అది ఆప్యాయంగా తాకే చేయా? కాదు... కానే కాదు. మరి ఆకలిగా తడిమే చెయ్యా? అవును... అవును... అవును. ఆ చేతినీ, ఆ చేష్టనూ ఆపేదెలా? ఆమెకు అప్పుడు తెలియదు. కానీ ఇప్పుడు తెలిసింది. అలాంటి చేతులకు అడ్డుకట్ట ఎలా వేయాలో. ఎప్పటివో తప్పులకు ఇప్పుడూ శిక్షపడేందుకు చట్టంలోనే ఓ మార్పు వచ్చేలా కృషిచేస్తున్నపూర్ణిమా గోవిందరాజులు బయోగ్రఫీ ఇది.
పందొమ్మిది వందల ఎనౖభైఆరో.. ఎనభైఏడో.. సంవత్సరం సరిగ్గా గుర్తులేదు. అప్పుడామె వయస్సు 22 ఏళ్లు ఉండొచ్చు. మాంట్రియల్ (కెనడా)లోని తన సోదరుడి ఇంట్లో ఆమె టీవీ చూస్తూ ఉంది. నాన్న చనిపోవడంతో అమ్మ, తను చెన్నై నుంచి అన్న దగ్గరకి వచ్చేశారు. టీవీలో చానెల్స్ మారుస్తూ ఉంది. ఓ చానెల్‌లో వస్తున్న ఓ షో దగ్గర ఆగిపోయింది. చైల్డ్ సెక్సువల్ అబ్యూజ్ టాపిక్. దాని బారినపడ్డవాళ్లను ఇంటర్వ్యూలు చేస్తున్నారు. హఠాత్తుగా ఆలోచనల్లో పడింది ఆమె. ‘అయితే ప్రపంచంలో నేనొక్కదాన్నే కాదన్నమాట. నాలాంటి వాళ్లు ఇంతమంది ఉన్నారు’ అనుకుంది.
ఏవో జ్ఞాపకాలు వెంటాడాయి. చిన్నప్పుడు తనను తన కజిన్ హజ్బెండ్ అలాగే అబ్యూజ్ చేశాడు. అప్పుడు ఆమెకు ఆరేళ్లు. వాళ్ల నాన్న చాలా డబ్బు పోగొట్టుకొని వాటిని రికవరీ చేసుకోవడానికి వెళ్లేవాడు. అమ్మకేమో స్కీర్లోసిస్. పిల్లలను చూసుకునే స్థితిలో ఉండేదికాదు. దాంతో ఆమె తండ్రి అలా వెళ్లినప్పుడల్లా వాళ్లను ఆమె కజిన్ ఇంట్లో దింపేవాడు. ఆ ఇంట్లో రాత్రుళ్లు ఏదో భయంకరమైన కల భయపెట్టి నిద్రలోంచి ఉలిక్కిపడిలేచేలా చేసేది. కళ్లు తెరిచి చూసేసరికి పక్కన అతను ఉండేవాడు. ఆ అమ్మాయి పాంటీ విప్పి ఏదో చేస్తూ.
మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేనప్పుడుకూడా తన పాంటీలో చేతులు పెట్టేవాడు. వణుకుతూ దిగ్గున కూర్చుంది ఆ పిల్ల. ఏడుపొస్తుంటే వెంటనే తన చేత్తో ఆమె నోటిని మూసేశాడు. అలాగే వెనక్కి వాల్చి పడుకో అన్నట్టు సైగచేసి గమ్మున బయటకు వెళ్లిపోయాడు. కాని ఆరేళ్ల ఆ పాప నిద్రపోయేది కాదు మిగిలిన రాత్రంతా. భయం.. పడుకుంటే మళ్లీ వస్తాడేమోనని. అది మొదటిసారి కాదు చాలాసార్లు జరిగింది. తాకకూడని చోట్ల తాకాడు. చేయడకూడని పనులు చేశాడు. కాని ఆ బాధ ఎప్పుడూ ఎవరితో చెప్పలేదు. చెబితే అందరూ తననే తిడతారేమోననే భయం. అతను అలా తాకినప్పుడల్లా తానంతా డర్టీగా అయిపోయాననే భావన.
