దయ్యం టైప్‌ రైటర్‌ | Type Writer Web Series Special Story | Sakshi
Sakshi News home page

దయ్యం టైప్‌ రైటర్‌

Published Sat, Jul 27 2019 12:06 PM | Last Updated on Sat, Jul 27 2019 12:10 PM

Type Writer Web Series Special Story - Sakshi

‘టైప్‌రైటర్‌’లో బార్డేజ్‌ విల్లా వారసురాలు జెన్నిగా పాలోమి ఘోష్‌

అయిదు ఎపిసోడ్లు.. తక్కువలో తక్కువంటే అయిదు హత్యలు! మరి ఆత్మలేమైనా తక్కువ తిన్నాయా? ఎవరి బాడీలో ఎప్పుడుంటాయో తెలీదు! కథలో ట్విస్ట్‌లన్నిటినీ ఆ ఆత్మలే తిప్పుతాయి.. టైప్‌రైటర్‌.. అదో టైపు దయ్యం!

1980 కాలం.. గోవా సెంట్రల్‌ జైల్‌
తాంత్రిక విద్యల్లో ఆరితేరినవాడు ఫకీర్‌. ఎదుటి వారి కళ్లల్లోకి నేరుగా చూస్తే చాలు వాళ్ల శరీరంలోంచి ఆత్మను లాగేయగలడని.. చేతులతో గుండెను పిండేయగలడని ప్రతీతి. అలా కొంతమంది ప్రాణాలు తీసిన నేరం కింద ఉరిశిక్షపడి జైల్లో ఉన్నాడు. చేతులకు బేడీలు, కళ్లకు గంతలతో. మరో రెండు రోజుల్లో ఉరి తీయనున్నారు అతణ్ణి.
 మాధవ్‌ మాథ్యూ.. దయ్యాల కథలను వర్చువల్‌ రియాలిటీతో ఎక్స్‌పీరియెన్స్‌ అయ్యేలా రాయడంలో సిద్ధహస్తుడు. చిన్నా, పెద్ద అందరికీ ఫేవరేట్‌ రైటర్‌. కత్తగా రాయబోయే దయ్యం కథకు సబ్జెక్ట్‌ దొరక్క సతమతమవుతున్న అతనికి ఫకీర్‌ గురించి తెలిసి అతని జీవితాన్నే దయ్యం కథగా రాద్దామనుకుంటాడు.

‘‘ఉత్తర గోవాలోని బార్డేజ్‌ తాలూకా, సుల్తాన్‌పూర్‌ గ్రామం మాది. నేనూ, అమ్మ (చారు) ఇద్దరమే మా కుటుంబం. అమ్మకు తాంత్రిక విద్యలు వచ్చినా ఎవరికీ ఏ చిన్న హానీ తలపెట్టలేని మంచి మనసు ఆమెది.  కాని సమాజం ఏం చేసింది? మా ఇంటికి నిప్పుపెట్టి ఆమెను చంపేసింది. మా అమ్మలా  ఉంటే లాభంలేదని.. అదే విద్యతో రాజ్యమేలడం మొదలుపెట్టా. ఉరితో నన్ను చంపాలనుకుంటున్నారు. కాని నాకు చావులేదు. శరీరం కోసం ఆత్మ తపిస్తూనే ఉంటుంది. చనిపోయిన మూడు రోజులకు మళ్లీ తన శరీరంలోకే వెళ్లేందుకు ప్రయత్నిస్తుంది. కుదరకపోతే బ్లడ్‌మూన్‌ డే నాడు ఎవరి శరీరం దొరికినా అందులోకి వచ్చేస్తుంది’’ అని చెప్పుకుపోతాడు ఫకీర్‌. తర్వాత ఇదే ‘‘ఘోస్ట్‌ ఆఫ్‌ సుల్తాన్‌పూర్‌’’ అనే నవల రూపంలో బయటకు వస్తుంది. అయితే.. ఫకీర్‌ చెప్పిన చావులేదు అనే మాటలో నిజం ఎంతుందో కనుక్కోవడానికి ఫకీర్‌ను ఉరితీశాక అతని శవాన్ని ఇంటికి తెప్పిస్తాడు మాధవ్‌ మాథ్యూ జైల్లోని పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌ సహాయంతో. ఫకీర్‌ చనిపోయిన మూడో రోజు రాత్రి మాధవ్‌ మాథ్యూ ఇల్లు బార్డేజ్‌ విల్లాలో.. ఫకీర్‌ శవం ముందు మాధవ్, ఇన్‌స్పెక్టర్‌తో పాటు  మోసెస్‌ అనే వ్యక్తీ ఎదురు చూస్తూంటారు అతను తన శరీరంలోకి ఎలా వస్తాడోనని. ఎంత సమయం గడిచినా ఫకీర్‌ కళ్లు తెరవక పోయేసరికి ‘‘ఫకీర్‌ చెప్పిందంతా హంబక్‌.. శవాన్ని తీసుకెళ్లిపోండి’’అని అసహనం వ్యక్తం చేస్తాడు మాధవ్‌. పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌ శవాన్ని కదిలిస్తుండగా ఫకీర్‌ కళ్లు తెరుస్తాడు. ‘‘సర్‌.. లేచాడు’’అని గాభరాగా ఇన్‌స్పెక్టర్‌ చెప్పేసరికి ఏంచేయాలో తోచక కంగారుగా పక్కనే ఉన్న టైప్‌రైటర్‌తో ఫకీర్‌ తల మీద కొట్టి అతణ్ణి  చంపేస్తాడు మాధవ్‌ మాథ్యూ. తర్వాత కొన్నాళ్లకు వయసు రీత్యా మాధవ్‌ కూడా మరణిస్తాడు.
ఇదీ  ‘‘టైప్‌రైటర్‌’’ అనే వెబ్‌ సిరీస్‌లోని ముఖ్య భాగం. నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్‌ అవుతోంది.

బార్డేజ్‌ విల్లా ప్రాంగణంలో ఇన్‌స్పెక్టర్‌ ఆనంద్‌గా నటించిన పూరబ్‌ కొహ్లీతో లిటిల్‌ సోల్జర్స్‌ సమీరా, బంటి, గబ్లూ
మిగతా కథ.. ప్రెజెంట్‌ టైమ్స్‌.. బార్డేజ్‌ విల్లా..
 మాధవ్‌ మాథ్యూ  మనవరాలు జెన్నీ, తన భర్త, ఇద్దరు పిల్లలతో ముంబై నుంచి బస మారుస్తుంది బార్డేజ్‌ విల్లాకు. అప్పటికే ఆ విల్లా అంటే దయ్యాల బంగ్లా అనే అభిప్రాయం బార్డేజ్‌ జనాల్లో.  సమీరా, గబ్లూ, బంటీ అనే పదేళ్ల పిల్లలేకేమో కుతూహలం ఆ బంగ్లాలోని దయ్యాన్ని చూడాలని.   దయ్యాలు, దయ్యాల కథలు అంటే చెవికోసుకోవడమే కాదు కళ్లూ పీక్కుంటారు ఆ ముగ్గురు పిల్ల స్నేహితులు. వీలు దొరికినప్పుడల్లా స్కూల్‌ బంక్‌ కొట్టి ఆ విల్లా చుట్టే తచ్చాడుతుంటారు. ఈ పిల్లలకు బార్డేజ్‌ విల్లా పట్ల ఆసక్తి కలగడానికి ‘‘ఘోస్ట్‌ ఆఫ్‌ సుల్తాన్‌పూర్‌’’ నవలే కారణం. జెన్నీ పిల్లలిద్దరూ సమీరా వాళ్ల స్కూల్లోనే చేరడంతో వాళ్లతో ఫ్రెండ్‌షిప్‌ చేస్తారు సమీరా, గబ్లూ, బంటి. ఆ వంకతో ఆ విల్లాలోకి అడుగుపెట్టొచ్చనే ఆశతో. మరోవైపు జెన్నీ వాళ్లు ఆ బంగ్లాలోకి చేరడంతోనే అక్కడ పాడైపోయిన పాత టైప్‌రైటర్‌ కనపడుతుంది. దాన్ని బయటపడేయ్యమని ఇల్లు సర్దడానికి వచ్చిన ఓ వ్యక్తికి పురమాయిస్తుంది జెన్నీ. కాని ఆమె కూతురు పడేయనివ్వదు. నిరాశగా వెనుదిరుగుతాడు ఆ వ్యక్తి. నిజానికి అతను సామాన్లు సర్దడానికి వచ్చిన వ్యక్తి కాదు. ఆ ఇంట్లో ఉన్న టైప్‌రైటర్‌ను అపహరించడానికి వచ్చిన మనిషి. సమీరా స్కూల్లోనే పనిచేసే అమిత్‌ రాయ్‌ అనే మ్యాథ్స్‌ టీచర్‌ ఆ వ్యక్తికి ఆ దొంగతనాన్ని అప్పజెప్తాడు. ఒట్టి చేతులతో వెళ్లడమే కాక.. ఎఫర్ట్స్‌ పెట్టినందుకు డబ్బు ఇవ్వాలని డిమాండ్‌ చేయడంతో సిరామిక్‌ ఫ్లోరింగ్‌ మీద నీళ్లు చల్లి ఆ వ్యక్తి కాలు జారి కిందపడి చచ్చిపోయేలా చేస్తాడు అమిత్‌ రాయ్‌.

జెన్నీ అండ్‌ జెన్నీ
 జెన్నీ వాళ్లింట్లో పనికి కుదురుతుంది ఒకావిడ. ఆమెకు ఆ ఇంట్లో జెన్నీ రూపంలో ఇద్దరు కనపడ్తూంటారు. వాళ్లలో అసలు జెన్నీ ఎవరో తెలియక.. అందరూ అనుకున్నట్టుగానే ఆ ఇంట్లో దయ్యం ఉందన్న భయంతో ఇంట్లోంచి పారిపోతుంది. వెళ్తూ వెళ్తూ మార్గమధ్యంలోనే రక్తం కక్కి చచ్చిపోతుంది. ఆ మరుసటి రోజు మాధవ్‌ మాథ్యూ ఫ్రెండ్‌ జేమ్స్‌..  జెన్నీ కలిసి..బార్డేజ్‌ బంగ్లాలో దయ్యం ఉందని.. దాన్ని కనిపెట్టి బయటకు తరిమేయాలని చెప్తాడు. ‘‘ముందు నిన్ను పంపిస్తాను’’ అంటూ జేమ్స్‌ను చంపేస్తుంది. ఆ హత్యను చూస్తుంది సమీరా. షాక్‌ అవుతుంది. ఆ క్షణం నుంచి సమీరాక్కూడా ఇద్దరు జెన్నీలు కనిపిస్తుంటారు. దాంతో బార్డేజ్‌ విల్లాలో ఉన్న దయ్యం జెన్నీ అనే కన్‌క్లూజన్‌కు వస్తుంది ఆ అమ్మాయి. తల్లి లేని పిల్ల సమీరా. ఆమె తండ్రి పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌ ఆనంద్‌.

ఇన్వెస్టిగేషన్‌..
జెన్నీ వాళ్లు ఆ ఊళ్లోకి అడుగుపెట్టగానే వరుసగా మూడు హత్యలు జరగడం.. ఆ ముగ్గురూ జెన్నీని కలిసిన తర్వాతే హత్యకు గురవడంతో వాటికి, జెన్నీకి ఏదో లింక్‌ ఉన్నట్లు అనిపిస్తుంది ఇన్‌స్పెక్టర్‌ ఆనంద్‌కు. విచారణలో భాగంగా జెన్నీని పోలీస్‌స్టేషన్‌కు పిలిపిస్తాడు. ఆ హత్యలను తనకు ముడి పెట్టడంతో విస్తుపోతుంది జెన్నీ. ఆలోచనల్లో పడ్తుంది. అర్థరాత్రిళ్లు విల్లాలో టైప్‌రైటర్‌ చప్పుళ్లు,  హత్యలు, తనను చూసి  సమీరా భయపడ్డం.. ఏంటో అంతా అయోమయంగా అనిపిస్తుంది ఆమెకు. తన చిన్నప్పుడు ఆ ఇంట్లో ఆయాగా పనిచేసిన వ్యక్తిని కలిసి ఆ విల్లా మర్మం తెలుసుకోవాలనుకుంటుంది. ఆచూకీ వెదికి మరీ ఆమెను  కలుస్తుంది జెన్నీ. వాళ్ల తాత గురించి ఆస్తకికరమైన విషయాలు జెన్నీకి చెప్తుంది ఆమె. ఫకీర్‌ శవం కోసం అతని భార్య, కొడుకు ఆ విల్లాకు వస్తే శవం లేదు గివం లేదు అంటూ వాళ్లను మాధవ్‌ బయటకు గెంటేయించాడనే వివరంతో సహా.   ఇంకోవైపు అమిత్‌రాయ్‌ తరచుగా మోసెస్‌ను కలవడం.. వాళ్లిద్దరూ ఏవో మాట్లాడుకోవడాన్ని  గమనిస్తుంది సమీరా. ఈ దయ్యం కథ మలుపు మోసెస్‌ దగ్గర ఉందని గ్రహించిన సమీరా నెమ్మదిగా  మోసెస్‌తో ఫ్రెండ్‌షిప్‌ పెంచుకుంటుంది. ఒకరోజు అతని దగ్గరున్న చిన్న చెక్కబొమ్మను చూస్తుంది. దాని గురించి అడుగుతుంది. చెప్తాడు.. ‘‘ఇది ఫకీర్‌ బొమ్మ. ఇతని ఆత్మ బార్డేజ్‌ విల్లాలోని టైప్‌రైటర్‌లో ఉంది. రాబోయే బ్లడ్‌మూన్‌ డే నాడు ఫకీర్‌ ఆత్మ ఆ టైప్‌రైటర్‌ నుంచి ఈ చెక్కబొమ్మ ద్వారా  మానశ శరీరంలోకి ప్రవేశిస్తుంది. ఇదంతా అమిత్‌రాయ్‌ సమక్షంలో జరుగుతుంది’’ అని. అవాక్కవుతుంది సమీరా. అదంతా తన ఫ్రెండ్స్‌కి చెప్పి.. ఫకీర్‌ ఆత్మ మళ్లీ మనిషి శరీరంలోకి రాకుండా ఆపాలనుకుంటుంది. ఫ్రెండ్స్‌తో కలిసి ఆ టైప్‌రైటర్‌ను నాశనం చేయాలనే ప్లాన్‌ చేస్తుంది.   

బార్డేజ్‌ విల్లా, తల్లి చారుతో చిన్నప్పటి ఫకీర్‌
బ్లడ్‌మూన్‌ డే..
 ఇన్వెస్టిగేషన్‌లో ఉన్న ఇన్‌స్పెక్టర్‌ ఆనంద్‌కు అమిత్‌రాయ్‌ మీద అనుమానం వస్తుంది. అతణ్ణి పట్టుకోవడానికి వెళితే తప్పించుకుంటాడు. ఇంతలోకి  బ్లడ్‌ మూన్‌ డే రానే వస్తుంది. టైప్‌రైటర్‌ను ఎత్తుకుపోయే ప్రయత్నంలో అమిత్‌రాయ్‌కు పట్టుబడ్తారు పిల్లలు. జెన్నీతోపాటు వాళ్లనూ బార్డేజ్‌ విల్లాలోనే బంధిస్తాడు. అక్కడే జెన్నీ లాంటి ఇంకో వ్యక్తి తారసపడ్తుంది వాళ్లకు. పిల్లలతోపాటు జెన్నీ దిగ్భ్రమకు లోనవుతుంది. మరోవైపు ఫకీర్‌ఆత్మను మానవ  శరీరంలోకి తెచ్చే చివరి ఘట్టంలో ఉంటాడు అమిత్‌ రాయ్‌. సమీరా, పిల్లలు గొడవపడ్తున్నట్టు నాటకమాడి అమిత్‌రాయ్‌ నిష్టను భంగపరిచి టైప్‌రైటర్‌ను ఎత్తుకొని పారిపోతారు. వాళ్లను వెంబడిస్తూ పరిగెడ్తున్న అమిత్‌రాయ్‌. ఇన్‌స్పెక్టర్‌ ఆనంద్‌ కంటపడ్తాడు. అతణ్ణి అడ్డుకుంటాడు. బాహాబాహీకి తలపడ్తారిద్దరూ. ఇన్‌స్పెక్టర్‌ కొట్టిన దెబ్బతో అమిత్‌ రాయ్‌ స్పృహ కోల్పోతాడు. అప్పుడు పిల్లలు, ఆనంద్‌ కలిసి ఆ టైప్‌రైటర్‌ను  అమిత్‌రాయ్‌ వ్యాన్‌లోనే పెట్టి.. పెట్రోల్‌ చల్లి నిప్పంటించి కొండ మీద నుంచి తోసేస్తారు. స్పృహలోకి వచ్చిన అమిత్‌ దాన్ని ఆపేందుకు వెళ్లి అతనూ కొండ మీద నుంచి కిందకు పడిపోతాడు.

బార్డేజ్‌ విల్లాలో...
ఆ చెక్కబొమ్మను మంటల్లో వేసేస్తుంది జెన్నీ. చెక్కకాలి అందులోంచి చిన్న అస్తిపంజరం జెన్నీవైపు వస్తుంటే దాన్ని కాలితో తొక్కేస్తుంది. అంతకు ముందు రోజే పనిమీద ముంబై వెళ్లిన జెన్నీ భర్త ఇంటికొచ్చేస్తాడు. ‘‘ఎలా ఉన్నావ్‌? ఏదేదో విన్నాను. ఫ్రెషప్‌ అయ్యి వస్తా.. వివరంగా చెప్పు’’ అంటూ బాత్రూమ్‌లోకి వెళ్తాడు. తలూపి అతను అటు తిరుగుతాడో లేదో ఇటు జెన్నీ అదృశ్యమవుతుంది. బ్యాగ్‌లోంచి రక్తంతో తడిసిన షర్ట్‌ తీస్తాడు జెన్నీ భర్త వాష్‌ చేయడానికి.ఆ షర్ట్‌.. అమిత్‌రాయ్‌ వేసుకున్నదే!ఇక్కడితో ‘‘టైప్‌రైటర్‌’’ సీజన్‌ వన్‌ ఎండ్‌ అవుతుంది. ఇంకెంతో సస్పెన్స్‌ను రేకెత్తిస్తూ!– సరస్వతి రమ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement