కాస్త మాకు కూడా చెప్పవూ!
గాసిప్
బాలీవుడ్‌ను తనవైపుకు ఎలా తిప్పుకోవాలో సోనమ్ కపూర్‌కు బాగానే వొంటబట్టినట్లుంది. హాట్ హాట్ ఫోటోలతో కొంత కాలం క్రితం హాట్ టాపిక్‌గా మారిన సోనమ్ కపూర్ మరోసారి అందరి దృష్టిని తన వైపు తిప్పుకోగలిగింది. ఈసారి మాత్రం టాపిక్... హాట్ ఫోటోలు కాదు... ఆరోగ్యం!
పాత్రలను ఎంచుకోవడంలోనే కాదు, ఆరోగ్యం విషయంలోనూ ఇతరుల కంటే భిన్నమైన విధానాలను ఆమె అనుసరించాలనుకుంటోంది. దాని ఫలితమే... ‘స్పెషల్ డైట్’. ఈ స్పెషల్ డైట్‌ను ‘ది ప్రోటిన్ స్పేరింగ్ మాడీఫైడ్ ఫాస్ట్’ అని పిలుస్తారు. ఇది ఆహారంలో కొవ్వును నియంత్రించి, పోషక విలువలను పెంపొందిస్తుంది. కేట్ మిడిల్‌టన్, జెన్నిఫర్ లోపెజ్... మొదలైన అంతర్జాతీయ సెలబ్రెటీలు ఈ డైట్‌ను ఫాలో అవుతున్నారట.
బాలీవుడ్ విషయానికి వస్తే మాత్రం... ‘స్పెషల్ డైట్’ను అనుసరిస్తున్న తొలి వ్యక్తిని తానే అంటుంది సోనమ్.‘‘చక్కని శరీరాకృతి కోసం నేను తీసుకుంటున్న స్పెషల్ డైట్ ఉపకరిస్తుంది’’ అని సోనమ్ చెప్పగానే, ఆమెకు ఫోన్ల వరద మొదలైందట.
పరిచయం ఉన్న వాళ్లు, లేని వాళ్లు, చుట్టాలు, పక్కాలు, విదేశీయులు, పరదేశీయులు... ఎందరెందరో సోనమ్‌కు ఫోన్ చేసి ‘‘స్పెషల్ డైట్ గురించి కాస్త చెప్పండి!’’ అని అడుగుతున్నారట. మొదట్లో కాస్త ఉత్సాహంగానే స్పందించిన సోనమ్ ఆ తరువాత మాత్రం విసుక్కోవడం మొదలు పెట్టిందట!