లోనే ఎక్కువ సమయం గడిపేవారు. అధికశ్రమ, ఎండల తాకిడితో పచ్చకామెర్ల వ్యాధి బారిన పడి ఆయన 1867 అక్టోబర్ 12వ తేదీన మరణించారు. ఆయన అంతిమ కోరిక మేరకు నేటి ధవళేశ్వరం హెడ్‌లాక్ ప్రాంతంలోనే దహన సంస్కారాలు నిర్వహించారు. ఆయన అంతిమ సంస్కారం నిర్వహించిన చోట రాతి గోడకు ఆయన పేరును ఇంగ్లీష్‌లో చెక్కి గౌరవించింది బ్రిటిష్ ప్రభుత్వం.  
 
ఇంతటి సేవలందించిన వీణెం వీరన్న శిలావిగ్రహాన్ని ధవళేశ్వరం బ్యారేజ్ దగ్గర, మెర్నిపాడు గ్రామంలోనూ ప్రతిష్ఠిస్తే బావుణ్ణు. పిల్లల పాఠ్య పుస్తకాల్లో గోదావరి ఆనకట్ట - సర్ అర్థర్ కాటన్ పాఠంలో వీణెం వీరన్నను కూడా ప్రస్తావించడం ఎంతైనా అవశ్యం. కాటన్ పేరుతో ‘కాటన్ పేట’ ఉన్నట్లే, వీరన్న నివసించిన వీథికి ‘వీరన్న వీథి’ అని నామకరణం చేస్తే ముందు తరాలకు వీరన్న గురించి తెలుస్తుంది. రాబోయే ఏడాది గోదావరికి పుష్కరాల నాటికి ఇవన్నీ పూర్తి చేస్తే వీరన్నను సముచితంగా గౌరవించినట్లవుతుంది.
 
- బుడ్డిగ సాయిగణేశ్
 
 వీరన్న కుటుంబం ఇది
 భార్య వెంకటేశ్వరి (వెంకాయమ్మ)ది ధవళేశ్వరం. వారికి నలుగురు కొడుకులు, ఒక కుమార్తె.
 
 ప్రస్తుతం నాలుగవ తరానికి చెందిన మనుమడు వీణెం వెంకట నారాయణరావు, ఐదవ తరం మనుమలు మోహన్ నాగేంద్రప్రసాద్, భాస్కరరావు ఉన్నారు.
 
వీరన్న గురించి ప్రముఖ రచయితల రచనల్లో లభించిన కొన్ని వాక్యాలు...
గోదావరి ఆనకట్ట నిర్మాణంలో శ్రీ వీణెం వీరెన్న అనే తెలుగు వ్యక్తి ప్రముఖ పాత్ర పోషించారు. ఆనకట్ట ప్రధాన లాకు వద్ద ఉన్న రాతిగోడ మీద ఆయన పేరు చెక్కారు.
 
సర్ అర్థర్ కాటన్ తన డైరీలో వీరన్నను ప్రశంసిస్తూ రాసుకున్నారు.
 
వీరన్న శ్రమకు ప్రతిఫలంగా ‘మెర్నిపాడు’ గ్రామ శిస్తును ఆయనకు, ఆయన తర్వాత వారసులకు అందేటట్లు ఈస్టిండియా ఆదేశాలు జారీ చేసింది.
 
1860లలో మద్రాసు ప్రెసిడెన్సీ కాటన్‌దొరతోపాటు వీరన్నను కూడా ‘రాయ్‌బహదూర్’ బిరుదుతో గౌరవించింది. ఇది రాజబహదూర్‌కంటే పెద్ద పురస్కారం.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement