నవ్వు | lough | Sakshi
Sakshi News home page

నవ్వు

Published Sat, Nov 7 2015 11:28 PM | Last Updated on Sun, Sep 3 2017 12:11 PM

నవ్వు

నవ్వు

కోరిన అదృష్టం ఆమెను వరించలేదు. ఏడాదికే ఆమె విధవరాలై తిరిగి వచ్చింది. రామచంద్రరావు చూడటానికి వెళ్లాడు. ధైర్యం చెప్పాడు. అలాగే ప్రతిరోజూ వెళ్లి ఎన్నో కబుర్లు కథలు చెప్పేవాడు. ఆమె దుఃఖం నుండి కోలుకుంది.
 
 రామచంద్రరావు ఎప్పుడూ నవ్వుతూ కనిపిస్తాడు. అతనికి నవ్వడం ఒక స్వభావమైపోయినట్టూ, కష్టాలూ, చీకాకులూ అతనికి దూరంగా తొలగి వుంటాయన్నట్టు అనిపిస్తుంది. ఊళ్లో అందరినీ అతను నవ్వుతూ పలకరిస్తాడు. అందరూ అతనికి స్నేహితులు.

 అతను పక్కనుంటేనే మూర్తికి వొళ్లంతా తేలికపడినట్టు, ఉదయపు నీరెండ వంటి ఉత్సాహం వచ్చినట్టు అనిపిస్తుంది. మూర్తికి సమస్యలు చాలా ఉన్నాయి. కాని ఆ సమస్యలన్నీ రామచంద్రరావు ఎదురుగా ఉన్నంతసేపూ మంచు విడిపోయినట్లు మాయమైపోతాయి.

 కాని, మూర్తికి ఎప్పుడూ ఆశ్చర్యం కలుగుతూంటుంది. ఎందుకు ఇతని వదనాన ఒక విషాద రేఖ గానీ, విసుగు గానీ కనిపించవు? ఏ జీవిత రహస్యం ఇతనికి తెలుసును? సుఖంలోని ఆనందంలోని ఏ కీలకాన్ని యితను వశపరచుకున్నాడు?
 తీరా చూస్తే రామచంద్రరావు సామాన్యుడు. ఆస్తీ, హోదా ఉన్నవాడు కాదు; ఏదో చిన్న ఉద్యోగం చేసుకుంటున్నాడు. ‘నా’ అన్నవాళ్లెవరూ ఉన్నట్టు కనబడరు. అతను ఒంటరివాడు. ఏలూరు నుండి వచ్చే బస్సు ప్రమాదానికి లోనయిందనీ, ప్రయాణీకులకి చాలామందికి గాయాలు తగిలాయనీ విన్నాడు మూర్తి. వారిలో రామచంద్రరావు ఒకడని తెలిసినప్పుడు బాధపడ్డాడు. మూర్తి కంగారుపడ్డాడు.
 
  సరాసరి టిక్కెట్టు కొనుక్కుని ఏలూరు ఆస్పత్రికి వెళ్లాడు. గాయపడినవారిలో రామచంద్రరావును గుర్తించడం కష్టమయింది. అతని తలకీ చెంపలకీ కట్లు ఉన్నాయి. స్పృహ లేదు. మూర్తి గాభరాపడ్డాడు. తక్కిన గాయపడిన వారందరి దగ్గరా వారి వారి భార్యలూ తల్లిదండ్రులూ ఉన్నారు. రామచంద్రరావు మాత్రం వొంటరిగా మృత్యువుకీ, బ్రతుకుకీ మధ్య ఉన్న మసక మసక అంచుమీద ఉన్నాడు. మూర్తికి కళ్లనీళ్లు తిరిగాయి. ఇంత ఉత్తముడికి ఎందుకిటువంటి గతి పట్టింది అనుకున్నాడు.
 
 అతని మంచం పక్కన ఒక కుర్చీ మీద కూర్చున్నాడు మూర్తి. స్పృహ రాగానే - తనని చూస్తాడనీ, కావలించుకుని ఏడుస్తాడనీ అనుకున్నాడు. తనకి ఏడుపు వచ్చేస్తుంది. ఎలాగ ఇతనికి ధైర్యం చెప్పి వోదార్చడం? ఎప్పటికోగాని రామచంద్రరావుకి స్పృహ రాలేదు. అతడు కదలడం మొదలుపెట్టాడు. మూర్తి గుండెలు కొట్టుకున్నాయి దుఃఖంతో ఆనందావేశంతో. రామచంద్రరావు కళ్లు తెరిచాడు. ఓ నిముషం తదేకంగా మూర్తికేసి చూశాడు. ‘బతికే ఉన్నానా’ అంటూ నవ్వాడు. సన్నని చిన్నని నవ్వు హాయిగా మొగ్గవిడి తెల్లని పువ్వు రేకులను విచ్చుకుంటూన్నట్టు.
 
 మూర్తి ‘షాక్’ తిన్నాడు. అలాంటి విపత్సమయంలో కూడా అతను నవ్వగలడని అనుకోలేకపోయాడు. తర్వాతి రోజున మాటల సందర్భంలో అతని చేతిని తన చేతిలోకి తీసుకుంటూ మూర్తి అన్నాడు... ‘‘రామం నీవు పెళ్లి చేసుకోవాలి. ఇటువంటి సమయంలో నీకు భార్య ఉంటే ఎంత పరిచర్య చేసేది? ఇలా వొంటరిగా ఎన్నాళ్లు ఉంటావు?’’
 రామచంద్రరావు జవాబుగా - నవ్వాడు. సరళ కనుక అంగీకరించి వుంటే రామచంద్రరావుకి యీ వొంటరితనం ఉండేది కాదు. సరళ రామచంద్రరావుకి దూరపు బంధువుల అమ్మాయి. సన్నగా నాజూకుగా ఉంటుంది. ఆమె కళ్లల్లో తెలివైన వెలుతురు ఉంది. సరళా రామచంద్రరావూ కలిసి చదువుకున్నారు. అప్పుడే వారిద్దరికీ స్నేహం కలిసింది. ఆ స్నేహం ప్రేమగా మారినట్లు కూడా మూర్తికి తెలుసును. రామచంద్రరావు మూర్తితో అన్ని సంగతులూ చెప్పేవాడు. ఆమె తనని తప్పకుండా పెళ్లి చేసుకుంటుందన్న విశ్వాసాన్ని ప్రకటించేవాడు. సరళ తల్లిదండ్రులు కూడా ఏనాడూ వీరిరువురి స్నేహానికీ అభ్యంతరం చెప్పలేదు. సరళ తల్లిదండ్రులు కలవారు. సరళ ఒక్కర్తే వారి సంతానం. రామచంద్రరావుకి సరళతో పెళ్లి జరగాలనీ, దానితో అతని వొంటరితనమూ ఆర్థిక సమస్యా రెండూ తీరి సుఖిస్తాడనీ నిజమైన నిర్మలమైన స్నేహితుడైన మూర్తి ఎంతో ఆశించేవాడు.
 ‘‘రామం నువ్వెప్పుడైనా ఆమె అభిప్రాయం తెలుసుకున్నావా?’’ అని అడిగాడు మూర్తి, రామచంద్రరావుకి ఉద్యోగం వచ్చిన రోజున.
 ‘‘సమయం రానీ’’ అన్నాడు రామచంద్రరావు.
 రెండు మూడు నెలల అనంతరం సరళా రామచంద్రరావులు పార్కులో కలుసుకున్నారు.
 విద్యుద్దీపాల కాంతీ, సప్తమి వెన్నెలా కలసి వీరు కూర్చున్న బెంచీమీద విచిత్రంగా పడింది. రామచంద్రరావు, తన మనస్సులోని అభిప్రాయాన్ని విప్పి చెప్పాడు. కాని ఆ క్షణాన సరళ వివేకం ఆమె హృదయ దౌర్భల్యాన్ని జయించింది.
 ‘‘రామం, నీ ఆస్తి ఎంత?’’ అని అడిగింది.
 ‘‘ఒక పాత పెంకుటిల్లు, అదైనా మా వుళ్లో ఉంది’’ అన్నాడు రామచంద్రరావు.
 ‘‘భూమి గట్రా ఏమైనా...’’ అని ప్రశ్నించింది సరళ.
 ‘‘సెంటు భూమి కూడా లేదు’’ అని కులాసాగా జవాబు చెప్పాడు రామచంద్రరావు.
 ‘‘నీ జీతం ఎంత?’’ అని అడిగింది సరళ.
 
 ‘‘నూట యిరవై రూపాయలు’’ అన్నాడు రామం.
 సరళ నిట్టూర్చింది. ఆమె తన సాధక బాధకాలు, అవసరాలు, అలవాట్లూ తన తల్లిదండ్రుల కనీసపు కోర్కెలు అన్నీ చెప్పింది. చివరికి ప్రేమా యిష్టమూ మొదలైన దౌర్భల్యానికి లోబడి తన సుఖాన్నీ భద్రతనీ బలి యిచ్చుకోలేనంది. ‘‘నువ్వంటే నాకెప్పుడూ యిష్టమే, కాని నా జాగ్రత్తలో నేనుండాలిగా’’ అంది.
 
 పార్కులోంచి రామచంద్రరావు యివతలకి రాగానే మూర్తి ఎదురై ‘‘ఏమైంది, ఏమైంది’’ అని ఆతృతగా అడిగాడు. ‘‘నిరాకరించింది’’ అన్నాడు రామచంద్రరావు.
 
 మూర్తికి కోపం వచ్చింది రామచంద్రరావు మీద. అతనంత తాపీగా జవాబు చెప్పినందుకు కాదు, అతని పెదాల మీద నిశ్చలంగా నిలిచిన చిరునవ్వుని చూసి. ఏ ప్రేమ వైఫల్యానికి మనుష్యులు ఆత్మహత్య చేసుకుంటారో, ఏకాంతంలో పడి ఏడ్చి ఏడ్చి కృశించిపోతారో ఇటువంటి దానికి హాయిగా నవ్వగలిగే యీ రామచంద్ర రావులోని విశేషం ఏమిటి? ఇంత కులాసా, యింత ధీమా ఎక్కడవి అని విస్తుబోయాడు మూర్తి.
 
 సరళకి వివాహమైంది. పెళ్లికి రామచంద్రరావు వెళ్లాడు. వెళ్లి నాలుగు రోజులూ యిటు ఆడపెళ్లివారితో, అటు మగపెళ్లివారితో కలుపుగోలుతనంగా తిరిగాడు. అత్తింటికి వెళుతూన్న సరళతో ‘‘నీ భర్త రూపసి, ఉత్తముడు కూడా. నువ్వు ఎప్పుడూ సుఖంగా ఉండాలని కోరుతున్నాను. వచ్చే ఏడాదికి నువ్వు పాపాయినెత్తుకొని రావాలి సుమా’’ అన్నాడు. అతని స్నేహ స్నిగ్ధ కంఠ స్వరానికి సరళ హృదయం ఆర్ద్రమయింది. కృతజ్ఞతతో సిగ్గుతో ‘‘థాంక్సు’’ అంది.
 కాని రామచంద్రరావు మనసారా కోరిన అదృష్టం ఆమెను వరించలేదు. ఏడాదికే ఆమె విధవరాలై తిరిగి వచ్చింది. రామచంద్రరావు చూడటానికి వెళ్లాడు. ధైర్యం చెప్పాడు. అలాగే ప్రతిరోజూ వెళ్లి ఎన్నో కబుర్లు కథలు చెప్పేవాడు. ఆమె దుఃఖం నుండి కోలుకుంది. ఇంక ఇతని అవసరం తీరిందనుకున్న సరళ తండ్రి రామచంద్రరావుని చాటుగా పిలిచి ‘నువ్వు రోజూ యిలా రావడం బావుండదు.
 
 లోకం ఏదైనా అనుకుంటుంది’ అన్నాడు. రామచంద్రరావు నవ్వుతూ ‘మీరు చెప్పింది నిజమే ఇంక నేను రాను’ అని వెళ్లిపోయాడు. మళ్లీ సరళ దగ్గరకు ఎప్పుడూ వెళ్లలేదు. రామచంద్రరావు ఒక మూడు గదుల వాటా తీసుకొని అద్దెకు ఉంటున్నాడు. ఒక గది వంటగదిగా ఉపయోగించుకుని స్వయంగా వండుకు తింటాడు. తొమ్మిదింటికల్లా స్నానం చేసి భోజనం చేసి తెల్లని దుస్తులు వేసుకుని ఆఫీసుకు బయలుదేరతాడు. దారిలో కిళ్లీకొట్టు పోలయ్యనీ, ప్లీడరు రాఘవ రావుగారినీ, వెంకయ్య మాష్టారినీ, పెరుగమ్ముకుని బతికే గోవిందమ్మనీ అందరినీ నవ్వుతూ పలకరిస్తూ ఆఫీసుకు వెళతాడు.
 
  ఆఫీసులో అందరూ అతని మిత్రులు. ఆఫీసరు కూడా రామ చంద్రరావంటే దయగా అభిమానంగా ఉంటాడు. కాని రామచంద్రరావుని దురదృష్టమే వరించింది. ఆఫీసు రిట్రెంచిమెంటులో పైవాళ్లు అతన్ని ఉద్యోగం నుండి తొలగించి వేశారు. మూర్తి చాలా ఆందోళన చెందాడు. ఇక మీద రామచంద్రరావుకి గడిచే విధానం లేదు. అయినా రామచంద్రరావు ఏమీ బెదిరిపోలేదు. పైగా మూర్తికి అతడు నవ్వుతూ ధైర్యం చెప్పాడు.
 
 ఉద్యోగం పోయిన రెండు రోజులకే రామచంద్రరావు తన స్వగ్రామం వెళ్లాడు. ఓ నెల్లాళ్లపాటు అక్కడే ఉండి, అతని పాత పెంకుటి లోగిలి అమ్మివేసి, మూడు వేల రూపాయలు చేత్తో పట్టుకొని తిరిగి వచ్చాడు. ఈసారి పాత మూడు గదుల పోర్షన్ వదిలేసి ఒక గది అద్దెకు తీసుకున్నాడు. ఒక టైపు మిషన్ కొని, ‘ఇచ్చట టైపు చేయబడును’ అని బోర్డు కట్టాడు. ఈ మూడువేలూ ఎన్నాళ్లు వస్తుంది? ఈ టైపు వల్ల వచ్చే ఆదాయం ఏం సరిపోతుంది? నీ భవిష్యత్తు ఎలాగ? అని ఆతృత కనబరిచాడు మూర్తి.
 
 రామచంద్రరావు నవ్వాడు. ‘‘ఎవరి భవిష్యత్తు మాత్రం ఎవరు చెప్పగలరు మూర్తీ. మనం చేసుకున్న కట్టుదిట్టాలు నిజంగా రక్షిస్తాయా?’’ అన్నాడు.
 రామచంద్రరావు తన స్వగ్రామం వెళ్లిన రోజులలో సరళ తండ్రి చనిపోయి నట్టూ, ఇంటి యాజమాన్యమంతా సుకుమారమైన సరళ మీద పడినట్టూ తెలుసుకున్నాడు. ఒకసారి సరళను చూసి వచ్చాడు.
 
 ఆరు నెలలు గడిచాయి. రామచంద్రరావుకి తీవ్రమైన జబ్బు చేసింది. పదిహేను రోజులైనా జ్వరం తగ్గుముఖం పట్టలేదు. మూర్తి భయపడ్డాడు. తిన్నగా సరళ యింటికి వెళ్లాడు. రామచంద్రరావు పరిస్థితి వివరించి చెప్పాడు.
 
