అప్పుడే వద్దన్నారు ఎపుడెపుడా అనుకున్నారు!
అప్పుడే వద్దన్నారు ఎపుడెపుడా అనుకున్నారు!
Published Wed, Oct 16 2013 12:09 AM | Last Updated on Fri, Sep 1 2017 11:40 PM
అప్పుడే వద్దన్నారు ఎపుడెపుడా అనుకున్నారు!
చెన్నైలో ‘ఇంగ్లిష్‌కారన్’ షూటింగ్ జరుగుతోంది.
నటీనటుల్లో... శివబాలాజీ, స్వప్నమాధురి.
వస్తున్నారు. చేస్తున్నారు. వెళ్లిపోతున్నారు. అంతవరకే.
నో పరిచయం, నో స్నేహం! (నో స్మైల్ కూడానేమో).
అయితే... వీళ్లిక్కడ యాక్ట్ చేస్తున్న సమయంలో...
షూటింగ్ స్పాట్‌లో -
అబ్బాయి ‘మమ్మీ’కి, అమ్మాయి ‘మామ్’కీ
పరిచయం అయింది, స్నేహం మొద లైంది!
ఓ రోజు మాటల్లో ...
‘ఈడూజోడూ బాగున్నారు కదా’ అనుకున్నారు.
ఆ మాటే పిల్లలతో అన్నారు.
‘ఎస్’ అనలేదు శివ, స్వప్న.
టైమ్ అడిగారు. మినిమం మూడేళ్లు అన్నారు.
ఆ మూడేళ్లలో ఈ జంట అనుభవాలేమిటి?
పెళ్లయిన ఈ నాలుగేళ్లలో అనుభూతులేమిటి?
చదవండి ఈవారం ‘మనసే జతగా...’
అబ్బాయి, అమ్మాయి పెళ్లి అయ్యేంతవరకు విభిన్న జీవనశైలుల మధ్య పెరుగుతారు. తల్లిదండ్రుల మీద ఆధారపడుతూ ఉంటారు. తమ ఇష్టానికి తగినట్టుగా ఉంటారు. పెళ్లయ్యాక ఒకే ఇంట్లో ఒకటే అన్నట్టుగా కలిసి ఉంచే బంధంతో సహజీవనయానాన్ని కొనసాగిస్తూ ఉంటారు. అప్పటివరకు బాధ్యతారాహిత్యంగా పెరిగిన పిల్లలు పెళ్లి అవడంతోనే బాధ్యతగా ఒదిగిన విధానాన్ని చూసినవారూ అబ్బురపడుతుంటారు. పెళ్లిలో ఉండే మహిమ ఇదే సుమా అని చల్లగా నవ్వుతుంటారు. ఆ నవ్వులే ఆశీస్సులుగా అందుకుంటూ ఉంటారు కొత్తజంటలు. శివబాలాజీ, స్వప్నమాధురి వివాహబంధంతో ఒక్కటై నాలుగేళ్లు (మార్చ్ 1, 2009) దాటింది. ‘‘ఇద్దరూ సినిమా ఆర్టిస్టులే! సినిమా షూటింగ్స్ ఉంటే చాలు సొంత పనులన్నీ పక్కన పెట్టేసి సిద్ధమైపోతాం’’ అని చెప్పిన ఈ జంట హైదరాబాద్‌లోని మణికొండలో నివాసముంటున్నారు.
విభిన్న నేపథ్యం
శివబాలాజీ, స్వప్నమాధురిల బాల్యంలో ఎక్కడా పోలికలు లేవు. ఆ విషయాన్నే స్వప్న ప్రస్తావిస్తూ- అమ్మ, నాన్న అన్నయ్య, అక్క, నేను చెన్నై వాసులమే అయినా పుట్టిపెరిగింది అంతా హైదరాబాద్‌లోనే! పొరపాటున కూడా సినిమా రంగానికి వస్తానని అనుకోలేదు. ఇంటర్మీడియెట్ చదువుతున్న రోజుల్లో సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్నాను. తమిళ టీవీ వాళ్లు చూసి యాంకరింగ్‌కు అవకాశం ఇచ్చారు. ఆ తర్వాత సినీరంగానికి పరిచయం అయ్యాను. దాదాపు పదకొండేళ్లుగా ఈ రంగంలోనే ఉన్నాను’’ అని చెప్పారు.
శివబాలాజీ తన గురించి చెబుతూ - ‘‘నాకు ఇద్దరు బ్రదర్స్, ఒక సిస్టర్! నాన్నగారి వైపు అంతా వ్యాపారస్థులే! ఆంధ్రప్రదేశ్ వారమే అయినా పుట్టి పెరిగింది అంతా చెన్నైలోనే! చదువు పూర్తవగానే నాన్న ఫ్యాక్టరీలోనే మేనేజర్‌గా పనిచేశాను. చిన్ననాటి నుంచి సినిమా అంటే చాలా ఆసక్తి. ‘ఏదైనా ఒకటే ఫీల్డ్ ఎంపిక చేసుకో’ అని నాన్న హెచ్చరించడంతో సినిమానే ఓకే చేశాను. ‘ఇంగ్లిష్‌కరణ్’ అనే తమిళ సినిమాలో ఇద్దరం కలిసి నటించాం. ఆ సినిమాతో ఇద్దరం స్నేహితులమయ్యాం’’ అని వివరించారు.
ఇద్దరమ్మలు కుదిర్చిన వైనం
తమ పెళ్లిని పెద్దలు కుదిర్చిన వైనాన్ని వివరిస్తూ శివబాలాజీ - ‘‘సినిమా షూటింగ్ చెన్నైలో! దీంతో షూటింగ్ స్పాట్‌కి మా అమ్మ వచ్చేవారు. స్వప్న వెంట వాళ్ల అమ్మ ఉండేవారు. అలా మా అమ్మ, వీళ్లమ్మ ఇద్దరూ మంచి స్నేహితులయ్యారు. ముందు వారిద్దరూ మా పెళ్లి గురించి మాట్లాడుకున్నారు. మాకు అప్పటికి పెళ్లి ఆలోచన కూడా లేదు. మేమే ‘కెరియర్ ప్రారంభదశలో ఉన్నాం. పరిశ్రమలో నిలదొక్కుకోవడానికి మూడేళ్లు టైమ్ కావాలి’ అని అడిగాం. అప్పటివరకు రాబోయే అమ్మాయికి సాఫ్ట్ నేచర్ ఉంటే చాలు అనుకున్నాను. స్వప్నలో ఆ క్వాలిటీస్ బోలెడు ఉన్నాయి. అందుకే కాదని చెప్పలేదు’’ అని శివబాలాజీ చెబుతుంటే ‘‘మా ఇంట్లో యాక్టింగ్ ఫీల్డ్‌లో ఉన్నవారికి ఇవ్వాలనే ఆలోచన ఎప్పుడూ లేదు. ఎందుకంటే ఈ ఫీల్డ్ ఎప్పుడూ ఒకలా ఉండదు. కష్టనష్టాలను భరించగలగాలి. కాని బాలాజీ కుటుంబం అంతా మా ఇంట్లో వారికి బాగా నచ్చారు. దాంతో ఒప్పుకున్నారు. నాకూ ‘ఇలాగే ఉండాలి’ అని ప్రత్యేకమైన నిబంధనలేవీ లేవు. దాంతో ఓకే అయిపోయింది’’ అన్నారు స్వప్న.
పరిశోధనల ప్రయాణం
ఇద్దరూ సినిమాలు చేస్తున్నారు. అనుకోకుండా ఇద్దరికీ యాక్టింగ్‌లో కొంత గ్యాప్ ఏర్పడటం మొదలైంది. అప్పుడే భవిష్యత్తు గురించిన ఆలోచన ఇద్దరిలోనూ మొదలైంది. ఆ ఆలోచన గురించి స్వప్న చెబుతూ- ‘‘బాబు పుట్టాక యాక్టింగ్‌లో నేను కొంత గ్యాప్ తీసుకున్నాను. కాస్త తీరిక దొరకడంతో కిందటేడాది చాలా పరిశోధన చేసి ‘ఈమూ బర్డ్స్ ఫామ్’ మొదలుపెట్టాం. ఇందుకోసం మా ఇద్దరి కుటుంబాలు చాలా సపోర్ట్‌నిచ్చాయి. ‘సియానా’ పేరుతో ‘ఈమూ ప్రొడక్ట్స్’ మార్కెట్ చేస్తున్నాం. ఈ ఫామ్ ఏర్పాటు కోసం మూడు నెలల పాటు అడవిలోనే గిరిజనుల మధ్య గడిపాం. అక్కడికెళితే అదో ప్రపంచంలో ఉన్నట్టు ఉంటుంది. ఎవరైనా అక్కడికి వస్తే అంత త్వరగా వెళ్లలేరు. అంతబాగా డిజైన్ చేశాం. బాలాజీకి చిన్నప్పటి నుంచి వ్యాపార మెలకువలు తెలుసు. ఈయనా సినిమాలోకి వచ్చి పన్నెండేళ్లు అవుతోంది. దీంతో రెండురంగాల్లోనూ ఇద్దరికీ అవగాహన ఏర్పడింది. భవిష్యత్తు ఆలోచన ఏదైనా ఇద్దరం కలిసి చర్చించుకుంటాం. ‘చేయగలం’ అనిపించాక ఎన్ని అడ్డంకులు ఎదురైనా తట్టుకుంటాం’’ అన్నారు స్వప్న.
ఒకరికోసం ఒకరు మార్పు
‘‘ఎంగేజ్‌మెంట్ తర్వాత నాపై కంట్రోల్ చేయడం మొదలుపెట్టింది స్వప్న. పెళ్లి తర్వాత రెండేళ్లపాటు అది కంటిన్యూ అయ్యింది. తర్వాత తప్పక ఈవిడే కంట్రోల్ అయిపోయింది’’ అన్నారు శివబాలాజీ నవ్వుతూ! తన మనస్తత్వం పెళ్లికి ముందు ఎలా ఉందో ఇప్పుడూ అలాగే ఉందని, ఎలాంటి మార్పులు రాలేదన్నారు. బహూశా పెళ్లికి ముందు మూడేళ్ల సమయంలో మార్చుకున్న పద్ధతులే ఇప్పటికీ కంటిన్యూ అవుతుండాలి... అన్నారు. ‘‘పెళ్లికి ముందు నువ్వు కోరినట్టు ఉంటాను అని ప్రామిస్ చేశారు. కాని ఆ ప్రామిస్‌ను నిలబెట్టుకున్నది ఏమీ లేదు’’ కంప్లైంట్ చేశారు స్వప్న. తనలో వచ్చిన మార్పులనే చెబుతూ-‘‘పెళ్లికి ముందు ప్రతి చిన్నదానికి అమ్మ మీద ఆధారపడేదాన్ని. అడగ్గానే ఇంట్లో వారు అన్నీ అమర్చిపెట్టేవారు. పెళ్లి తర్వాత ఇండిపెండెంట్ అయ్యాను. ఇంటి పనులు, బయట పనులుస్వయంగా చేసుకోవడం నేర్చుకున్నాను’’ అన్నారు ఆమె!
ఎప్పటికీ మరిచిపోలేని మధురిమ
తమ మధ్య బంధాన్ని పటిష్టం చేసిన సంఘటన గురించి స్వప్న చెబుతూ - ‘‘మా ఎంగేజ్‌మెంట్ అయ్యాక ఒకసారి సినిమా షూటింగ్ కోసం కొచ్చిన్ దగ్గర మారుమూల పల్లెకు వెళ్లాల్సి వచ్చింది. అక్కడికి ఫోన్ సౌకర్యం కూడా లేదు. వెళ్లేముందు ఈయనకు ఫలానా చోటు అని సమాచారం ఇచ్చాను. నా పుట్టిన రోజున అర్ధరాత్రి ఒక బొకే వచ్చింది. నేను నమ్మలేదు. ఎవరు పంపారో తెలుసుకున్నాక చాలా సర్‌ప్రైజ్ అయ్యాను. ఆరునెలల తర్వాత మా మధ్య బొకే ప్రస్తావన వచ్చింది. ఆ బొకే ఇంకా ఉందని తెలుసుకొని, తిరిగి ఇమ్మన్నారు. తర్వాత ఒక రోజు ఆ బొకేలోని పువ్వులను, గడ్డిని మోడ్రన్ ఆర్ట్‌లా డిజైన్ చేసి, ఫ్రేమ్ చేయించి తెచ్చారు. అప్పుడు ఆ ఎక్స్‌ప్రెసివ్ ధోరణి చాలా బాగా ఉండేది. ఇప్పడు ప్రేమ ఉన్నా అన్నీ మనసులోనే దాచుకుంటారు. అప్పటిలాగే ఇప్పుడూ ఎందుకుండరు అంటుంటాను’’ అని ఆమె చెబుతుంటే ‘‘అలాగే ఉంటే కాపురాలు ఉండవు మేడమ్! పెళ్లికి ముందు పీరియడ్ సినిమా ట్రైలర్స్ లాంటివి. ఆసక్తి ఎక్కువ. అదే ఫ్యామిలీ అయితే ఫుల్ సినిమా! అదే సినిమా చూశాక కదా నచ్చడం, నచ్చకపోవడం ఉండేది’’ అంటూ కాపురాన్ని సినిమాతో లింక్ చేసి చెప్పారు శివబాలాజీ! మూడేళ్ల తమ కుమారుడు ధన్విన్ తమ జీవితంలో అడుగుపెట్టాక బంధాల గొప్పతనం మరింతగా అవగాహనలోకి వచ్చిందని చెప్పింది ఈ జంట. ‘‘సినిమా షూటింగైనా, వ్యాపార లావాదేవీలైనా, కుటుంబ బాంధవ్యా లైనా.. నేటితరం మల్టీటాస్కింగ్ చేస్తోంది. అయినా ఒకదానికొకటి సమస్యగా మారకుండా బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు సాగుతుండాలి. పెళ్లి వయసు ఎంత అనేది ప్రామాణికం కాదు, పెళ్లిపట్ల కలిసి ఉండే వ్యక్తుల మధ్య అవగాహన ఎంతో తెలియడం ముఖ్యం’’ అని తెలిపింది ఈ జంట.
ఇద్దరూ ఒకే విధంగా...
మా ఇద్దరికీ వంట వచ్చు. దీంతో ఎప్పుడూ సమస్య కాలేదు. ఇద్దరికీ ఇండిపెండెంట్‌గా ఉండటమూ అలవాటే ! నటనలో ఇద్దరమూ విమర్శించుకోం. అవకాశాలు వచ్చేదాన్ని బట్టి ఎంపిక చేసుకోవడం. స్టోరీస్ వస్తే దాన్ని బట్టి డిస్కస్ చేసుకోవడం మామూలే! ఏదైనా నచ్చని ప్రాజెక్ట్ వస్తే ఇద్దరికీ నచ్చదు. చివరగా ఎవరి నిర్ణయం వారిదే! మా కెరియర్ గురించి మాకు తెలుసు. దాన్ని బట్టి ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలో అవగాహనకు వచ్చాం. వృత్తిపరంగా టైమ్ టు టైమ్ ప్లాన్ చేసుకుంటాం. దాన్నిబట్టి సమస్యలు రాకుండా జాగ్రత్తపడతాం ఒకరికి షూటింగ్ ఉంటే ఇంకొకరు ఇంటా బయట పనులు చూసుకుంటాం. ఇద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకుంటాం కాబట్టి ఎదుటి వారి అలసటను గుర్తిస్తాం. కావల్సినంత విశ్రాంతినిస్తాం పని ఒత్తిడి వల్ల అని మాత్రమే కాదు ఏవో చిన్న చిన్న చిరాకులు ఇద్దరికీ వస్తూనే ఉంటాయి. కాని సాధ్యమైనంత త్వరగా పరిష్కరించుకొని కూల్ అయిపోతాం.
స్వప్నమాధురి (తమిళంలో పేరు మధుమిత)
తెలుగు: సందడే సందడి, రెండుగుండెల చప్పుడు, మన్మథుడు, నువ్వే నువ్వే, పుట్టింటికి రా చెల్లి, కీలుగుర్రం, ఊ కొడతారా? ఉలిక్కిపడతారా? తమిళం: కుడైకుల్ మజ్‌హై, అముథే, బాయ్‌ఫ్రెండ్, ఇంగ్లిష్‌కారన్, నాలయి, ఆన్వీర్, సొల్ల సొల్ల ఇనిక్కుమ్, యోగి, తూంగానాగారం, కాథల్ మైపడ, బిర్యానీ, రుద్రమదేవి కన్నడ: నాను నేను జోడి
శివబాలాజీ:
తెలుగు: ఇది మా అశోక్‌గాడి లవ్ స్టోరీ, ఎలా చెప్పను, దోస్త్, సంక్రాంతి, పోతే పోనీ, గోల్డ్ స్పాట్, కుంకుమ, సరదా సరదాగా, అన్నవరం, పగలే వెన్నెల, చందమామ, శంభో శివ శంభో, టార్గెట్, ఆగంతకుడు, కోకిల, ఆర్య, జగమే మాయ.
- నిర్మలారెడ్డి, సాక్షి ఫీచర్‌స ప్రతినిధి
Advertisement
Advertisement