చిరంజీవి
మెగాస్టార్, రాజ్యసభ సభ్యుడు చిరంజీవి మళ్లీ కుర్రాడిలా తయారయ్యారు. తనకు పేరు ప్రఖ్యాతులు సంపాదించి పెట్టిన సినిమా రంగం నుంచి రాజకీయ రంగానికి వెళ్లిన తరువాతీ ఆయన కాస్త లావయ్యారు. కొంచం పెద్దవాడిలా కనిపించారు. ప్రజారాజ్యం పార్టీ స్థాపన - ఆ తరువాత ఆ పార్టీ కాంగ్రెస్లో విలీనం - రాజ్యసభకు వెళ్లడం - కేంద్ర మంత్రి పదవి - చివరకు సార్వత్రిక ఎన్నికలు ...వీటన్నిటితో నిన్నమొన్నటి వరకు చిరంజీవి బిజీబిజీగా గడిపారు. ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడంతో ఆయనకు రిలీఫ్ దొరికింది. రాజకీయ ఒత్తిడి తగ్గింది.
ఈ నేపధ్యంలో చిరంజీవి కాస్త సన్నబడ్డారు. క్రాఫ్ స్టైల్ మార్చారు. మళ్లీ యువకుడిలా మారిపోయారు. చిరునవ్వులు చిందిస్తూ ఎంతో హుషారుగా కనిపిస్తున్నారు. ఆయన ఇలా ఎందుకు మారిపోయారో, ఎందుకు కనిపిస్తున్నారో ఇప్పటికే మీకు అర్ధమైపోయి ఉంటుంది. చిరు సిల్వర్ స్క్రీన్కు దూరమై దాదాపు ఏడు సంవత్సరాలు కావస్తోంది. రాజకీయ రంగంలో కాస్త వెసులుబాటు దొరకడంతో ఆయన చూపు మళ్లీ రంగుల రంగంవైపు మళ్లింది. ఇప్పుడు తన సినీ జీవితంలో ప్రాముఖ్యత కలిగిన, అభిమానులు అత్యంత ఆసక్తిగా ఎదురు చూసే సినిమాలో నటించడానికి అన్ని రకాలుగా సంసిద్ధులవుతున్నారు. తన 150వ చిత్రంలో నటించడానికి ఉవ్వీళ్లూరుతున్నారు. అందుకే ఆయనలో మళ్లీ ఈ యవ్వనపు చాయలు తొంగి చూస్తున్నాయి. మనసు హుషారెక్కుతోంది. ఇంత కాలం విరామం తరువాత సిల్వర్ స్క్రీన్పై కనిపించే ముందు చిరంజీవి రేపు బుల్లితెరపై దర్శనమివ్వనున్నారు. చిరునవ్వులు చిందించే ఆ చిరుని, ఆయన బాడీలో, స్టైల్లో వచ్చిన మార్పులను రేపు ప్రసారమయ్యే 'మీలో ఎవరు కోటీశ్వరుడు' కార్యక్రమంలో హీరో నాగార్జునతోపాటు రేపు మాటీవిలో చూడవచ్చు.
ఇక చిరు 150వ సినిమా విశేషాలు ఆయన పుట్టిన రోజు ఈ నెల 22న వెల్లడయ్యే అవకాశాలు ఉన్నాయి. ఆ రోజున ఆ చిత్రం గురించి అధికారికంగా ప్రకటిస్తారని భావిస్తున్నారు. ఇప్పటివరకు ఈ చిత్రం కోసం అనేక కథలను విన్నారు. చర్చించారు. చిరంజీవి పుట్టిన నాటికి ఈ సినిమా స్క్రిప్టు సిద్ధమవుతుందని ప్రముఖ సినీ దర్శకుడు వివి వినాయక్ స్వయంగా చెప్పిన విషయం తెలిసిందే. ఈ సినిమాను తొలుత గీతా ఆర్ట్ బ్యానర్పైనే నిర్మించే అవకాశం ఉందని అనుకున్నారు. అయితే ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం ఈ చిత్రానికి చిరు తనయుడు, యువహీరో రామచరణ్ తేజ నిర్మాత. అంతే కాకుండా ఆ చిత్రంలో ఆయన కూడా నటిస్తారు. తన తండ్రితో కలసి నటించాలని చెర్రీ ఎంతో ఉత్సాహంతో ఉన్నారు. తాను ఆ మూవీలో నటించబోతున్నట్లు కూడా ఆయన తెలిపారు. ఇక ఆ సినిమా కోసం చిరు అభిమానులు ఎంతగా ఎదురు చూస్తారో ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరంలేదు.