‘‘ఏమాయనే ఇంకా లేత్తలేవు.. లెవ్వు! లేటయితే మేడమ్ తిడుతది’’ అంటూ నిండా కప్పుకుని పడుకున్న కూతుర్ని లేపింది లలిత. మేడమ్ పేరు వినంగనే జప్పని లేచి కూసుంది అనిత. అనితకి పదేండ్లు.
కండ్లు నలుసుకుంట టైమ్ చూసింది. ఆరుంబావు దాటింది. ‘అమ్మో! లేటయింది,’ అనుకుంట నీళ్ల కుండి కాడికి పోయింది. అసలే చలికాలం. చల్లని నీళ్లు ముట్టంగనే వేళ్లు జివ్వుమన్నయి. తొందరగ మొహం కడుక్కుని అద్దం కాడికి వచ్చింది. చెదిరిన జుట్టునంత ఎనకకు అనుకుని రబ్బర్ బ్యాండు పెట్టుకుంది. ‘‘అనితా.. నడువు ఆరన్నర అయితుంది’’ తొందరపెట్టింది లలిత. గౌను కింది అంచుతో మొహం తుడుసుకుంట చెప్పులేసుకుంది అనిత. దస్తిని రెండు మడతలేసి, చెవులకు చలిరాకుండ అనితకు కట్టింది లలిత. తను కొంగు కప్పుకుంది. అమాయకంగా పడుకున్న ఏడేండ్ల కొడుకును చూసింది. కండ్లల్ల నీళ్లు తిరిగినయి. రాత్ర అన్నం పెట్టుమని అడిగిండు. లేదు అనంగనే ఏం అనకుండ పండుకున్నడు. పాపం కొడుకుకు ఇప్పుడన్న అన్నం తీస్కరావాలే అనుకుంది. తలుపులు దగ్గరికేసి వడివడిగ నడిచింది. తల్లి వెంటనే నడిచింది అనిత. లలితకు భయంతో గుండె కొట్టుకుంటాంది. ‘అసలే మేడమ్ ఇయ్యాల ఊరికి పోతా అన్నది. ఇయ్యాలనే లేటు కావట్టే. ఈ చలికి తెల్లారిందే తెలుస్తలేదు’ అనుకుంట అనితని తొందరగ నడవమని సైగ చేసింది.
కూతురును తీసుకపోవద్దు అనుకుంటది. కాని తప్పదు. అనిత ఇల్లు ఊడిస్తే, ఆమె బాసండ్లు తోముతది. అట్ల టైమ్ మిగిలి ఇంకో ఇంట్లకి పనికి పోవచ్చని ఆలోచన. అనుకున్నట్టే వాకిట్లనే నిల్సుండి కోపంగా చూసింది మేడమ్. లలిత పాణం జల్లుమన్నది. ‘‘ఏమైందే లలితా! నీకోసమే చూస్తున్న. జప్పన్నే అచ్చినట్టు ఉన్నవ్..’’ అన్నది మేడమ్ వెటకారంగా. ‘‘ఇయ్యాల చలి జర ఎక్కువుంది మేడమ్. లేసుడు లేటయింది,’’అంటూ నసిగింది లలిత. ‘‘ఊరంత ఉంది చలి.. నీకొక్కదానికేనా ఏంది?’’ అన్నది మేడమ్ కోపంగా. లలిత ఏం మాట్లాడకపోవడంతో మళ్లీ తనే అంది.. ‘‘అయినా ఎన్నిసార్లు చెప్పిన్నే.. నీ బిడ్డను ఎందుకు తీసుకత్తున్నవు? నేనేదో నీ బిడ్డను పనికి పెట్టుకున్న అనుకుంటుండ్రు అందరు.’’ ‘‘ఎవరనుకుంటరు మేడమ్, అనుకుంటే నేను చెప్పనా వాళ్లకు. నాకే కొంచెం ఆసరా అయితదని తీసుకపోతున్న అని’’ అన్నది లలిత బాసండ్లు అందుకుంట. ‘‘ఆ... అనుకునేటోళ్లు నీ ఇంటికి వచ్చి చెప్తరా’’ అంటూ లోపలికి వెళ్లిపోయింది. అనితకు అవి అలవాటయిన మాటలే. లోపలికి పోయి చీపురు పట్టుకుంది. బాసండ్లు తోముతున్న లలితకు అనిత ఆలోచనలే.
తన పరిస్థితిని అర్థం చేసుకుంటది. అందరు పిల్లల లెక్క ఎక్కువ ఆడియ్యదు. అందుకే అనిత అంటే తనకెంతో అభిమానం. ఇంత చిన్న వయసులోనే అంత పరిణతి. అనిత తమ్మున్ని చూసుకునే విధానానికి ఆశ్చర్యం వేస్తుంది ఆమెకు. ఒకసారి జరిగిన సంఘటన గుర్తుకొచ్చింది లలితకు. అది నడి ఎండకాలం. నల్ల నీళ్లు రాక వారమయితుంది. అప్పటికే బోర్లు ఉన్నోళ్ల ఇండ్లల్లకు పోయి నాలుగైదు బిందల నీళ్లు తెచ్చింది లలిత. మల్ల మల్ల అడుగుతే యాష్ట పడుతరు. ఇంట్లనేమో సుక్క నీళ్లులేవు. భర్త పని కానించి వచ్చే టైమయింది. ఏం చెయ్యాల్నో అర్థమైతలేదు లలితకు. అమ్మను చూసింది అనిత. పరిస్థితి అర్థం చేసుకుంది. తమ్మున్ని, బిందెను తీసుకుని పోయింది. అడిగిన కాడ మళ్ల అడగద్దు అని అనితకు తెలుసు. కొత్త ఇల్లు చూసింది. గేటు తీసుకుని లోపలికి పోయింది. ‘‘మేడమ్ రెండు బిందల నీళ్లు ఇస్తరా’’ అన్నది భయపడుతూ. ఇంతకుముందు అడగలే కాబట్టి వాళ్లూ సరే అన్నరు. అనితకి సంతోషం ఆగలేదు. తండ్రి సినిమాకు తీస్కపోతెనో, తల్లి అడిగింది కొనిస్తెనో కలిగే సంతోషం అది. ‘‘అమ్మను బిందె తెమ్మను’’ అని తమ్మున్ని పంపింది. అనితకు తెలుసు. బిందెలు రెండే. కాని మోసే నీళ్లే ఎక్కువ. అందుకే ఇంట్లోల్లు గుర్తించే లోపే వీలయినన్ని ఎక్కువ మోయాలని ఆరాటపడ్తూ ఉంది. తల్లి బిందెతో, తమ్ముడు సర్వతో వచ్చిండ్రు. ముందే నింపిన బిందెని తల్లి భుజం మీదికి ఎత్తింది. తమ్ముని సర్వ నింపి ఇచ్చింది. అట్ల ఆ ఎండకాలం అనిత తెలివితోని నీళ్ల కరువు నుండి బయటపడ్డది లలిత. అనిత ఇల్లు ఊడ్చి బోల్లు కడగటానికి రాంగనే, లలిత ఈ లోకంలోకి వచ్చింది.
‘‘నువ్వు కడగకు. సబ్బు పోలేదు అంటది మేడమ్’’ అన్నది లలిత. ‘‘పక్క మేడమ్ ఇంట్ల ఉడ్వన మరి..?’’ అనిత అడిగింది. ‘‘ఆ.. పో.. నేను గుడ వస్త ఇవి కడిగినంక’’ చెప్పింది లలిత. పక్కింటికి పరిగెత్తింది అనిత. బోల్లన్ని తెల్లగ కడిగి బోర్లించింది లలిత. మేడమ్ కోసం చూసింది. అన్నం అడుగుదామని. అచ్చేటప్పుడు అడుగుదాం అనుకొని పక్కింట్లకి నడిచింది. అనిత ఇల్లు ఊడ్సుడు అయిపోయింది. అనిత చేతిలో ఎర్ర స్వెటర్ మెరుస్తాంది. నమ్మలేనట్టుగ చూసింది లలిత. ‘‘మేడమ్ ఇచ్చింది.’’ మురిసిపోతూ చెప్పింది అనిత. లలితకు సంతోషంగ ఉంది. అక్కడక్కడ చిన్న చిన్న చిరుగులు ఉన్న.. బాగనే ఉంది స్వెటర్. బిడ్డకు రేపట్నుంచి చలిపెట్టదు అనుకుంది. లలిత బాసండ్లు తోముతున్నంత సేపు, అనిత స్వెటర్ చూసుకుంట మురిసిపోయింది. పని అయినంక ఇద్దరూ ఆనందంగ ఇంటికి పోయిండ్రు. ఇంటికి రాంగనే మొహం కడుక్కుని, తినడానికి తయారుగ ఉన్న కొడుకుని చూసింది లలిత. అప్పుడు గుర్తొచ్చింది.. అన్నం తీసుకస్తని వాడికి మాటిచ్చిన సంగతి. ‘‘అయ్యో! ఎంత పని అయిపాయె.. మేడమ్‌ని అన్నం అడుగుడు మర్చిపోతి..’’ అనుకుంట తనని తాను తిట్టుకుంది. కాని అప్పటికే కొడుకు కండ్లు మెరుస్తున్నయి. అనిత స్వెటరు కింద ఉన్న అన్నం కవరు చూసి. వాడు ఉర్కొచ్చి అనితను చుట్టుకున్నడు. వాడిని కూర్చోబెట్టి ప్లేట్ల అన్నం పెట్టింది అనిత. వాడు తింటుంటే తృప్తిగ చూస్తు.. ‘‘నువ్వు పని తొందర్లపడి మరిచిపోయినవే. కని నేను మర్చిపోలే. రాత్రి ఆకలితో వాడు ఏడ్చిన ఏడుపే గుర్తుకొచ్చింది’’ అన్నది. లలిత గుండె కరిగిపోయింది. కూతురునె చూస్తుండిపోయింది.
- పెద్దింటి సాహితి
అమ్మక్క
Published Sun, Mar 25 2018 12:54 AM | Last Updated on Sun, Mar 25 2018 12:54 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment