ఔషధ గుణాలున్న సిరిధాన్యాల (అరిక, కొర్ర, అండుకొర్ర, సామ, ఊదల)కు గిరాకీ పెరుగుతుండటంతో వీటి సాగుపై మెట్ట రైతులు ఆసక్తి చూపుతున్నారు. రుతుపవనాల రాక కబురుతో ఈ ఐదు వర్షాధార ఆహార పంటల సాగుకు రైతులు సన్నద్ధమవుతున్నారు. ఈ సందర్భంగా కడప జిల్లా వేంపల్లెకు చెందిన రైతు శాస్త్రవేత్త విజయకుమార్(98496 48498) అందించిన మెలకువలు ‘సాగుబడి’ పాఠకులకు ప్రత్యేకం. అరికలు 6 నెలల పంట. ఆరుద్ర కార్తె దాటక ముందే విత్తుకోవాలి. 6 సాళ్లకు ఒక సాలు కంది, ఆముదం తదితర అంతరపంటలు కూడా విత్తుకోవచ్చని గత నెల 8న ‘సాగుబడి’లో చదువుకున్నాం. ఇక కొర్ర, అండుకొర్ర, సామ, ఊద పంటల సాగు సంగతులు ఇప్పుడు చూద్దాం. వర్షాధారంగా పండే ఈ పంటలను జూన్ ఆఖరులోగా విత్తుకోవాలి. 100–110 రోజుల్లో పూర్తయ్యే పంటలివి. కొంత మంది రైతులు కంగారు పడి 70–80 రోజులకు కోసేస్తున్నారు. యంత్రంతో పొట్టు తీసేటప్పుడు ఎక్కువగా నూక అవుతాయి. గింజ గట్టిపడే వరకు అంటే 100–110 రోజులు ఉంచితే ఈ సమస్య ఉండదు.
ఈ ధాన్యాలను విత్తనపు గొర్రుతో విత్తుకోవడం మంచిది. గొర్రుతో సాళ్లుగా విత్తుకుంటే.. ఒకే లోతున విత్తనం పడుతుంది. ఒకేసారి గింజలన్నీ మొలుస్తాయి. ఒకేసారి వెన్ను వస్తుంది. అలాకాకుండా విత్తనాలు వెద జల్లితే విత్తనాలు ఒకే లోతులో పడవు కాబట్టి కొన్ని గింజలు పది రోజుల తర్వాత కూడా మొలుస్తూనే ఉంటాయి. గొర్రు అందుబాటులో లేని వారు వెదజల్లిన తర్వాత విత్తనాలపైకి మట్టి పడేలా ఫోర్స్‌గా దున్నాలి. ఎకరానికి అండుకొర్ర 2.5 కిలోలు, కొర్ర 3 కిలోలు, ఊదలు 3 కిలోలు, సామలు 6 కిలోల విత్తనాలు అవసరం. ఇవి చిన్న గింజలు కాబట్టి, ఒకేచోట కుప్పగా పడకుండా ఉండాలంటే.. కిలో విత్తనాలకు 9–10 కిలోల ఇసుక కలిపి విత్తుకోవాలి. చీడపీడల బెడద పెద్దగా లేదు.
ముఖ్య విషయం ఏమిటంటే.. కొర్ర, అండుకొర్ర, సామ, ఊదలను ఖరీఫ్(వర్షాకాలపు)లో సాగు చేసే రైతులు.. అరికల్లో మాదిరిగా కంది తదితర దీర్ఘకాలిక అంతర పంటలు వేసుకోకుండా ఉంటేనే మంచిది. ఈ పంటలు కోసిన తర్వాత ఒకటి, రెండు తడులకు అవకాశం ఉంటే.. శనగ, పెసర, మినుము, ధనియాలు, వాము వంటి పంటలను రెండో పంటగా నెల రోజుల విరామం తర్వాత విత్తుకోవాలి. రెండో పంట వేసుకునే అవకాశం/ఆలోచన లేని రైతులైతే ఖరీఫ్‌లో ఈ పంటల్లో కూడా సిరిధాన్యాలు ఆరు సాళ్లు– ఒక సాలు కంది విత్తుకోవాలి. మరో ఆరుసాళ్ల సిరిధాన్యాల తర్వాత ఒక సాలులో ఆముదాలు, అనుములు, బొబ్బర్లు, గోగులు కలిపి విత్తుకోవచ్చు.
సిరిధాన్యాల వర్షాధార సాగుకు సమయమిదే!
Published Tue, Jun 5 2018 1:09 AM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment