ముఖానికి ఆవిరి ఎంత సేపు?
బ్యూటిప్స్
బ్యూటీపార్లర్‌లలో ఫేసియల్ చేసేటప్పుడు ముఖానికి ఆవిరిపట్టడం (స్టీమ్) చూస్తుంటాం. అయితే ఆవిరి ఎంత సమయం పట్టాలి? ఎలా పట్టాలి? అసలు ఆవిరిపట్టడం వల్ల ఉపయోగాలేమిటో ముందు తెలుసుకుంటే మనకు ఉన్న సందేహాలన్నీ తొలగిపోతాయి. మరీ ముఖచర్మానికి దగ్గరగా ఆవిరి వేడి తగలకూడదు. షవర్ బాత్ చేసేటప్పుడు నీరు ఎంత దూరం నుంచి పడుతున్నాయో అంత దూరం నుంచి ఆవిరి చర్మానికి తగలాలి. లేదంటే చర్మం తన సహజత్వాన్ని కోల్పోవడానికి ఆవిరి ప్రధాన కారణం అవుతుంది.ఐదు నిమిషాలకు మించి ఆవిరి పట్టకూడదు. అన్ని చర్మతత్వాలూ ఒకేలా ఉండవు. అందుకని అందరికీ ఒకేవిధంగా ఆవిరిపట్టడం సరైన విధానం కాదు. దీని వల్ల చర్మంలోని పోర్స్ తెరుచుకుని, సహజసిద్ధంగా నూనె స్రవించే గ్రంథులు పొడిబారుతాయి. దీనివల్ల చర్మం త్వరగా ముడతలు రావడానికి ఆస్కారం అవుతుంది.
ఆవిరి పట్టిన తర్వాత క్లెన్సర్‌తో ముఖాన్ని ఒకసారి శుభ్రం చేసుకోవాలి. దీనివల్ల పోర్స్‌లో ఉన్న మలినాలు తొలగిపోతాయి. తర్వాత... పొడిగా ఉన్న మెత్తని టవల్‌తో ముఖాన్ని తుడుచుకోవాలి. ఆవిరిపట్టిన తర్వాత కొంతమంది చర్మం మరీ పొడిబారినట్టుగా అనిపిస్తుంది. అందుకని ముఖాన్ని శుభ్రం చేసుకున్న తర్వాత మాయిశ్చరైజర్ వాడాలి. ఆవిరిపట్టడం అనేది సున్నితమైన ప్రక్రియ. ముందుగా చర్మతత్వాన్ని తెలుసుకుని, దానికి తగిన విధంగా ట్రీట్‌మెంట్ ఇచ్చే నిపుణుల చేతనే ఫేసియల్ చేయించుకోవడం, స్టీమ్ పట్టడం మేలు.