బ్లడ్‌గేట్స్!
నీరెక్కువైతే మొక్క చనిపోతుంది.
నీరు మొక్క ప్రాణం నిలపడానికి ఎంత ఆధారమో.
ఎక్కువై వరదలా మారితే అంతే ప్రమాదం.
అలాగే ప్రవహించే రక్తం పరిధి దాటి కారిపోతుంటే ప్రాణానికే నష్టం.
ప్లేట్‌లెట్స్... కారిపోయే రక్తానికి అడ్డుకట్ట వేసే ఫ్లడ్‌గేట్స్.
రక్తం మన దేహంలో ప్రవహించే జీవనది. సుజలం ప్రతి మొక్కను సుఫలం చేసినట్టే ఈ రుధిరగంగ కూడా ప్రతి కణాన్నీ సుసంపన్నం చేస్తుంది. చేవతో నిండి చేనులోని ప్రతి మొక్కకు నీటిప్రవాహం ఎలాగో జీవకణ జవం కోసం ఈ ఎరుపు గంగ అలాగ. అది ఎన్నో విధులను నెరవేరుస్తుంది. మన శరీరంలోని ఏ అవయవమైన కొద్ది సేపు విశ్రాంతి తీసుకుంటుందేమో గాని, రక్తనది మాత్రం జీవనదిలా అన్ని అవయవాలకూ ఆహారాన్ని, ఆక్సిజన్‌ను నిరంతరం అందిస్తుంది.
జీవనదీప్రవాహం ఆగితే పరివాహక ప్రాంతమంతా ఎడారి అయినట్టే రక్తం ఒక్క క్షణం విశ్రాంతి తీసుకుంటే... ప్రతి కణం నిర్జీవం అవుతుంది. అయితే నీళ్లకు భిన్నంగా ఎన్నో అంశాలు కలిసి రక్తంగా రూపొందుతాయి. రక్తంలో ఉన్న అంశాల్లో అత్యంత కీలకమైనవి ప్లేట్‌లెట్స్. ప్రతివారి జీవితంలోనూ చాలా సందర్భంలో అవి జీవితాన్ని చాలాసార్లు మనకు తెలియకుండానే రక్షిస్తాయి. మౌన ప్రాణదాతలైన ప్లేట్‌లెట్స్‌పై అవగాహన కోసం ఈ కథనం.
రక్తంలో ఎన్నెన్నో అంశాలుంటాయి. వాటిలో అత్యంత ప్రధానమైనవి ఎర్రరక్తకణాలు, తెల్లరక్తకణాలు, ప్లేట్‌లెట్స్. అవేగాక ప్లాస్మా, ప్రోటీన్లు వంటి అనేక అంశాలుండి... అవన్నీ నిర్దిష్టమైన విధులను నెరవేరుస్తూ... వ్యక్తి ఆరోగ్యాన్ని పదిలంగా కాపాడుతుంటాయి. ఎర్రరక్తకణాలు మన దేహంలోని ప్రతి కణానికి అవసరమైన ఆక్సిజన్ అందిస్తుంటాయి. తెల్లరక్తకణాలు మన శరీరంలోకి ప్రవేశించే ప్రతి జబ్బు/ఇన్ఫెక్షన్‌తో పోరాడి మనకు రోగనిరోధకశక్తి కలిగిస్తుంటాయి. ఇక ప్లేట్‌లెట్స్ మనల్ని ఇప్పటికే అనేకసార్లు ప్రాణాపాయం నుంచి రక్షించి ఉంటాయి. ఏదో ఒక సందర్భంలో కిచెన్‌లో కూరగాయలు కోస్తూ వేలు తెగిన మహిళలకూ, గడ్డం తెగినప్పుడు పురుషలకూ, ఆటల్లో కిందపడిపోయి రక్తస్రావం అయ్యేలా గాయపడ్డ పిల్లలూ, యాక్సిడెంట్‌లో గాయపడి రక్తం కారుతుండే వారికి... ఇలా అందరికీ ప్రాణదానం చేస్తుంటాయి.
ప్లేట్‌లెట్స్ ఎలా ఎక్కిస్తారు?
ప్లేట్‌లెట్స్ తక్కువగా ఉన్నవారికి బయటి నుంచి ప్లేట్‌లెట్స్ ఎక్కించడం (ట్రాన్స్‌ఫ్యూజన్) రెండు రకాలుగా జరుగుతుంది. అవి...
1. ఆర్.డి.పి. (ర్యాండమ్ డోనార్ ప్లేట్‌లెట్స్)
2. ఎస్.డి.పి. (సింగిల్ డోనార్ ప్లేట్‌లెట్స్)
ర్యాండమ్ డోనార్ ప్లేట్‌లెట్స్ : బ్లడ్‌బ్యాంకు కు వెళ్లి రక్తదానం చేసే అనేక మంది దాతలు ఇచ్చిన రక్తాన్ని సేకరిస్తుంటారు. ఇందులోంచి రక్తంలో ఉండే ప్రధానమైన మూడు రకాల అంశాలను వేరుచేస్తారు. అంటే ఎర్రరక్తకణాలు, ప్లాస్మా, ప్లేట్‌లెట్స్‌ను వేటికవి విడదీసి ప్యాక్ చేస్తారు. ఇలా చేయడం ద్వారా ఒక యూనిట్ రక్తం నుంచి ముగ్గురికి మేలు చేయవచ్చునన్నమాట. తద్వారా రక్తహీనత (అనీమియా) ఉన్న రోగులకు ఎర్రరక్తకణాలే ఎక్కిస్తారు. అలాగే కాలిన గాయాలైన రోగుల వంటి వారికి ప్లాస్మా మాత్రమే ఇస్తారు. ఇక ప్లేట్‌లెట్స్ తగ్గిన రోగులకు కేవలం ప్లేట్‌లెట్స్ మాత్రమే ఇచ్చే సౌకర్యం కూడా ఉంటుంది.
ఇలా సేకరించిన రక్తం ఏ దాతది అన్నది నిర్దిష్టంగా తెలియదు. కాబట్టి ఈ ప్రక్రియ ద్వారా సేకరించిన ప్లేట్‌లెట్లను ‘ర్యాండమ్ డోనార్ ప్లేట్‌లెట్స్’గా అభివర్ణిస్తారు. ఈ తరహా ప్లేట్‌లెట్లలో ఒక యూనిట్ ప్లేట్‌లెట్స్ ఎక్కించినప్పుడు పేషెంట్‌లో 5,000 వరకు మాత్రమే ప్లేట్‌లెట్ కౌంట్ పెరుగుతుంది. కానీ పేషెంట్‌లో సురక్షితమైన స్థాయికి ప్లేట్‌లెట్స్ సంఖ్యను పెంచాలంటే ఆ కౌంట్ కనీసం 25,000 నుంచి 30,000 ఉండాలి. ఇందుకోసం ర్యాండమ్ డోనార్ ప్లేట్‌లెట్స్ ప్రక్రియలో కనీసం 5 నుంచి 6 యూనిట్లు అవసరమవుతుంది.
అంటే ఒకరోగికి ఒకసారి అవసరమైన ప్లేట్‌లెట్లను సేకరించాలంటే కనీసం ఐదారుగురు దాతలు అవసరమన్నమాట. ఇక కొందరు రోగుల్లో వారి వ్యాధి తీవ్రతని బట్టి మొత్తం 4, 5 సార్లు ప్లేట్‌లెట్స్ ఎక్కించాల్సిన అవసరం కూడా ఉండవచ్చు. ఈ లెక్కన ఇలాంటి అవసరమున్న ఒక రోగికి కావాల్సిన స్థాయిలో ప్లేట్‌లెట్స్ అందజేయాలంటే కనీసం 30 మంది దాతలు కావాలన్నమాట. ఇంత మంది దాతలను సమీకరించడం కష్టమైన పని కదా.
సింగిల్ డోనార్ ప్లేట్‌లెట్స్: మరో సాంకేతిక పరిజ్ఞానాన్ని ఆశ్రయించడం ద్వారా పైన పేర్కొన్న అనేక మంది దాతలను సమీకరించడం అన్న కష్టసాధ్యమైన పరిస్థితిని అధిగమించవచ్చు. ఆధునిక సాంకేతికత సహాయంతో ఒక దాత నుంచి ఇంకేరకమైన రక్తంలోని అంశాలను ముట్టుకోకుండా కేవలం ప్లేట్‌లెట్స్‌ను మాత్రమే సేకరించవచ్చు. ఇలా సేకరించిన వాటిని ‘సింగిల్ డోనార్ ప్లేట్‌లెట్స్’ అంటారు. అంటే ఒక దాత నుంచి కేవలం ప్లేట్‌లెట్స్‌ను మాత్రమే స్వీకరిస్తే ఆ ఒక్కదాత నుంచే పేషెంట్‌కు అవసరమైన మొత్తం 30,000 ప్లేట్‌లెట్ కౌంట్ ఒకేసారి సమకూరుతుందన్నమాట. ఇక దాతకు కూడా ఎలాంటి నష్టం ఉండదు.
అంటే ఒక్క ‘సింగిల్ డోనార్ ప్లేట్‌లెట్స్’ అన్నవి దాదాపు 6 – 8 ‘ర్యాండమ్ డోనార్ ప్లేట్‌లెట్స్’తో సమానం. కాబట్టి ప్లేట్‌లెట్స్ అవసరమైన రోగులకు దాతలు ఎలాంటి అపోహలకు లోను కాకుండా నిర్భయంగా ప్లేట్‌లెట్స్ డొనేట్ చేయవచ్చు. అలా ప్లేట్‌లెట్స్‌ను దానం చేయడం వల్ల దాతలు ఎంతోమందికి మేలు చేసిన వారవుతారు. ఈ అంశంపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకుంటే ఎంతోమంది ప్రాణాలు రక్షించిన వారవుతారు. రక్తస్రావం వల్ల ప్రాణాలు జారిపోకుండా కాపాడినవారవుతారు.
రక్తదానం చేసే దాత నుంచి అతడి బరువుని పరిమాణాన్ని బట్టి ఒకసారికి 250 నుంచి 350 ఎం.ల్ రక్తాన్ని స్వీకరిస్తారు.
రక్తాన్ని ఎలా గడ్డ కట్టిస్తాయి?
ప్లేట్‌లెట్స్ రక్తంలో ఉండే అత్యంత చిన్న కణాల్లో ఒకటి. శరీరానికి ఏదైనా గాయమైన మరుక్షణం ఇవన్నీ ఒకదాని పక్కకు మరొకటి వచ్చేస్తాయి. గోడలోని ఇటుకల్లాగా తామే అమరిపోతాయి. రక్తం ఇలా గడ్డకట్టి, ప్రవాహానికి గోడకట్టే ప్రక్రియ చాలా అద్భుతమైనది. ఇందులో అనేక జీవచర్యలు చోటుచేసుకుంటాయి. ఈ జీవక్రియల్లో రక్తంలోని అనేక ప్రోటీన్లు పాలు పంచుకుంటాయి. ఈ ప్రోటీన్లను ‘క్లాటింగ్ ఫ్యాక్టర్స్’ అంటారు. ఇవన్నీ తమ జీవక్రియల్లో భాగంగా సమష్టిగా పనిచేసి ఈ ప్లేట్‌లెట్ల ఇటుకలను ఒకదానితో ఒకటిగా అతికించి, ఒక వలలా ఏర్పడి లోపలి రక్తప్రవాహాన్ని బయటకు రాకుండా చేస్తాయి. తద్వారా రక్తస్రావం జరగకుండా చేసి, ప్రాణాలను కాపాడతాయి. గాయమైన 2, 3 నిమిషాల్లోనే ఈ వలలాంటి రక్తపు గోడ నిర్మాణం జరిగిపోతుంది.
ప్లేట్‌లెట్స్ ఎలా పుడతాయి?
ప్లేట్‌లెట్స్ మన ఎముకల్లోని ములుగ నుంచి పుడతాయి. అత్యంత సూక్ష్మమైన కణాల్లో ఒకటైన ఇవి పుట్టిన తర్వాత నాలుగు రోజులు జీవిస్తాయి. అంటే వీటి జీవిత కాలం నాలుగు రోజులు. ఒకవేళ ఎముక మూలుగలో ఏదైనా సమస్య వస్తే ఈ ప్లేట్‌లెట్స్ ఉత్పత్తి తగ్గుతుంది. దాంతో రక్తంలో ప్లేట్‌లెట్ల సంఖ్య తగ్గుతుంది. ఇలా రక్తంలో వీటి సంఖ్య తగ్గినప్పుడు రక్తం గడ్డకట్టడం అనే రక్షణ ప్రక్రియకు విఘాతం కలుగుతుంది.
ప్లేట్‌లెట్లను ఎలా కొలుస్తారు?
ఆరోగ్యవంతులైన మనిషిలో కనీసం క్యూబిక్ మిల్లీమీటర్ పరిమాణంలో 1.5 లక్షల నుంచి 4.5 లక్షల ప్లేట్‌లెట్స్ ఉండాలి. ఇది నార్మల్ కొలత. వీటి సంఖ్యను ‘సెల్ కౌల్టర్ మెషిన్’ అనే యంత్రం ద్వారా కొలుస్తారు. ఇందుకోసం 2 నుంచి 3 ఎమ్‌ఎల్ రక్తాన్ని సేకరిస్తారు.
ప్లేట్‌లెట్స్ తగ్గితే కనిపించే లక్షణాలివి
⇔ చర్మం కింద ఎర్రటి మచ్చలు.
⇔ శరీరంపై దెబ్బ ఏమీ తగలకపోయినా చర్మం కింద రక్తస్రావమై మచ్చలు కనిపించవచ్చు. అది శరీరంపై ఎర్రటి మచ్చల రూపంలో బయటపడవచ్చు. ఆ లక్షణం తీవ్రతను బట్టి ఆ మచ్చలను మూడు రకాలుగా చెప్పవచ్చు. చర్మం ఎర్రగా మారి చిన్నచిన్న మచ్చల్లాంటివి కనిపించడాన్ని పెటికియల్ లీజన్స్ అంటారు. ఈ ఎర్రబారడం మధ్యరకంగా ఉంటే దాన్ని పెర్ప్యూరా అని, చర్మం కింద రక్తస్రావం మరీ ఎక్కువగా జరిగి ఎర్రగా కనిపిస్తే దాన్ని ఎకిమోటిక్ ప్యాచ్‌గా అభివర్ణిస్తారు.
⇔ ముక్కు నుంచి రక్తస్రావం కావచ్చు.
⇔ మహిళల్లో అయితే సాధారణంగా రుతుస్రావంతో పోయే రక్తంతో పాటు అధికంగా రక్తం పోవచ్చు.
⇔ మల విసర్జన సమయంలో రక్తస్రావం కనిపించవచ్చు.
⇔ చాలా అరుదుగా అంతర్గత అవయవాల్లో (ఇంటర్మల్ బ్లీడింగ్) కావచ్చు.
ప్లేట్‌లెట్స్ తగ్గినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు
రక్తంలో ప్లేట్‌లెట్స్ తక్కువగా ఉన్న పేషెంట్స్ కొన్ని జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. అవి...
⇔ వారు పదునైన వస్తువులను వాడే సమయంలో వాటి వల్ల గాయపడకుండా జాగ్రత్త పడాలి. (ఉదాహరణకు వంటింట్లో కత్తి, గడ్డం చేసుకునేటప్పుడు బ్లేడు వంటివి). ప్లేట్‌లెట్స్ తక్కువగా ఉన్నవారు గడ్డం గీసుకోవడం కోసం ఎలక్ట్రిక్ రేజర్ వాడటం సురక్షితం.
⇔ సాధ్యమైనంత వరకు ఇంజెక్షన్ తీసుకోకుండా ఉండటం
⇔ గాయపడటానికి అవకాశం ఉన్న కఠినమైన ఆటలు (క్రికెట్, ఫుట్‌బాల్ వంటివి) ఆడకుండా ఉండటం
⇔ రక్తాన్ని పలుచబార్చే మందులైన ఆస్పిరిన్ వంటివి వాడకుండా ఉండటం అవసరం.
⇔ ఇక ఏదైనా దంతవైద్యం చేయించుకోవాలనుకున్నవారు, శస్త్రచికిత్స చేయించుకోవాలనుకుంటున్నవారు ఈ సమయంలో వాటిని వాయిదా వేసుకోవాలి.
సంఖ్య తగ్గుతుందిలా... ప్లేట్‌లెట్స్ తగ్గడానికి కారణాలు...
⇔ ఎముక మూలుగ (బోన్ మ్యారో)లోనే ఉత్పత్తి తగ్గినప్పుడు
⇔ ప్లేట్‌లెట్స్ బయటకు వచ్చాక రక్తప్రసరణలో నాశనం కావడం
ఎముక మూలుగ నుంచే ఉత్పత్తి తగ్గడం
⇔ ఎముక మూలుగ (బోన్‌మ్యారో)లోని మెగాకారియోసైట్స్ అనే కణాల నుంచి ప్లేట్‌లెట్స్ ఉత్పన్నం అవుతాయి. కొందరిలో జన్యులోపాల వల్ల పుట్టుకతోనే రక్తకణాల ఉత్పత్తి తగ్గవచ్చు. ఈ కండిషన్‌ను అప్లాస్టిక్ అనిమియా అంటారు. ఇందులో మెగాకారియోసైట్స్ నుంచి ప్లేట్‌లెట్స్ ఉత్పత్తి సరిగా జరగని పరిస్థితిని ఎమెగా కారియోసైటిక్ థ్రాంబోసైటోపినియా అంటారు. కొందరిలో పుట్టుకతోనే కాకుండా ఆ తర్వాత ఇలాంటి కండిషన్ రావచ్చు. దాన్ని అక్వైర్డ్ ్ర«థాంబోసైటోపినియా అంటారు.
⇔ కొందరిలో టీబీ వంటి ఇన్ఫెక్షన్స్ వల్ల ప్లేట్‌లెట్స్ ఉత్పత్తి తగ్గవచ్చు. ∙ఎముక మూలుగలోని కణాలు తగ్గిపోయి ఆ ప్రాంతంలో ఫైబర్ నిండిపోవడం (ఫైబ్రోసిస్) వల్ల కూడా వీటి ఉత్పత్తి తగ్గిపోవచ్చు.
రక్తప్రసరణ ప్రక్రియలో నాశనం కావడం:
ఈ ప్రక్రియలో రెండు రకాలుగా అవి నాశనం కావడం రెండు విధాల జరగవచ్చు.
⇔ ఏ కారణాలు తెలియకుండా జరిగేవి (దీన్నే ఇడియోపథిక్ లేదా ఇమ్యునో థ్రాంబోసైటోపినియా (ఐటీపీ)గా చెప్పవచ్చు.
⇔ ఏవైనా నిర్దిష్టమైన కారణాల వల్ల ప్లేట్‌లెట్స్ నాశనం కావడం జరగవచ్చు. ఈ కారణాలు చాలా రకాలుగా ఉంటాయి. అందులో కొన్ని...
⇔ కొన్ని రకాల నొప్పి నివారణ మందులు (అనాల్జిసిక్స్) తీసుకోవడం వల్ల అవి బోన్ మ్యారోను దెబ్బతీయడంతో ఈ పరిణామం రావచ్చు.
⇔ కొన్ని క్యాన్సర్ మందులు కూడా బోన్ మ్యారోను దెబ్బతీస్తాయి. లేదా అవి రక్తంలోని ప్లేట్‌లెట్స్‌ను దెబ్బతీయవచ్చు.
⇔ రక్తాన్ని పలచబార్చే ‘హిపారిన్’ను తీసుకున్న సందర్భాల్లోనూ ప్లేట్‌లెట్స్ తగ్గవచ్చు.
⇔ ఆల్కహాల్ ఎక్కువగా తీసుకోవడం వల్ల
⇔ విటమిన్ బీ12, ఫోలిక్ యాసిడ్ (విటమిన్ బి6) లోపాల వల్ల కూడా ప్లేట్‌లెట్స్ తగ్గవచ్చు. విటమిన్‌లోపాల వల్ల రక్తంలోని కణాలు తగ్గడాన్ని మెగాలోబ్లాస్టిక్ అనీమియా అంటారు.
ఇన్ఫెక్షన్స్ : చాలా రకాల ఇన్ఫెక్షన్స్ వల్ల రక్తంలో ప్లేట్‌లెట్స్ తగ్గుతాయి. ఉదాహరణకు వైరల్, బ్యాక్టీరియల్, ఏకకణజీవుల వల్ల కలిగే మలేరియా లాంటి ప్రోటోజోవన్ ఇన్ఫెక్షన్లు వచ్చినప్పుడు ప్లేట్‌లెట్స్ సంఖ్య తగ్గుతుంది. వైరల్ ఇన్ఫెక్షన్లలో కేవలం డెంగ్యూ వల్లనే గాక హెచ్‌ఐవీ, హెపటైటిస్, రుబెల్లా వైరస్, చికున్‌గున్యా వంటి అనేక వైరల్ ఇన్ఫెక్షన్లలో వీటి సంఖ్య తగ్గవచ్చు.
⇔ కాస్తంత అరుదుగా థ్రాంబోటిక్ థ్రాంబోసైటోపినిక్ పెర్‌ప్యూరా కండిషన్‌లోనూ ప్లేట్‌లెట్స్ తగ్గుతాయి.
⇔ కొన్ని రకాల కీళ్ల జబ్బులులో, సిస్టమిక్ ల్యూపస్ అరిథిమెటోస్ వంటి జబ్బుల్లో ప్లేట్‌లెట్స్ తగ్గుతాయి.
⇔ లింఫోమా అనే ఒక రకం బ్లడ్‌క్యాన్సర్‌లోనూ ప్లేట్‌లెట్స్ తగ్గుతాయి. ∙సిక్వెస్ట్రేషన్: స్లీ్పన్‌లో ప్రవేశించి ప్లేట్‌లెట్స్ నాశనం కావడం.
టెస్ట్స్ అండ్ ట్రీట్‌మెంట్స్ వైద్య పరీక్షలతో గుర్తించడమిలా
⇔ కంప్లీట్ బ్లడ్ పిక్చర్ (సీబీపీ) : పరీక్ష ద్వారా ప్లేట్‌లెట్స్ తగ్గాయా లేదా అన్నది నిర్ధారణ చేస్తారు. అయితే ఈ సీబీపీ పరీక్షలో కేవలం ప్లేట్‌లెట్స్ మాత్రమే గాక... రక్తంలోని ఇతర కణాలు తగ్గడం కనిపించవచ్చు. కేవలం ప్లేట్‌లెట్స్ మాత్రమే తగ్గాయా లేక ప్లేట్‌లెట్స్‌తో పాటు ఇతర కణాలూ తగ్గాయా అన్నది వ్యాధికి కారణాన్ని, చికిత్స ప్రక్రియలను నిర్ణయించడానికి ఉపయోగపడుతుంది. ఈ పరీక్ష తర్వాత చికిత్సను నిర్ణయించడానికి ప్లేట్‌లెట్స్ తగ్గడంతో పాటు జ్వరం ఉంటే ఆ కండిషన్‌ను వైరల్ ఫీవర్ వల్ల జరిగిందేమో అని అనుమానిస్తారు. ఇలా తగ్గే కండిషన్లలో డెంగ్యూ ఒకటి. వైరల్ జ్వరాలతో వచ్చే రోగుల్లో సాధారణంగా కీళ్లనొప్పులు, ఒళ్లునొప్పులు, తలనొప్పి వంటివి కూడా ఉంటాయి. ఆ లక్షణాలను బట్టి ప్లేట్‌లెట్స్ తగ్గడం వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల జరిగిందని అనుమానించాల్సి ఉంటుంది. ప్లేట్‌లెట్స్ తగ్గడంతో పాటు తెల్ల రక్తకణాలు తగ్గడం, ఎర్ర రక్తకణాలు తగ్గడం వంటి మూడు అంశాలను పరిశీలించి వ్యాధి నిర్ధారణ చేస్తారు.
⇔ పెరిఫెరల్ స్మియర్ : సీబీపీతో పాటు పెరిఫెరల్ స్మియర్ పరీక్ష చేస్తారు. దీంట్లో రక్తకణాల స్వరూపాన్ని పరిశీలించి కణాల స్వరూపం సక్రమంగా ఉండటాన్ని గమనించి ల్యూకేమియా వంటి బ్లడ్ క్యాన్సర్లను రూల్‌అవుట్ చేసుకుంటారు.
⇔ ఈ ప్లేట్‌లెట్స్ తగ్గడం అన్నది ఎముక మూలుగ (బోన్ మ్యారో)లోని లోపాల వల్ల అనుకున్నప్పుడు బోన్‌మ్యారో యాస్పిరేషన్/బయాప్సీ చేయాల్సి ఉంటుంది.
⇔ ప్లేట్‌లెట్స్ తగ్గడం అన్నది బోన్‌మ్యారోలోని లోపాల వల్ల కాదని తెలిస్తే అప్పుడు అది ప్లేట్‌లెట్స్ ఉత్పన్నమయ్యాక బయట నాశనం కావడం (పెరిఫెరల్ డిస్ట్రక్షన్) వల్ల అని తెలుస్తుంది.
⇔ సిస్టమిక్ ల్యూపస్ ఎరిథమెటోసస్ కండిషన్‌ను అనుమానించినప్పుడు దానికి తగిన పరీక్షలు చేసి దాన్ని రూల్‌అవుట్ చేయాల్సి ఉంటుంది.
ఇలా పరీక్షల ద్వారా వచ్చిన ఫలితాలను బట్టి, రోగిని పరిశీలించాక కనిపించిన లక్షణాలను బట్టి చికిత్సను నిర్ణయిస్తారు.
ప్లేట్‌లెట్స్ తగ్గినప్పుడు చికిత్స...
రక్తంలో ప్లేట్‌లెట్స్ సాధారణంగా 1.5 లక్షల నుంచి 4 లక్షల వరకు ఉంటాయని తెలిసింది. ఈ సంఖ్య 30,000 కంటే తగ్గితే ఆగకుండా రక్తస్రావం కావచ్చు. ప్లేట్‌లెట్స్ సంఖ్య 20,000 కంటే తగ్గి, రక్తస్రావ లక్షణాలు కనిపించినప్పుడు మాత్రమే అత్యవసరంగా చికిత్స అందించాల్సిన అవసరం ఉంటుంది. అలాంటి సందర్భాల్లో మాత్రమే శరీరం బరువు ఆధారంగా ప్లేట్‌లెట్స్ ఎక్కించాల్సి ఉంటుంది.
జాగ్రత్తలు : కొన్ని మందులు ప్లేట్‌లెట్‌ల సంఖ్యను తగ్గిస్తాయి. నొప్పినివారణ మందులు, యాస్పిరిన్, క్లోపిడోగ్రెల్ వంటి మందులు, యాంటీకోయాగ్యులెంట్స్‌ను వాడటం సరికాదు. డెంగ్యూ వంటి వైరల్ ఫీవర్స్ ఉన్న సమయంలో విచక్షణరహితంగా యాంటీబయాటిక్స్ వాడటం సరికాదు. రోగికి జ్వరాన్ని తగ్గించే మందులు మాత్రమే వాడుతూ విచక్షణతో మందులు వాడాలి.
ఆందోళన అక్కర్లేదు...
ప్లేట్‌లెట్స్ తగ్గడానికి ఎన్నో కారణాలుంటాయి. ప్లేట్‌లెట్స్ సంఖ్య 20,000 నుంచి 30,000 వరకు ఉన్నా కూడా బ్లీడింగ్ లేకుండా ఉంటే సాధారణంగా వాటిని ఎక్కించడం అప్పటికప్పుడు అవసరం ఉండకపోవచ్చు. అంతకంటే పడిపోతేనే ప్లేట్‌లెట్స్ ఎక్కిస్తారు. అయితే సాధారణంగా వైరల్ ఇన్ఫెక్షన్‌తో జ్వరాలు వచ్చినప్పుడు ప్లేట్‌లెట్‌ల సంఖ్య తగ్గితే కంగారు పడాల్సిన అవసరమే లేదు. ఆ సంఖ్య దానంతట అదే పెరుగుతుంది. కాకపోతే రోగిని జాగ్రత్తగా పరిశీలిస్తూ ఉండటం, అవసరమైనప్పుడు మాత్రమే ప్లేట్‌లెట్స్ ఎక్కించడం అవసరం.