లైక్‌ షేర్‌ షేక్‌ ఇట్‌ | Social Revolution | Sakshi
Sakshi News home page

లైక్‌ షేర్‌షేక్‌ ఇట్‌

Published Sat, Jul 22 2017 11:42 PM | Last Updated on Thu, Jul 26 2018 5:23 PM

లైక్‌ షేర్‌ షేక్‌ ఇట్‌ - Sakshi

లైక్‌ షేర్‌ షేక్‌ ఇట్‌

సోషల్‌ రివల్యూషన్‌!

ట్విట్టర్‌లో ఒక మంచి ట్వీట్‌ కనబడింది. మనకిష్టమైనది అది. లైక్‌ ఇట్‌! ఫేస్‌బుక్‌లో ఎవరో ఓ మంచి పనికి అండగా నిలబడ్డారు. షేర్‌ ఇట్‌!!ఎక్కడో ఎవరో ప్రభుత్వాన్ని పశ్నించాలనుకున్నారు. ఇంకెక్కడో ఎవరో మార్పు కోసం ఉద్యమం మొదలుపెట్టారు.మరెక్కడో ఇంకెవరో మంచిని బతికిద్దాం. పోరాడదాం రండి అన్నారు.షేర్‌ ఇట్‌.. షేర్‌ ఇట్‌.. షేర్‌ ఇట్‌.. మంచి కోసం వేసే అడుగులవి. చెడుపై చేసే పోరాటమది. గెలుపు వైపుకు తీసుకెళ్ళే కుదుపు అది. యూ షేక్‌ ఇట్‌. అదే సోషల్‌ రివల్యూషన్‌.

‘అమ్మకు ఉత్తరం రాసి రెండు వారాలైంది. అది అందిందో లేదో? నేనిక్కడ బాగానే ఉన్నానని తనకింకా  తెలిసిందో లేదో?’ టెక్నాలజీ అభివృద్ధి చెందాక ఇలాంటి మాటలేం కనిపించట్లేదు. అలా అని ఆ మాటల్లో ఉన్న ప్రేమ కనిపించకుండాపోలేదు. ఆ ప్రేమ తరానికి తరానికి మధ్య ఒక్కో దారిని ఎంచుకుంటూ, ఒక్కోవిధంగా సాగిపోతూనే ఉంది. ఆగిపోయే ప్రేమలే ఉంటే, మనిషనే వాడే ఉండడు. ఆ ప్రేమలలా సాగాలని కోరుకుంటున్నాం కాబట్టే మనకు కావాల్సిన ఇష్టమైన దారులు వెతుక్కుంటున్నాం.ఈ డిజిటల్‌ యుగంలో మనం వెతుక్కున్న అలాంటి ఒక దారి.. సోషల్‌ మీడియా.ఒక విప్లవంలా మన జీవితాల్లోకి చొచ్చుకొచ్చిన ఈ సోషల్‌ మీడియా.. ఒక వ్యక్తి సమాజానికి నేర్పే, ఒక సమాజం వ్యక్తికిచ్చే, ఒక సమాజం ఇంకో సమాజం నుంచి తీసుకునే  విలువలు, లక్షణాలు, అవసరాలకు దారినిచ్చింది, ఇస్తూనే ఉంది.

మనం ఎలా దాన్ని అర్థం చేసుకున్నా, మనకు ఈ సోషల్‌ మీడియా కొన్ని కొత్త విషయాలను పరిచయం చేసింది. కొన్ని అవసరమైన విషయాలను నేర్పింది. అలాంటివి కొన్ని..! విప్లవాన్ని నేర్పింది... ప్రశ్నించడాన్ని అలవాటు చేసింది..!విప్లవం మొదలయ్యేది ఒక్కడితోనే! అయితే ఆ ఒక్కడి చుట్టూ ఓ పదిమంది ఉండాలి. ఆ పదిమందికీ ఓ వందమంది తోడవ్వాలి. ఆ వందమందికి ఓ వెయ్యి మంది సపోర్ట్‌ ఇస్తూ ఉండాలి. అప్పుడే విప్లవం విజయం వైపు దారితీస్తుంది. సోషల్‌ మీడియా ఇలాంటి ఎన్నో విప్లవాలకు ఊతమిచ్చింది. ఈజిప్టు రివల్యూషన్‌ గుర్తుంది కదా? ప్రభుత్వంపై ప్రజల తిరుగుబాటు ఒక ఉద్యమంలా మారి అధ్యక్షుడిని పదవి నుంచి దించిన విప్లవం అది.

హోస్నీ ముబారక్‌ ప్రభుత్వం ఆగడాలు పెరిగిపోయాయి. ప్రభుత్వాన్ని ఎదిరించే ప్రయత్నం చేసిన వారిపై దాడులు మొదలయ్యాయి. హింస తారస్థాయికి చేరిపోయింది. ఇది చూసి చలించిపోయాడు వేల్‌ గోనిమ్‌ అనే ఓ యువకుడు. ఇప్పటి సమాజమంతా కనెక్ట్‌ అయి ఉన్న సోషల్‌ నెట్‌వర్క్స్‌లో భాగమైన ఫేస్‌బుక్‌ను వేదికగా చేసుకొని తిరుగుబాటు మొదలుపెట్టాడు. ఆ తిరుగుబాటుకు నెటిజన్ల నుంచి ఊహించని స్థాయి స్పందన వచ్చింది. ఒక్కడితో మొదలైన తిరుగుబాటు రోజురోజుకీ లక్షలాదిమంది సపోర్ట్‌ సంపాదించుకుంటూ వచ్చింది. జనం రోడ్లపైకి వచ్చి ప్రభుత్వం దిగిపోవాలని నినాదాలు చేశారు. 2011 జనవరి 25 నుంచి ఫిబ్రవరి 11 వరకు రెండు వారాలు జన నినాదం హోరెత్తింది. ఆ దెబ్బకు హోస్నీ ముబారక్‌ తన పదవికి రాజీనామా చేసి తప్పుకున్నాడు. సోషల్‌ మీడియాను వేదికగా చేసుకొని ఒక సమాజం చేసిన విజయవంతమైన విప్లవం అది. ప్రశ్నించడాన్ని అలవాటు చేసిన విప్లవం అది.