 ‘‘మీరు అతని బాధ్యత వహించాలి. ఒకనాడు మీరు అతన్ని మోసగించారు. కాని అతను ఏనాడూ మిమ్మల్ని నిందించలేదు. డబ్బుతో ఏమైనా కొనవచ్చు గాని అటువంటి అమృత హృదయాన్ని పొందలేము. మృత్యుముఖంలో ఉన్న అతన్ని కనికరించండి. లోకం ఏమనుకుంటుందో అనుకొని సంశయించకండి. ఒక్కడూ ఆ చిన్నగదిలో చీకటిలో బాధతో, వ్యాధితో చితికిపోతున్నాడు. వివేకం కన్న, హేతువు కన్న హృదయ ధర్మం గొప్పది. ఈ సత్యాన్ని ఇప్పుడైనా మీరు తెలుసుకోరా’’ అని మూర్తి ప్రాధేయపడ్డాడు. అతను తల పెకైత్తి చూసేసరికి సరళ చెక్కిళ్లు కన్నీళ్లతో తడిసి ఉన్నాయ్. ‘‘పదండి నేనూ మీతో వస్తున్నాను’’ అంటూ సరళ ఎలా ఉన్నది అలా బయలుదేరింది.
 
 రామచంద్రరావుని జాగ్రత్తగా సరళ ఇంటికి మార్చారు. పక్కగదిలో డాక్టరు ‘ఇతను బతుకుతాడనే నమ్మకం లేద’ని చెప్పడం అప్పుడే మెలకువ వచ్చిన రామచంద్రరావుకి వినిపించింది. భయాందోళనతో కన్నీటితో సరళా, మూర్తీ రామచంద్రరావు దగ్గరకు వచ్చి నిలబడ్డారు.
 
 ‘‘నేను డాక్టరు చెప్పింది విన్నాను. దానికింత భయమెందుకు’’ అన్నాడు రామచంద్రరావు. అతని పెదవుల మీద చిరునవ్వు నిలిచి వుంది. కష్టాల్నీ బాధల్నీ చివరకు మృత్యువును కూడా లక్ష్యం చెయ్యని చిరునవ్వు. అంత ఆందోళనలోనూ ఆశ్చర్యచకితుడయ్యాడు మూర్తి. కాని రామచంద్రరావు సరళ సపరిచర్యలలో, మూర్తి నిరంతర సాన్నిధ్యంలో, పట్నం నుండి పిలిచిన పెద్ద డాక్టర్ల సహాయంతో వ్యాధి నుండి విముక్తుడయ్యాడు. సరళ అతన్ని తన యింట్లో ఉండిపొమ్మని కోరింది, పూర్తిగా ఆరోగ్యం కోలుకునేవరకూ.
 
 మూడు నెలల అనంతరం సంపూర్ణ ఆరోగ్యవంతుడైన రామచంద్రరావు తన కృతజ్ఞతను తెలియజేసి వెళ్లిపోతానన్నాడు. ‘‘నా గదికి వెళ్లిపోతాను మళ్లీ టైపు మొదలుపెట్టాలి. సెలవిప్పించు’’ అన్నాడు.
 
 ‘‘అయితే నేనూ వస్తాను. ఆ ఒక్క గదిలో మనమిద్దరమూ ఎలా ఉండడం?’’ అంది సరళ.
 ‘‘నువ్వు రావడమేమిటి? నాతో ఉండడమేమిటి?’’ అన్నాడు రామచంద్రరావు తెల్లబోయి. ‘‘మరి భార్య భర్తను వదిలి ఉంటుందా?’’ అంది సరళ తలవాల్చి వోరగా చూస్తూ. ఈసారి నిజంగా రామచంద్రరావు సిగ్గుపడి పోయాడు. అతను తెప్పరిల్లి చటుక్కున ఆమెను కౌగిలిలోకి తీసుకున్నాడు. సరళా రామచంద్రరావుల వివాహం నిరాడంబరంగా జరిగింది. మూర్తి ఉత్సాహానికి పట్టపగ్గాల్లేవు.
 
 మొదటి రాత్రి రామచంద్రరావు జుట్టులోనికి వేళ్లు పోనిస్తూ మృదువుగా అడిగింది సరళ... ‘‘మీరు ఎప్పుడూ నవ్వుతూనే వుంటారు. కారణం ఏమిటి నాకు చెప్పరూ?’’
 రామచంద్రరావు కళ్లలో గతస్మృతుల నీడలు బరువుగా నల్లగా కదిలాయి. కిటికీలోంచి చీకట్లోకి అలాగ కొంతసేపు చూస్తూ నిలుచున్నాడు. అతని కంఠస్వరం గంభీరంగా మారిపోయింది.
 ‘‘నా పదహారవయేట నేను, మా అమ్మా, నాన్నా, మా చెల్లెలూ, తమ్ముడూ భద్రాచలం వెడుతున్నాము.
 
  నేను అనారోగ్యంతో సన్నగా నీరసంగా ఉండేవాణ్ని. ఎప్పుడేమయిపోతానో అని అమ్మా నాన్నా భయపడుతుండేవారు. భద్రాచల రాముని దర్శనంతో నేను ఆరోగ్యవంతుణ్ని అవుతానని వారి నమ్మకం. అందుకే భద్రాచలం వెడుతున్నాము. పాపికొండల దగ్గర హఠాత్తుగా మా పడవ బోల్తా కొట్టింది. కారణం ఏమిటో యిప్పటికీ నాకు తెలియదు. నేను స్పృహ లేకుండా ఒక ఒడ్డుకు కొట్టుకుపోయాను.
 
 తెలివి వచ్చేసరికి నా చుట్టూ జనం మూగి ఉన్నారు. మరికాస్త దూరంలో మా తల్లిదండ్రుల సోదర సోదరీ శవాలు పడివున్నాయి. వాళ్లందరూ చచ్చి పోయారు. ఒక్కసారిగా నేను దిక్కులేని వాడినయ్యాను. ఒక్కసారిగా అపార దుఃఖం నన్ను నిశ్చేష్టితుడ్ని చేసి వేసింది. గుండెలు పగిలిపోయినాయ్. మళ్లీ అదే నదిలో దూకి చచ్చిపోదామనుకున్నాను. కాని ఒక మెరుపులాగ నా మనస్సులో ఏదో మెరిసింది. ఈ సృష్టి ఈ జీవితము అంతా ఒక హాస్యం. దీనికి ఒక నియమమూ నిర్ణీత పద్ధతీ అంటూ లేవు. ఉన్నా మనకి తెలియదు.
 
  మనం తెలుసుకోలేము. ఎవరో తెర వెనుక నుండి మనల్ని యిలా ఆడిస్తున్నారు. ఇది పెద్ద జోక్ - నవ్వులాట. లేనిదే అనారోగ్యంతో ఎప్పుడేమవుతానో అన్న నేను బతకడమేవిటి? నిండు ఆరోగ్యంతో ఆశలతో ఉన్నవాళ్లు పోవడమేమిటి? ఈ అద్భుతమైన హాస్య నాటకములో నేనూ ఒక పాత్రని. కష్టాలకీ భయాలకీ రేపటి బాధలకి ఆందోళన చెందడం ఎంత తెలివితక్కువ సరళా? ఈ కాస్సేపటి బతుకునీ సంకుచితత్వంతో సందేహంతో ద్వేష విషంతో నింపుకోవడం ఎంత మూర్ఖత్వం సరళా.’’
 
 ఈ మాటలకి సరళ చలించిపోయింది. విద్యుద్దీపాల కాంతిలో అతని కళ్లు చెమ్మగిల్లినట్లు అనిపించిందామెకు. అతన్ని గుండెలకు హత్తుకుని, ‘‘నేను నిన్ను వదలను రామం’’ అని ఆవేశంగా అంది.
 రామచంద్రరావు చల్లగా నవ్వాడు తెల్లని మల్లెపూవు విరిసినట్లు, స్వచ్ఛమైన హిమకరణం సూర్యరశ్మిలో మిలమిల మెరిసినట్టు.
 సరళకి అర్థమయింది - అతని నవ్వు వట్టి నవ్వు కాదని. అతని నవ్వు వెనకాల భయంకర విషాదముంది. వేదాంతం వుంది.
 కాని యీనాటి వరకూ మూర్తికి మాత్రం అతని నవ్వుకి కారణం తెలియదు పాపం!

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement