జయమ్ము నిశ్చయమ్మురా...! | Jayammu nischayammura song | Sakshi
Sakshi News home page

జయమ్ము నిశ్చయమ్మురా...!

Published Sun, Jun 12 2016 12:31 AM | Last Updated on Mon, Sep 4 2017 2:15 AM

జయమ్ము నిశ్చయమ్మురా...!

జయమ్ము నిశ్చయమ్మురా...!

పాటతత్వం
నేను పదేళ్ల వయసులో ఉన్నప్పుడు టూరింగ్ టాకీస్ నుంచి లీలగా ‘జయమ్ము నిశ్చయమ్మురా...’ పాట విన్నప్పుడు ఎందుకో తెలియని ఉత్సాహం, ఓ బలం ఏర్పడేవి. 1971లో ఇండియా-పాకిస్థాన్ యుద్ధం సమయంలో సరిహద్దులో సైనికుడిగా పనిచేశాను. విచారం ఆవహించినప్పుడు ఈ పాటనే మననం చేసుకునేవాణ్ని. మహానటుడు నందమూరి తారకరామారావు నటించిన ‘శభాష్ రాముడు’ సినిమాలోని ఈ పాటను కొసరాజు రాఘవయ్య చౌదరిగారు రాస్తే, ఘంటసాల స్వరపరచి స్వయంగా ఆలపించారు.

ఈ కథలోని మలుపులు... పాత్రలకు ఎదురయ్యే హఠాత్పరిణామాలు... ఇవన్నీ పాటను ప్రతిసారీ గుర్తు చేస్తూ ఉంటాయి. ఎక్కడో మనలో దాగున్న  నిరుత్సాహాన్ని పోగొట్టి, ఉత్సాహాన్ని ఉరకలెత్తించే ఈ సినిమా కోసం ‘జయమ్ము నిశ్చయమ్మురా’ రాశారు కొసరాజుగారు. ఇది ఒక్క వ్యక్తికే పరిమితమైన పాట కాదు... ఓ సమాజం ఎలా ఉండాలో  చెబుతుంది.
 జయమ్ము నిశ్చయమ్మురా భయమ్ము లేదురా
 జంకు గొంకు లేక ముందు సాగిపొమ్మురా సాగిపొమ్మురా
 
హఠాత్తుగా పోటెత్తిన గోదావరి ఆ ఊరిని ఉక్కిరిబిక్కిరి చేసింది. జమీందారుగా బతికిన రాముడి జీవితం తలకిందులైపోయింది. సిరిసంపదలన్నీ ప్రకృతి విలయానికి కొట్టుకుపోయాయి. తానొక్కడే కాదు.. భార్య, అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న కూతురు, చదువుకుంటున్న తమ్ముడు... ఇలా అతని మీద ఆధారపడిన వాళ్లు ఉన్నారు.

దాంతో పొట్ట చేతపట్టుకుని కుటుంబంతో సహా పట్నానికి వలస వచ్చిన రాముడి (ఎన్టీఆర్) కథే ‘శభాష్ రాముడు’. బాగా బతికిన కుటుంబం చితికిపోయి, సర్వం కోల్పోయిన అనాథలా మహానగరంలో ఒంటరిగా బతుకీడుస్తుంది.  ఉద్యోగంలో ఆత్మాభిమానాన్ని తాక ట్టుపెట్టలేని పరిస్థితుల్లో రిక్షా నడిపి డబ్బు సంపాదించడం మొదలుపెడతాడు.
 
ఏనాటికైనా స్వార్థమూ నశించి తీరునూ
 ఏ రోజుకైనా సత్యమే జయించి తీరును... బతకడం ఎలాగైనా బతకొచ్చు, కానీ నీతిగా, నిజాయతీగా జీవితాంతం తాము నమ్మిన వాటి కోసం కట్టుబడే వాళ్లు చాలా తక్కువ మంది ఉంటారు. ఇందులో కథానాయకుడి పాత్ర కూడా అంతే. తాను నమ్మిన నీతి కోసం ధైర్యంగా పోరాడతాడు. తన కోసం తాను ఆలోచించని మనిషి. అందుకే కుటుంబం కోసం పగలూ రాత్రి, రెక్కలు ముక్కలు చేసుకుని కష్టపడతాడు. తమ్ముణ్ని బాగా చదివించాలని డబ్బులు కూడబెడుతూ ఉంటాడు.
 
అనుకోని ప్రమాదంలో హీరోకు బుల్లెట్ గాయమవుతుంది. రిక్షా నడపలేడు. కనీసం రెండు నెలల పాటు ఇంటికే పరిమితం కావాలి. దాంతో అతని తమ్ముడు మాత్రం అన్నయ్య తాత్కాలికంగా వదిలేసిన బతుకుబండిని చదువుకుంటూనే లాగటానికి సిద్ధపడతాడు.
 
ఈ లోకమందు సోమరులై ఉండకూడదు
 పవిత్రమైన ఆశయాలు మరువకూడదు
 మనిషి అన్నాక ఏదో పని చేసుకుని బతకాలి. అంతేగానీ ఏ మాత్రం బాధ్యత లేకుండా తిరగడం తప్పు అని ఇందులోని ఎన్టీఆర్ పాత్ర చెప్పకనే చెబుతుంది. ఇటువంటి సిచ్యుయేషన్లు వస్తే మామూలుగా ఎవరైనా హీరోను పొగుడుతూ పాట రాయొచ్చు. ఈ పాటతో సమాజం మొత్తాన్ని ప్రభావితం చేయొచ్చనే ఉద్దేశంతో కొసరాజుగారు ఈ పాట  రాశారు.
 
గృహాన్ని స్వర్గసీమగా చేయుము దేవా బ్రోవుము దేవా
 కుటుంబమొక్క త్రాటిపైన నిలుపుము దేవా నడుపుము దేవా
 బీదసాదనాదరించు బుద్ధి నొసగి శక్తి నొసగుమా
 ఈ కథలో రాముడికి బుల్లెట్ గాయమైతే, అతని భార్య కూడా కష్టాల్లో ఉన్న సంసారాన్ని ఈదడానికి పనిమనిషిగా మారడానికి సిద్ధమవుతుంది. రాముడికి ఇది ఏ మాత్రం ఇష్టం ఉండదు.

ఎందుకంటే అతనికి చదువంటే ఇష్టం. కష్టపడి చదివి తమ్ముడు పోలీసాఫీసర్ కావడమే అతని కోరిక. ఎందుకంటే తనలాంటి పేదలపై పోలీసులు చూపిస్తున్న అధికార జులుంను అతనైనా పోగొట్టాలి.
 జయమ్ము నిస్వరించుగాక పోరిగెల్వవోయ్
 స్వతంత్ర యోధుడన్న పేరు నిల్వబెట్టవోయ్
 యుద్ధంలో దెబ్బలు తప్పవు.... జీవితం అన్నాక కష్టాలు తప్పవు. మరణించేంత వరకూ గెలుపు కోసం ఓ సైనికుడిగా ప్రయత్నిస్తూనే ఉండాలి.
 
ఒక తుపాకి మనిషి చేతిలో ఉంటే ఎంత ధైర్యంగా ఉంటుందో... ఈ పాట మన గుండెలో ఉంటే అంతే మానసిక స్థైర్యం కలుగుతుంది. ఏదో తెలియని బలం. నా కెరీర్‌లో స్ఫూర్తి  రగిలించే పాటలు ఎన్నో రాశాను. కానీ నాలో గెలవాలన్న తపన కలిగించే పాట మాత్రం ఈ ఒక్క పాటే. దీని స్ఫూర్తితోనే విజయశాంతి హీరోయిన్‌గా నటించిన ‘ఆశయం’ సినిమాలో ‘విరిసే ఉదయం’ పాట రాశాను.  ‘జయమ్ము నిశ్చయమ్ము’లోని ప్రతి లైన్ ఇప్పటికీ గుర్తుందంటే కొసరాజుగారి రచనా శైలి అంత అద్భుతంగా ఉంది. ఈ సినిమా విడుదలై ఇప్పటికి 57 ఏళ్లు. ఇంకో వందేళ్లయినా ఈ పాట ఇంకా బతికే ఉంటుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement