సాహిత్య మరమరాలు
చెళ్లపిళ్ల వేంకటశాస్త్రికి ఒక అలవాటు ఉండేది. ఏదైనా సభకు ఈయన అతిథిగా వెళ్తారు కదా, ఎవరైనా వక్త మాట్లాడుతూవుంటే ఆ ప్రసంగానికి మధ్యలో ఏదో వ్యాఖ్యానం చేసేవారు. లేదా వాళ్లు చెప్పిందానికి అదనపు వివరణ ఇచ్చేవారు. లేదా వాళ్లు మాట్లాడిందానిలో తప్పు దొర్లితే సవరించేవారు. ఆ రోజుల్లో సాహిత్య సభలు గంటలు గంటలు కొనసాగేవి. అందువల్ల అంత దీర్ఘ సమయం వరకు మరిచిపోతానేమోననే పెద్దరికం కొంతా, సభ దృష్టి తన మీద ఉండాలన్న చాపల్యం కొంతా దీనికి కారణాలు.
ఒకసారి బందరులో ఓ సాహిత్య సమావేశం జరిగింది. దీనికి చెళ్లపిళ్లతో పాటు ఆయన శిష్యుడు విశ్వనాథ సత్యనారాయణ కూడా హాజరయ్యారు. విశ్వనాథ ప్రసంగిస్తుండగా, తన సహజ ధోరణిలో వ్యాఖ్యానం చేస్తున్నారు చెళ్లపిళ్ల. గురువు కాబట్టి, గట్టిగా ఏమీ అనలేడు. అలా అని ఊరుకునే రకమూ కాదు. ఇక్కడో సంగతి గుర్తుంచుకుంటే తర్వాతి విసురు అర్థమవుతుంది. జంటకవిత్వంలో చెళ్లపిళ్ల తోడు దివాకర్ల తిరుపతిశాస్త్రి అప్పటికే మరణించారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని విశ్వనాథ ఒక బాణం వేశారు. ‘మా గురువు గారికి జంట కవిత్వం చెప్పడమే అలవాటు. తిరుపతిశాస్త్రి గారు ఈయన్ని విడిచిపెట్టి పోయినా జంట కవిత్వాన్ని మాత్రం మా గురువుగారు ఇంకా విడిచిపెట్టలేదు’.
(మీకు ఇలాంటి మరమరాలు తెలిస్తే మాకు రాయండి.)
Comments
Please login to add a commentAdd a comment