నుదుటి వెలుగు | Is the darkness of the womb? | Sakshi
Sakshi News home page

నుదుటి వెలుగు

Published Wed, Oct 14 2015 12:53 AM | Last Updated on Sun, Sep 3 2017 10:54 AM

నుదుటి వెలుగు

నుదుటి వెలుగు

గర్భంలో చీకటి ఉంటుందా?అవును. హర్యానా గర్భంలోని  ధనిమియా ఊరిలో అంతా చీకటే. తల్లి కడుపున పుట్టిన మగవాడే ఈ చీకటి శాసనాన్ని లిఖించాడు. ఇంకో తల్లిని కనకూడదని శాసించాడు. కడుపులో ఆడపిల్ల ఉంటే భూమి మీద పడకూడదు! ఆ అంధకార కాలగర్భంలో కలిసిపోవాలి! సుష్మా ఆ అజ్ఞానాన్ని, ఆ అహంకారాన్ని కాలరాసింది. తన అంధకారాన్ని చిలికి, అమృత కిరణాలతో ఆడపిల్లల జన్మరాతను తిరగరాసింది... మహిళల నుదుటిపై వెలుగు బొట్టు దిద్దింది. ఆ వెలుగుకు ఇప్పుడు... ధనిమియా గ్రామంలో చాలామంది ఆడపిల్లలు సాక్షి!
 
హర్యానాలోని ఫతేబాద్ జిల్లా.. ధనిమియా గ్రామం! భ్రూణహత్యలు, లింగ వివక్షలో దేశంలోనే  మొదటి స్థానం ఆ ఊరుది. బిష్నోయి వంటి కులాల్లో ఆడవాళ్లు బయటకు రావడమే తప్పు. తప్పని పరిస్థితుల్లో బయటకు రావాల్సివచ్చినా ‘ ఘూంఘట్’ (తల మీద పైట ముసుగు) వేసుకొని రావాలి.  ఆ ఊళ్లో ఏ స్త్రీ గర్భవతి అయినా వణికిపోవడమే. అమ్మాయి పుట్టకూడదని ముక్కోటి దేవుళ్లకు దండం పెట్టుకోవడమే. అయినా గండం పొంచే ఉండేది. స్కానింగ్ సెంటర్లో లింగనిర్ధారణ జరిగే వరకు. పుట్టబోయేది మగపిల్లాడని తేలితే ఆ ఇంటి కోడలికంతా వైభోగమే. ఆడపిల్ల అని తెలిసిందో! అబార్షన్ అనివార్యం. అక్కడితో ఆగదు ఆడపిండాన్ని మోసిన అభాగ్యురాలిగా ఊరు ఊరంతా ఆడిపోసుకుంటుంది. ఆ ఊళ్లో ఇంకే ఆడపిల్ల కడుపుతో ఉన్నా ఈమె మొహం చూస్తే ఆ దారిద్య్రం తనకు చుట్టుకుంటుందని ఈసడించుకుంటుంది.  అలా మొత్తానికి ఆ ఊళ్లో మహిళ అగౌరవ ప్రతీక. చదువైతే ఆమెకు అందని అవసరం!

2010 వరకు ధనిమియా గ్రామం పరిస్థితి అంతే! ఆ యేడు ఆ ఊరికి ఎన్నికైన  సర్పంచ్ దాని గతిని మార్చేవరకు!  కాలం భలే జిమ్మిక్స్ చేస్తుంది. మట్టిలో మాణిక్యాలను బయటకు తీస్తుంది. లోకం పోకడ తెలియని అమాయకులకు  అనుభవాల పాఠాలు నేర్పి కథానాయకులుగా నిలబెడుతుంది! అలాంటి నాయికే సుష్మ భదు. ధనిమియా ఊరి రాతను మార్చిన సర్పంచ్.. ఈ స్టోరీ హీరోయిన్!
 
సర్పంచ్ ఎలా అయింది?
 స్త్రీల మీద అన్ని ఆంక్షలున్న ఊరు సుష్మభదును సర్పంచ్‌గా ఎలా ఎన్నుకుంది? ఈ అనుమానం సహజమే. మహిళల మీద అణచివేత ఉన్న ఈ గ్రామానికి మహిళ సర్పంచ్ అయితే బాగుపడుతుందన్న సదుద్దేశంతో ప్రభుత్వమే ఈ గ్రామపంచాయితీని ఉమన్‌రిజర్వ్‌డ్‌గా మార్చింది. ఆ క్రమంలోనే 30 ఏళ్ల (ఇప్పుడు 35 ఏళ్లు) సుష్మభదు ధనిమియాకు సర్పంచ్‌గా ఎన్నికయ్యారు.
 
ఫస్ట్ స్టెప్
చిన్నప్పుడు తనకో రకం తిండి, ఇంట్లో అన్నలకు ఓ రకం తిండి పెట్టిన వివక్షను ఎదుర్కొంది. వంటగది దాటి బయట గదిలోకి రావాలంటే మొహమ్మీదికి ఘూంఘట్ లాక్కోవాలనే ఉత్తర్వును పాటించింది. భర్త తిన్నాక మిగిలిన దాంతోనే సరిపెట్టుకోవాలనే సంప్రదాయంలో మునిగి ఉంది. పెళ్లయి అత్తారింట్లో అడుగుపెట్టిన మొదటి రోజే ‘తొలి కాన్పులో కొడుకునే కనాలి’ అన్న ఆజ్ఞను భరించింది, భయపడింది. ఈ అనుభవాలిన్నిటి నేపథ్యంలో ఆమె  సర్పంచ్ అయ్యాక తీసుకున్న మొదటి స్టెప్.. భ్రూణహత్యలను ఆపే  చర్యలను తీసుకోవడం. ఆ ఊళ్లో లింగ నిర్ధారణ పరీక్షలు జరుపుతున్నట్లు సమాచారం అందించిన వారికి 51 వేల రూపాయల నగదు బహుమతిని ప్రకటించింది. అంతేకాదు చట్టానికి వ్యతిరేకంగా సాగుతున్న బ్యాక్‌డోర్ అబార్షన్స్‌నూ అరికట్టింది. దీనిమీద స్థానిక అంగన్‌వాడీ కార్యకర్తలు, హెల్త్‌వర్కర్స్‌నీ అప్రమత్తం చేసింది.

ఘూంఘట్ హఠావో..
భిష్నోయి వంటి ఛాందస ఆచారాలు, సంప్రదాయాలున్న కుటుంబాల మధ్యకూ వెళ్లింది. ఆ ఇంటి కోడళ్లతో మీటింగ్స్ పెట్టేది. ఘూంఘట్ ఎందుకు వేసుకోవాలి అన్న ప్రశ్నను లేవనెత్తింది. ఆ ఆచారాన్ని ఎదిరించే ధైర్యాన్ని అందించింది. ఈ విషయంలో కూడా భిష్నోయి కులం నుంచి ఆమెకు బెదిరింపులు వచ్చాయి. మా కుల మహిళలను పాడుచేస్తోందంటూ తిట్టిపోసారు. సుష్మభదు వాళ్ల గడ్డివాములకు నిప్పుపెట్టారు. ఈసారైతే భర్త నువ్వు పదవికి రాజీనామా ఇవ్వకపోతే విడాకులు ఇచ్చేస్తానని హెచ్చరించాడు కూడా. ఇంత మంది ఆడవాళ్ల  బాగుకోసం నా ఒక్క కుటుంబం విచ్ఛిన్నమైనా పర్లేదు. మంచిలో భాగస్వామిగా ఉంటావో.. విడిపోయి చెడుగా మిగిలిపోతావో నిర్ణయించుకోవాల్సిందే నువ్వే’అంటూ భర్తను డిఫెన్స్‌లో పెట్టింది. ఆమె ఆత్మవిశ్వాసానికి తలొగ్గి వెంట నడవక తప్పలేదు ఆయనకు. అలా ఘూంఘట్ హఠావో ఆందోళన్‌ని విజయవంతం చేసింది.

ఉపాధి శిక్షణ
ఇవన్నీ ఒకెత్తు.. స్త్రీ సాధికారత, స్వావలంబన కోసం సుష్మభదు పడ్డ తపనంతా ఒకెత్తు. ఫతేబాద్ నుంచి నిపుణులను తెప్పించి ఆ ఊళ్లోని ఆసక్తిగల మహిళలకు టైలరింగ్, అల్లికలు, సబ్బులు, వాషింగ్‌పౌడర్, శానిటరీ నాప్కిన్స్ వంటి తయారీలో శిక్షణనిప్పించింది. తర్వాత వాళ్లకు పంచాయితీ తరపున లోన్లనూ శాంక్షన్ చేయించింది.

ఇప్పుడు..
భ్రూణహత్యలు, లింగవివక్షలో దేశంలోనే మొదటిస్థానం అన్న అపఖ్యాతిని పోగొట్టుకుంది ధనిమియా గ్రామం. స్త్రీల హక్కులు, ఆడశిశు సంరక్షణలో దేశానికే మోడల్ అనే ఖ్యాతిని తెచ్చుకుంది. 426 మంది స్త్రీలకు 416 మంది పురుషుల నిష్పత్తితో ఉత్తర భారతానికే ఆదర్శమైంది. మహిళల అక్షరాస్యతలోనూ ఈ ప్రతిభను చాటుతోంది. ఆదాయంలో కూడా పురుషులతో సమానంగా పోటీపడ్తున్నారు అక్కడి మహిళలు. ఇదంతా సాధించిన ఘనత వన్ అండ్ ఓన్లీ లేడీ సర్పంచ్ సుష్మభదుదే. అందుకే ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోషల్‌సెన్సైస్ వాళ్లిచ్చే ‘అవుట్‌స్టాడింగ్ విమెన్ లీడర్స్ పంచాయత్ అవార్డ్’ను అందుకుంది. ఇంతా చేసి, సుష్మభదు ఫిఫ్త్‌క్లాస డ్రాపవుట్. ‘అందుకే చదువు విలువ తెలిసింది. మా ఊళ్లో డ్రాపవుట్స్ ఉండకూడదనే ఆలోచన వచ్చింది. ఇన్ని మంచిపనులు చేసే అవకాశం దొరికింది’ అంటుంది వినమ్రంగా!
 
ఆడపిల్లల్ని చదివించింది...
ఊరి తలరాత మార్చింది! చిన్నప్పుడు అన్నలతో కలిసి తాను చదువుకోలేని సుష్మ భదు.. ఆ అదృష్టాన్ని ధనిమియా గ్రామంలోని ఆడపిల్లలకు కల్పించింది. అయితే ఈ పనికి ఆమె ఊళ్లోని ఉన్నత కులాల పెద్దమనుషులతో చాలా మాటలే పడింది. సుష్మభదు భర్తను పిలిపించి ‘నీ భార్యను అదుపులో పెట్టుకో’ అని హెచ్చరించారు. పెద్దకులాల వాళ్లంతా ఒక్కటై ఆమె ఇంటికి మంచినీళ్లు అందకుండా, కరెంట్ లేకుండా చేశారు. వీటికి భయపడ్డ ఆమె అత్త, మామ, భర్త ‘ఈ గొడవ అంతా ఎందుకు వాళ్లు చెప్పినట్టు చెయ్’ అని ఆమెకు నచ్చజెప్పబోయారు. సుష్మభదు వినలేదు. పదిహేను రోజులు మంచినీళ్లు లేక, కరెంట్ రాక అవస్థలు పడ్డా తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోలేదు. విసుగు చెందిన పెద్దలంతా కలిసి ఆమెను సర్పంచ్ పదవి నుంచి దింపేయడానికి కుట్రలూ పన్నారు. అయితే ఊళ్లోని బహుజనులంతా ఊరికి మంచి చేయాలనుకున్న ఆమె మనసును అర్థం చేసుకున్నారు. అండగా నిలిచారు. అలా వాళ్ల సహకారంతో ఆడపిల్లల చదువుకు ప్రణాళికలు వేసింది. ఆర్థికస్థోమత లేక పిల్లల ఫీజులను గ్రామపంచాయతీనే కట్టేలా ఫండ్‌ను ఏర్పాటు చేసింది. వాళ్లకు యూనిఫామ్స్, పుస్తకాలనూ పంపిణీ చేయిస్తోంది.

ఊళ్లో ఐదో తరగతి వరకే స్కూల్. హైస్కూల్‌కి వెళ్లాలంటే 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న టౌన్‌కి పోవాల్సిందే. దూరభారమని ఆడపిల్లల్ని పంపేందుకు తల్లిదండ్రులు జంకుతుంటే వాళ్లకు ధైర్యం చెప్పి గ్రామపంచాయతీ తరపున ఆ ఆడపిల్లలందరికీ సైకిళ్లు ఇప్పించింది. దీని కోసం ఆమె పడ్డ శ్రమ అక్షరాల్లో పెట్టినంత తేలిక కాదు. సాయంకాలం ప్రతి ఇంటికి వెళ్లి ఆ కుటుంబంలోని మహిళలతో సమావేశమయ్యేది. ‘మీ కూతుర్నీ మీలాగే వంటింటికి పరిమితం చేయాలనుకుంటున్నారా? పొయ్యిలో పుల్లలు సర్దుతుతూ గొట్టంతో మంట ఊదుతూ ఆమె తలరాత మసిగొట్టుకుపోవాలనుకుంటున్నారా? లేక బాగా చదివించి జీవితాన్ని చక్కదిద్దుకునే నేర్పరిగా తయారు చేయాలనుకుంటున్నారా?  చదువు చెప్పిస్తే మీ కూతురి తరం నుంచైనా బాగుపడే అవకాశం ఉంది. లేదంటే తర్వాత తరాలన్నీ మీలాగే వంటింట్లో మసిగొట్టుకుపోతారు. మీ ఇంటికి చదువుకున్న కోడలు రావాలి అనుకుంటే ముందు మీ ఇంటి ఆడపిల్లను చదువుకున్న కూతురుగా మార్చండి’అంటూ  వాళ్లలో కొత్త ఆలోచనలు రేపింది. ఆడపిల్లల చదువుకు మొగ్గుచూపేలా ప్రేరేపించింది.
 
 - సాక్షి ఫ్యామిలీ
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement