రామ్ చరణ్కు అగ్నిపరీక్ష!
చిరంజీవి తనయుడు రామ్ చరణ్ బాలీవుడ్లో అరంగ్రేటం చేస్తున్న 'జంజీర్' హిందీ సినిమా విడుదలపై ఆసక్తి బదులు ఉత్కంఠ నెలకొంది. తెలుగు, హిందీ భాషల్లో తెరకెక్కిన ఈ సినిమా రేపు (సెప్టెంబర్ 6)న విడుదల కాబోతోంది. తెలుగులో 'తుఫాన్' పేరుతో ఈ సినిమా రూపొందింది. రాష్ట్రంలో నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో 'తుఫాన్'కు చిక్కులు ఎదురయ్యే అవకాశం కన్పిస్తోంది. ఈ సినిమాను అడ్డుకుంటామని సమైక్య, వేర్పాటు ఆందోళనకారులు వేర్వేరుగా ప్రకటించడంతో ఉత్కంఠ నెలకొంది.
అందరివాడుగా ఉన్న చిరంజీవి రాజకీయాల్లోకి రావడంతో ఆయన కుటుంబ సభ్యుల సినిమాలకు చిక్కులు ఎదురవుతున్నాయి. తెలంగాణ ఉద్యమం జరిగిన రోజుల్లో చిరంజీవి సమైక్యవాదానికి మద్దతు తెలపడంతో తెలంగాణలో ఆయన కుటుంబ సభ్యుల సినిమాలను అడ్డుకునేందుకు ఆందోళనకారులు యత్నించారు. రాష్ట్ర విభజన తర్వాత చిరంజీవి 'యూటీ' పాట ఎత్తుకోవడంతో రెండు ప్రాంతాలవారు ఆయనపై ఆగ్రహంగా ఉన్నారు. ఈ ప్రభావం 'తుఫాన్'పైనా పడనుంది.
'జంజీర్' కంటే ముందు విడుదల కావాల్సిన రామ్ చరణ్ 'ఎవడు' ఈ కారణంగానే వాయిదా పడింది. పవన్ కళ్యాణ్ 'అత్తారింటికి దారేది' కూడా విడుదలకు సిద్ధమయినా అనుకూల పరిస్థితుల కోసం ఎదురు చూస్తోంది. ఎవడు విడుదల వాయిదా పడడంతో తుఫాన్ విడుదల తేదీ కూడా వచ్చేసింది. జంజీర్ హిందీలోనూ విడుదలవుతుండడంతో తెలుగు వర్షన్నూ రిలీజ్ చేయాల్సిన పరిస్థితి తలెత్తింది. అయితే తమ సినిమాను అడ్డుకోకుండా చూడాలంటూ 'జంజీర్'ను నిర్మించిన రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ సంస్థ రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించింది. దీంతో తుఫాను, జంజీర్ సినిమా ప్రదర్శించే థియేటర్ల వద్ద రక్షణ కల్పించాలని, భద్రతా చర్యలు తీసుకోవాలని డీజీపీ, హోం శాఖలను హైకోర్టు ఆదేశించింది.
హైకోర్టు ఆదేశాలిచ్చినప్పటికీ 'తుఫాన్'ను అడ్డుకుంటామని సమైక్య ఆందోళనకారులు అంటున్నారు. విజయనగరంలో తుఫాన్ పోస్టర్లను దహనం చేశారు. తెలంగాణలోనూ అడ్డుకుంటామని విద్యార్థి జేఏసీలు ప్రకటించాయి. హైదరాబాద్లో 7న ఏపీఎన్జీవో సభ నేపథ్యంలో తెలంగాణ బంద్కు ఆందోళనకారులు పిలుపునివ్వడంతో 'జంజీర్' చిక్కుల్లో పడింది. ఇన్ని అవాంతరాల నడుమ 'తుఫాన్' ఎలా ముందుకు వస్తుందోనని అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. బాలీవుడ్లో కంటే ముందు సొంత రాష్ట్రంలోనే రామ్ చరణ్ తన అదృష్టాన్ని పరీక్షించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.