స్టార్టప్స్..సంకల్పమే సక్సెస్ మంత్రం
స్టార్టప్స్.. స్టూడెంట్ స్టార్టప్స్.. ఆన్‌లైన్ స్టార్టప్స్.. యంగ్ ఎంటర్‌ప్రెన్యూర్స్..! ఫ్లిప్‌కార్ట్.. అమెజాన్.. స్నాప్‌డీల్... ఫేస్‌బుక్.. గూగుల్.. ట్విట్టర్!! ఇప్పుడు చర్చంతా స్టార్టప్స్.. ఈ-కామర్‌స కంపెనీలపైనే నడుస్తోంది. ఫ్లిప్‌కార్ట్, స్నాప్‌డీల్, అమెజాన్, ఫేస్‌బుక్ తదితర కంపెనీలన్నీ నలబై ఏళ్ల లోపున్న యువకుల ఆలోచనల్లోంచి అంకురించి సక్సెస్ సాధిస్తున్న సంస్థలు. కాలేజీ క్యాంపస్‌లో ఉన్నప్పుడే విద్యార్థి మదిలో మెదిలిన ఆలోచనకు నిదర్శనం.. ఫేస్‌బుక్. 20ల్లోనే చేయగలిగినప్పుడు 40ల దాకా ఆగడమెందుకంటూ.. చదువు పూర్తయ్యాక కొద్దికాలం అనుభవం గడించి సృజనాత్మక ఆలోచనలతో బన్సాల్, బెజోస్ లాంటివారు ప్రపంచం గర్వించదగ్గ కంపెనీలు నెలకొల్పారు. ఇలా కేవలం కొన్ని వేల రూపాయల పెట్టుబడితో ప్రారంభమై.. కొద్ది కాలంలోనే రూ. కోట్ల టర్నోవర్‌కు చేరిన స్టార్టప్స్ కంపెనీలు ఎన్నో! ఎవరు ఉద్యోగం ఇస్తారు.. ఎక్కడ ఉద్యోగం దొరుకుతుంది? అని ఎదురుచూసేకంటే.. సొంత ఆలోచనతో సాహసం చేయరా డింభకా.. అంటూ ముందుకెళ్లాలని భావించే యువత సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో సృజనాత్మకత, టెక్నాలజీ, సామాజిక అవసరాలే పెట్టుబడిగా విస్తృత విజయాలు సొంతం చేసుకున్న స్టార్టప్స్‌పై ప్రత్యేక కథనం..
పుస్తకాలతో మొదలైన.. ఫ్లిప్‌కార్ట్
ఫ్లిప్‌కార్ట్ డాట్ కామ్.. జాతీయస్థాయిలో ఇప్పుడు ఈ కంపెనీ పేరు వినని వారుండరు. ఈ-కామర్స్ రంగంలో సంచలనాలు సృష్టిస్తున్న సంస్థ ఇది. తాజాగా బిగ్ బిలియన్ డే సెలబ్రేషన్స్‌లో ఒక్క రోజులోనే రూ.600 కోట్ల వ్యాపారం జరిగిందని పేర్కొన్న ఫ్లిప్‌కార్ట్.. ప్రారంభ పెట్టుబడి కేవలం నాలుగు లక్షల రూపాయలు. ఐఐటీ-ఢిల్లీలో ఇంజనీరింగ్ పూర్తిచేసి.. కొంతకాలం అమెజాన్ డాట్ కామ్‌లో పనిచేసిన సచిన్ బన్సాల్, బిన్నీ బన్సాల్‌లు ఏర్పాటు చేసిన కంపెనీ ఫ్లిప్‌కార్ట్. తొలుత ఆన్‌లైన్‌లో బిజినెస్ టు కస్టమర్ విధానంలో కేవలం పుస్తకాల విక్రయాలకే పరిమితమైన సంస్థ తర్వాత క్రమేణా తన కార్యకలాపాలను విస్తరించుకుంది. ఇదే క్రమంలో ఫ్లిప్‌కార్ట్ వినియోగదారుల సంఖ్య పెరగడమూ నమోదైంది. ఫలితంగా సంస్థకు వెంచర్ క్యాపిటల్ కూడా పెరిగింది. 2009లో తొలిసారి యాక్సెల్ ఇండియా నుంచి ఒక మిలియన్ అమెరికన్ డాలర్లను పెట్టుబడిగా పొందిన ఫ్లిప్‌కార్ట్‌కు తర్వాత మరెన్నో వెంచర్ క్యాపిటల్ సంస్థలు నిధులు అందించాయి. తాజాగా ఈ ఏడాది జూలైలోనూ మరో బిలియన్ అమెరికన్ డాలర్ల పెట్టుబడిని సొంతం చేసుకుంది. వ్యాపార నిర్వహణలో రాణించి ఇటు వినియోగదారుల ఆదరణ.. అటు వెంచర్ క్యాపిటలిస్ట్‌ల నుంచి నిధులు సమకూర్చుకోవడంలో సత్ఫలితాలు సాధించింది. అంతేకాకుండా.. మరెన్నో సంస్థలను టేకోవర్ చేసే స్థాయికి ఎదిగింది. అటు ఉపాధి పరంగానూ బ్యాచిలర్స్ డిగ్రీ నుంచి ఎంబీఏ, ఇంజనీరింగ్, ఇతర ప్రొఫెషనల్ కోర్సుల విద్యార్థులకు వేదికగా నిలిచింది. ప్రస్తుతం ఈ సంస్థలో పది వేల మంది ఉద్యోగులు విధులు నిర్వర్తిస్తున్నారు.
అమెజాన్ డాట్ కామ్ అన్ని వస్తువులు
అంతర్జాతీయ స్థాయిలో అద్భుత విప్లవాలు సృష్టించిన సంస్థ అమెజాన్ డాట్ కామ్. ప్రిన్స్‌టన్ యూనివర్సిటీ నుంచి కంప్యూటర్ సైన్స్ అండ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి కొంతకాలం పలు కంపెనీల్లో పనిచేసిన జెఫ్ బెజోస్ దీని వ్యవస్థాపకుడు.1994లో ఏర్పాటైన అమెజాన్ డాట్ కామ్ తొలి పెట్టుబడి కేవలం పది వేల అమెరికన్ డాలర్లు. ఇంటర్నెట్ గురించి సరిగా అవగాహన కూడా లేని జెఫ్ బెజోస్.. ఈ-కామర్స్ రంగం 2300 శాతం పెరగనుందనే ఒక నివేదికలోని అంశాన్ని ఆధారం చేసుకుని.. తన సృజనాత్మకతను జోడించి.. ఒక చిన్నపాటి గ్యారేజ్‌లో స్థాపించిన అమెజాన్ డాట్ కామ్ ఇప్పుడు విశ్వవ్యాప్తంగా ఎంతో సుపరిచితం. ఆన్‌లైన్‌లో పుస్తకాల విక్రయాలకే పరిమితమైన అమెజాన్ ఇప్పుడు అన్ని వినిమయ వస్తువులను ఒక్క క్లిక్‌తో అందిస్తోంది. దీని పనితీరును గమనించిన ఏంజెల్ ఇన్వెస్టర్స్.. సంస్థ ఏర్పాటైన ఏడాదికే నిధుల వెల్లువ కురిపించారు. 1995లో ఏకంగా ఇరవైమంది ఏంజెల్ ఇన్వెస్టర్స్ మొత్తం 9,37,000 అమెరికన్ డాలర్ల నిధులు అందించడమే అమెజాన్ పనితీరుకు నిదర్శనం. ఈ క్రమంలో 2013-14లో 74.45 బిలియన్ డాలర్ల ఆదాయం ఆర్జించింది.
స్నాప్‌డీల్.. వెంచర్ క్యాపిటలిస్ట్‌తోనే ఎదిగిన సంస్థ
స్నాప్‌డీల్ డాట్ కామ్. చక్కటి ఆలోచన ఉంటే ఆచరణకు ఆర్థిక అవాంతరాలు ఉండవని చెప్పడానికి నిదర్శనం స్నాప్‌డీల్ డాట్ కామ్. స్నాప్‌డీల్ వ్యవస్థాపకులు కునాల్ బాల్, రోహిత్ బన్సాల్ ఇద్దరూ పాఠశాల స్నేహితులు. వార్టన్ స్కూల్ ఆఫ్ యూనివర్సిటీలో మేనేజ్‌మెంట్ అండ్ టెక్నాలజీ ఇంజనీరింగ్‌లో డ్యూయల్ డిగ్రీ పూర్తి చేసిన కునాల్ బాల్, ఐఐటీ ఢిల్లీలో చదివిన రోహిత్ బన్సాల్ ఇద్దరూ సొంత వ్యాపారం నిర్వహించాలనే ఆలోచనలకు రూపమే.. స్నాప్‌డీల్. తొలుత ఇద్దరూ 2007లో ఆఫ్‌లైన్ విధానంలో పలు కూపన్ బిజినెస్‌లు ప్రారంభించి.. కొద్ది రోజుల్లోనే ఆదరణ పొందారు. దీంతో వ్యాపారాన్ని విస్తరించాలని యోచించారు. కానీ నిధుల సమస్య. ఇదే సమయంలో ఇండో-యూఎస్ వెంచర్ పార్ట్‌నర్స్ సంస్థతో తమ వ్యాపారం గురించి వివరించి మెప్పు పొందడంతోపాటు నిధులను కూడా సాధించారు. తాజాగా టాటా గ్రూప్ సంస్థల మాజీ చైర్మన్ రతన్ టాటా కూడా ఈ సంస్థకు నిధులు అందించారంటే సంస్థ పనితీరు అవగతమవుతోంది. ఇలా.. కేవలం ఒక సృజనాత్మక ఆలోచనతో ఎలాంటి సొంత పెట్టుబడి లేకుండా ఒక వెంచర్ క్యాపిటల్ సహకారంతో మొదలై ఇప్పుడు 14 మంది పెట్టుబడిదారులతో 435 మిలియన్ డాలర్ల మూలధనంతో ముందుకెళుతోంది స్నాప్‌డీల్.
ఫేస్‌బుక్.. హాస్టల్ గది నుంచి అంతర్జాతీయ స్థాయికి
ఫేస్‌బుక్.. ఈ మాట వినని.. ఈ వెబ్‌సైట్ వీక్షించని వారు ఉండరు అంటే ఏ మాత్రం సందేహం లేదు. అంతలా.. అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది ఫేస్‌బుక్. కానీ ఫేస్‌బుక్ ప్రస్థానం హార్వర్డ్ యూనివర్సిటీలోని ఒక హాస్టల్ గదిలో కేవలం ఒక కంప్యూటర్‌తో మొదలైందంటే అతిశయోక్తికాదు. సంస్థ చైర్మన్ మార్క్ జుకెర్‌బర్గ్ 2004లో హార్వర్డ్ యూనివర్సిటీలో చదువుతున్న సమయంలో మరో నలుగురు స్నేహితులతో కలిసి ఈ ఫేస్‌బుక్‌ను రూపొందించారు. తొలుత కేవలం హార్వర్డ్ యూనివర్సిటీ విద్యార్థులకే పరిమితం చేసిన ఫేస్‌బుక్ సోషల్ నెట్‌వర్కింగ్ సదుపాయాన్ని తర్వాత ప్రపంచ వ్యాప్తంగా అందుబాటులోకి తెచ్చారు. ఎలాంటి పెట్టుబడి లేకుండా.. స్నేహితులతో కబుర్ల కోసం రూపొందిన ఫేస్‌బుక్.. 2004లో తొలిసారి అయిదు లక్షల డాలర్ల వెంచర్ క్యాపిటల్‌ను సమకూర్చుకుంది. ఆ తర్వాత మరెన్నో సంస్థలు మూలధనం సమకూర్చడంతో ఇప్పుడు దాదాపు 16 వేల బిలియన్ డాలర్ల పెట్టుబడులను సొంతం చేసుకుంది.
ట్విట్టర్.. విమర్శల నుంచి విశ్వవ్యాప్త ఖ్యాతి
నేడు విశేష ఆదరణ పొందు తున్న మరో సోషల్ నెట్‌వర్కింగ్ వెబ్‌సైట్.. ట్విట్టర్ డాట్‌కామ్. న్యూయార్క్ యూనివర్సిటీ అండర్ గ్రాడ్యుయేట్ జాక్ డార్సీకి వచ్చిన చిన్న ఆలోచనకు ప్రతిరూపమే ట్విట్టర్. ఇంటర్నెట్ వినియోగదారులు తమ అభిప్రాయాలను మెసేజ్‌ల రూపంలో పొందుపర్చే అవకాశం కల్పించడం అనే ఆలోచనతో 2006లో ఎవాన్ విలియమ్స్, జాక్ డార్సీ, బిజ్ స్టోన్‌లు ప్రారంభించిన ట్విట్టర్‌కు తొలుత ఎన్నో విమర్శలు ఎదురయ్యాయి. కేవలం సరదా కోసమే ఈ వెబ్‌సైట్ అని.. చిట్ చాట్‌కు మాత్రమే ఉపయోగపడుతుందని ఎందరో విమర్శిం చారు. కానీ కొద్ది రోజుల్లోనే అది నిజం కాదని నిరూపించారు. బ్రేకింగ్ న్యూస్ కూడా అందిస్తూ ఆదరణ పొందింది. 2013లో యూఎస్ సెక్యూరిటీస్ ఎక్స్ఛేంజ్ కమిషన్‌లో లిస్టెడ్ కంపెనీ జాబితాలో చేరింది. 2013 డిసెంబర్ నాటికి దాదాపు 33 బిలియన్ డాలర్ల మార్కెట్ మూలధనం సొంతం చేసుకుంది.
వాట్స్‌యాప్.. ఏర్పాటే వినూత్నం
అమెరికాకు చెందిన జాన్ కౌమ్, బ్రియాన్ యాక్టన్‌లు యాహూలో కొన్నేళ్లపాటు పనిచేసి ఫేస్‌బుక్‌లో ఉద్యోగాల కోసం దరఖాస్తు చేశారు. ఇద్దరూ ఉద్యోగాలకు ఎంపిక కాలేకపోయారు. అప్పుడే (2009)లో జాన్ ఒక ఐఫోన్ కొన్నాడు. అందులో అప్లికేషన్స్ అన్నీ ఏడు నెలల కిందటివి. దీంతో వినియోగదారుల ఆదరణ పొందే అప్లికేషన్స్‌కు మంచి మార్కెట్ ఉంటుందని గ్రహించాడు జాన్. ఆ ఆలోచనతో మొగ్గతొడిగిందే వాట్స్‌యాప్. స్మార్ట్ ఫోన్స్‌లో వాట్స్‌యాప్ ద్వారా ఒకరి నుంచి ఒకరికి సందేశాలు, ఆడియో, ఫొటోలు, వీడియోలు ఉచితంగా పంపొచ్చు. వాట్స్‌యాప్ అనేది ఒక ఇంటర్నెట్ ఆధారిత అప్లికేషన్. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 600 మిలియన్ల మంది వాట్స్‌యాప్‌ను వినియోగిస్తున్నారు. అతితక్కువ కాలంలో అపార ఆదరణ పొందిన వాట్స్‌యాప్‌ను.. ఈ ఏడాది ఫిబ్రవరిలో 19 బిలియన్ యూఎస్ డాలర్ల (రూ.లక్ష కోట్లకుపైగా)ను వెచ్చించి ప్రముఖ నెట్‌వర్కింగ్ వెబ్‌సైట్ ఫేస్‌బుక్ కొనుగోలు చేసింది.
ఐడియా, ప్రాజెక్ట్ రిపోర్ట్ ఉంటే ఎన్నో అవకాశాలు
ఔత్సాహిక ఎంటర్‌ప్రెన్యూర్స్ స్టార్టప్స్ ఏర్పాటుకు ఇప్పుడు ఎన్నో అవకాశాలు అందుబాటులోకి వచ్చాయి. ఐడియా నచ్చితే నిధులు ఇచ్చేందుకు సీడ్ ఫండింగ్ ఏజెన్సీలు ఎన్నో సిద్ధంగా ఉన్నాయి. ఔత్సాహికులు వీటిపై అవగాహన పెంచుకోవాలి. అదేవిధంగా ది ఇండస్ ఎంటర్‌ప్రైజెస్ (టై), నాస్కామ్ వంటి సంస్థలు స్టార్టప్ ఔత్సాహికుల కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాయి. ఫండింగ్ ఏజెన్సీలను, ఔత్సాహికులను ఒకే వేదికపై కలిసే అవకాశం కల్పిస్తున్నాయి. ఔత్సాహికులు చేయాల్సిందల్లా వినూత్నమైన ఆలోచనతో కూడిన రంగాన్ని ఎంచుకుని చక్కటి ప్రాజెక్ట్ రిపోర్ట్‌ను తయారు చేసుకోవడమే. ఆయా సెమినార్లలో నిర్ణీత వ్యవధిలో తాము తలపెట్టిన వ్యాపార ఆలోచన వ్యాపారపరంగా, సామాజిక అభివృద్ధి పరంగా ఏ మేరకు దోహద పడుతుందనే అంశంపై చక్కగా విశ్లేషించే నైపుణ్యం పెంపొందించుకోవాలి.
- మురళి బుక్కపట్నం, టీఐఈ హైదరాబాద్ చాప్టర్