తన కజిన్‌తో చెప్పి ఏడ్వాలనిపించేది. కాని వాళ్లు తమ కన్నా డబ్బున్నవాళ్లు. ఆర్థికంగా తన కుటుంబానికి చాలా సాయం చేస్తున్నారు. తండ్రి ఊళ్లకు వెళ్లినప్పుడల్లా తమను ఇంట్లో పెట్టుకుంటున్నారు. అతను మంచివాడు కాదు... ఇలా చేస్తున్నాడు అని చెబితే ఆ సాయమంతా ఆగిపోతుందనే భయం. ఇంటికి రానివ్వరని భయం. అమ్మానాన్న తిడతారనే భయం. ఇంచుమించు తన వయసున్న అతని బిడ్డా తనతో సన్నిహితంగానే ఉంటుంది. ఆమెతోనూ చెప్పలేదు ఇదే భయంతో. ఆ గతం పీడ ఒళ్లు గగుర్పొడిచేలా చేసి ఈ లోకంలోకి తెచ్చింది ఆమెను. ఇప్పుడు ఆమె వయసు 53 ఏళ్లు. పేరు పూర్ణిమా గోవిందరాజులు. కెనడాలో ఎకాలజిస్ట్‌గా పనిచేస్తోంది. చెన్నైలో పుట్టిపెరిగింది. తన 21వ యేట కెనడాకు వెళ్లింది. ఓవైపు అక్కడ పనిచేస్తూనే ఇంకోవైపు వరల్డ్ పల్స్ కమ్యూనిటీలో చేరి తన మాతృభూమి ఇండియా అభివృద్ధిలో పాలుపంచుకుంటోంది.
పూర్ణిమ గురించి చెప్పడానికి సందర్భం?
బాల్యంలో తాను ఎదుర్కొన్న చైల్డ్ సెక్సువల్ అబ్యూజ్‌కు ఇప్పుడు ఇండియాలో పోక్సో (ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్) అనే యాక్ట్ వచ్చిందని తెలిసీ 2016లో కంప్లయింట్ ఫైల్ చేసింది. మైనర్‌గా ఉన్నప్పుడు తన మీద సెక్సువల్ అబ్యూజ్ జరిగిందని. పూర్ణిమను పట్ల అనుచితంగా ప్రవర్తించిన ఆ వ్యక్తి వయసు ఇప్పుడు 75 ఏళ్లు.
‘‘ఆ సంఘటన జరిగింది దాదాపు నలభై ఏళ్ల కిందట. ఆ సమయంలో సెక్స్ అనే పదాన్ని కూడా నేను వినలేదు. చిన్నపిల్లల పట్ల అలా పాల్పడుతున్న నేరానికి ఓ పేరుంటుందన్న జ్ఞానం కూడా నాకులేదు’’ అంటుంది నాటి పరిస్థితులను గుర్తుచేసుకుంటూ. కాలక్రమంలో పూర్ణిమను అలా బాధించిన వ్యక్తి కూతురుతోనే ఆమె అన్న పెళ్లి అయింది.
ఒకసారి..
మాంట్రియల్‌లో పూర్ణిమ, వాళ్ల వదిన ఇద్దరూ కలిసి టీవీ చూస్తున్నారు. అప్పుడూ ఇలాగే చైల్డ్ సెక్సువల్ అబ్యూజ్ మీద షో వస్తోంది. ‘‘ఇండియాలో అయితే ఇలాంటి ఘోరాలు ఉండవు’’ అంటూ మొదలుపెట్టింది పూర్ణిమ వాళ్ల వదిన. వినీ వినీ ఒక్కసారిగా అంది పూర్ణిమ ‘ఎందుకుండవ్? ఉంటాయి చాలా. నాకే జరిగింది’’ దాదాపు అరిచినట్టుగా చెప్పింది. తనతో అలా ఎవరు ప్రవర్తించారో కూడా చెప్పింది. నిశ్చేష్టురాలైంది వదిన. ‘‘మా నాన్నా?’’ నమ్మలేనట్టుగా అడిగింది. ‘‘అవును.. మీ నాన్నే’’ చెప్పింది. తన తండ్రి పూర్ణిమతో ఎప్పుడూ వింతగా ప్రవర్తించడం గుర్తుకురాసాగింది ఆమెకు. ఎప్పుడైనా తన తండ్రి తనను దగ్గరకు తీసుకుంటున్నప్పుడు పూర్ణిమ కోపంగా వచ్చి తన తండ్రిని అవతలకు తోసేసేది. అలా ఎందుకు చేసేదో అప్పుడు ఆమెకు అర్థంకాలేదు.
కాని ఈ రోజు అర్థమైంది. ఇక ఆ విషయం గురించి ఆ ఇద్దరు ఎప్పుడూ మాట్లాడుకోలేదు. కాని 1999లో అనుకుంటా.. పూర్ణిమా వాళ్ల అన్నయ్యకు పాప పుట్టింది. చంటిదాన్ని తీసుకొని ఇండియాకు రావల్సిందని ఆయన మామగారు ఆహ్వానించారు. అప్పుడు అడిగాడు పూర్ణిమ వాళ్లన్నయ్య ఆమెను.. ‘‘మేము పాపను తీసుకొని ఇండియాకు... పర్టిక్యులర్‌గా ఆ ఇంటికి వెళ్లొచ్చా. నా బిడ్డకు క్షేమమేనా?’’ అని అడిగాడు. ‘‘క్షేమం కాదు’’ అని చెప్పింది ఖరాకండిగా. ఎందుకో కూడా వివరించింది. నివ్వెరపోయాడు అన్న. బిడ్డతో ఇండియాకు వెళ్లినప్పుడు మామగారిని నిలదీశాడు. తర్వాత అత్తగారినీ అడిగాడు. ‘‘నాకు మెలకువ వచ్చిచూసినప్పుడల్లా ఆయన పూర్ణిమ పక్కనే కనపడేవాడు.
పీడకలతో పిల్ల ఉలిక్కిపడుతుంటే ధైర్యం చెబుతున్నా అనేవాడు’’ అంది. ఇదంతా అయ్యాక పూర్ణిమతో ఆమె.. ‘‘మా ఆయన నిన్ను కూతురు వాత్సల్యంతోనే చూశాడు. ముట్టుకున్నాడు. నువ్వేమనుకున్నా అతను నా దేవుడు. క్షమించు’’ అంది. ఈ సంఘటన తర్వాత తన కజిన్‌తో కూడా మాట్లాడ్డం మానేసింది పూర్ణిమ. ఆమె, వాళ్లన్నయ్య బాగా ఆలోచించి ఒకటి నిశ్చయించుకున్నారు. తమ ఆడపిల్లలకే కాదు ఆ కుటుంబంలోని అమ్మాయిలందరికీ రక్షణ కావాలని. దాంతో చిన్నప్పుడు తనకేం జరిగిందో వివరిస్తూ తమ పరివారంలోని సభ్యులందరికీ ఈ–మెయిల్ చేసింది పూర్ణిమ.
‘‘ఓ చేదు గతాన్ని... అదీ భయంతో గడిచిన బాల్యం గురించి అలా అందరికీ చెప్పడం మానసికంగా నన్ను చాలా డిస్టర్బ్ చేసింది. వినడం వల్ల మా వాళ్లు కూడా డిస్టర్బ్ అయ్యారు’’ అంటారు పూర్ణిమ. ఈ మెయిల్ చదివిన ఇంకో కుటుంబసభ్యురాలు ఆ వ్యక్తి తననూ చిన్నప్పుడు అలాగే చేశాడని పూర్ణిమ, వాళ్లన్నయ్యతో చెప్పుకుంది. ‘‘చిన్నప్పటి ఆ దారుణం వల్ల నేను ఏ మగవాడినీ నమ్మలేకపోయా. చివరకు కట్టుకున్న భర్తను కూడా. పిల్లల్ని కనాలంటే భయమేసేది. వాళ్లను కాపాడుకోగలనా అని మధనపడేదాన్ని. ఇలాంటి నరకంతోనే పదహారేళ్ల వైవాహిక జీవితం గడిచిపోయింది. భర్తతో చనువుగా ప్రవర్తించలేక.. అతనితో సఖ్యంగా ఉండలేక చివరకు విడాకులతో ఆ బంధాన్ని సమాప్తం చేసుకున్నా’’ అని చెప్పింది పూర్ణిమ.
‘‘ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపిన నేను నన్ను అబ్యూజ్ చేసిన అతని మీద కంప్లయింట్ ఇచ్చిన రాత్రి హాయిగా... ప్రశాంతంగా నిద్రపోయా’’అని అంది. ఇదే విషయం మీద కెనడా పోలీస్ డిపార్ట్‌మెంట్‌లోనూ కంప్లయింట్ ఫైల్ చేసింది ఆమె. అయితే ఆమె కంప్లయింట్ మీద చాలా తర్జనభర్జనలు, చర్చలూ జరిగాయి... ఎప్పుడో చిన్నప్పుడు జరిగిన అబ్యూజ్‌ను ఇన్నేళ్ల తర్వాత కంప్లయింట్‌గా ఇస్తే దాన్ని పోక్సో చట్టంకింద తీసుకోవచ్చా అని! ఇప్పుడు విమెన్ అండ్ చైల్డ్ డెవలప్‌మెంట్ మంత్రిత్వశాఖ చిన్నప్పుడు జరిగిన సెక్సువల్ అబ్యూజ్‌ను తన జీవితకాలంలో ఎప్పుడైనా సరే కంప్లయింట్ ఇవ్వచ్చు అనే దిశలో చట్టంలో మార్పులు చేయడానికి అడుగులు వేస్తోంది. ఈ శుభపరిణామానికి పూర్ణిమ గోవిందరాజులు ప్రయత్నమే కారణం.
‘‘భారతదేశంలో చాలామంది పిల్లల బాల్యం ఇలాంటి పీడకలలతోనే తెల్లారుతోంది. కుటుంబ బంధాలు, అనుబంధాలు,ఆర్థిక సమస్యలు, పిల్లల ఇబ్బందులను అర్థంచేసుకోలేని, వాళ్ల మాటలను నమ్మని పరిస్థితులు వగైరాల వల్ల ఆ పిల్లలలెవరూ నోరెత్తరు. వాళ్లు చెప్పినా వినేపెద్దవాళ్లుండరు. ఆ సైలెన్స్‌ను బ్రేక్‌చేయడానికే నేను నోరువిప్పా. జరిగినదాన్ని నిర్భయంగా బయటకు చెప్పే ధైర్యం మిగిలిన వాళ్లకు ఇవ్వడానికి నేనొక ఉదాహరణగా ఉండదల్చుకున్నా. నాలా చైల్డ్ సెక్సువల్ అబ్యూజ్‌కు గురైనవాళ్లకు మానసికస్థైర్యం కల్పించే ప్రయత్నం చేస్తాను. నిందితులకు శిక్షపడాలి. బాల్యం అందరికీ అందమైన జ్ఞాపకంగా ఉండాలి. ఇది పిల్లల హక్కు’’అంటున్నారు పూర్ణిమా గోవిందరాజులు.
– శరాది
Comments
Please login to add a commentAdd a comment