కొద్దినెలల క్రితమే ఫేస్‌బుక్‌లో ఇండియన్‌ జవాన్‌ తేజ్‌ బహుదూర్‌ వేసిన ఓ పోస్ట్‌ ప్రభుత్వాన్ని పరుగులుపెట్టించిన విషయం గుర్తుందా? రాత్రనకా, పగలనకా సరిహద్దుల్లో దేశం కోసం పోరాడుతున్న సైనికులకు అందించే భోజనం విషయంలో అధికారులు ఎంత అజాగ్రత్త కనబరుస్తున్నారో తెలియపరచిన పోస్ట్‌ అది. అలాంటి భోజనం చేయలేక, ఖాళీ కడుపుతో పడుకొని, వణికించే మంచులో, దేశం కోసం ఓ జవాన్‌ ఎలా పోరాడతాడనుకున్నారంటూ సోషల్‌ మీడియా విరుచుకుపడింది. ఢిల్లీ పెద్దలందరికీ వినిపించింది సోషల్‌ మీడియా అరుపు. మార్పొచ్చిందిప్పుడు.

అదేవిధంగా సోషల్‌ మీడియాను వేదికగా చేసుకొని భారతదేశంలో అవినీతిపై ఉద్యమం జరిగింది. నిర్భయ ఘటనపై తమ గొంతుకను వినిపించి, నిర్భయ చట్టం తెచ్చేవరకూ ఓ సామాన్యుడు చేసిన పోరాటానికి సోషల్‌ మీడియానే ఉపయోగపడింది. అమెరికాలో ప్రభుత్వ తప్పులను ఎత్తి చూపడం దగ్గర్నుంచి, మధ్యప్రదేశ్‌లో రైతు సమస్యల గురించి ప్రభుత్వంపై ఒత్తిడి పెంచే వరకూ సామాన్యుడికి సోషల్‌ మీడియానే మొదటి వేదికగా కనిపిస్తోంది. ఇప్పుడు మీరిది చదువుతున్న సమయానికి కూడా ఎక్కడోక్కడ సోషల్‌ మీడియా వేదికగా ఏదో ఒక ఉద్యమం నడుస్తూనే ఉంటుంది.ప్రశ్నించడం మానేసి అన్నింటికీ సర్దుకుపోవడం అలవాటైన సగటు మనిషికి ఇప్పుడు సోషల్‌ మీడియా మళ్ళీ ప్రశ్నించడాన్ని అలవాటు చేసింది.

మనుషుల్ని ఒక్కటి చేసింది..!
అలన్‌ కుర్ది. 2015 సెప్టెంబర్‌ నెలలో ప్రపంచవ్యాప్తంగా ఈ పేరు తలుచుకుని బాధపడని వారుండరు. సిరియాలో జరుగుతున్న సివిల్‌ వార్‌తో అక్కడి ప్రజలు బతుకు భారంగా గడపాల్సిన పరిస్థితుల మధ్య వినిపించిన పేరది. సిరియాలో ఇక బతికే పరిస్థితి లేదనుకున్న అలన్‌ కుర్ది తండ్రి అబ్దుల్లా కుర్ది కుటుంబంతో కలసి దేశాన్ని వదిలేందుకు సిద్ధమయ్యాడు. కెనడాలో తన సోదరి వద్దకు అబ్దుల్లా వెళ్ళాలని ప్రయత్నించినా, ఆ దేశం అందుకు అనుమతించలేదు.

దీంతో ఒక పెద్ద పడవపై తన పిల్లలతో కలసి అబ్దుల్లా యూరప్‌కు వలస వెళ్ళేందుకు బయలుదేరాడు. టర్కీలోని బోర్డమ్‌ ప్రాంతంలో వారు ప్రయాణిస్తున్న పడవ మునగడంతో అబ్దుల్లా మూడేళ్ళ కుమారుడు అలన్‌తో సహా మరికొందరు మృత్యువాత పడ్డారు. సరిగ్గా అదే సమయంలో టర్కీ ఫొటోగ్రాఫర్‌ నీలోఫర్‌ డెమిర్‌ బీచ్‌లో ప్రాణాలు కోల్పోయి ‘ప్రశాంతంగా’ పడి ఉన్న అలన్‌ను ఫొటో తీశాడు. ఆ ఫోటోను తర్వాత సోషల్‌ మీడియాలో షేర్‌ చేయగా ప్రపంచమంతా దాని గురించి మాట్లాడింది. సిరియా సంక్షోభాన్ని ప్రపంచానికి పరిచయం చేసిన ఫోటో అది.

ఆ ఫొటో చూసి చలించిన వారంతా సోషల్‌ మీడియాలో ఒక ఉద్యమమే తీసుకొచ్చారు. మనిషి ఎక్కడైనా ఒక్కటే అని చెబుతూ ప్రపంచదేశాల రాజకీయ ఆటలను జనం దుమ్మెత్తిపోశారు.ఆసియా, యూరప్‌ దేశాలన్నీ సిరియా సంక్షోభం గురించి మాట్లాడేలా, సిరియా వలసవాదులకు ఓ దారి చూపించేలా సోషల్‌ మీడియా ఉద్యమం పనిచేసింది.ప్రపంచంలో ఒక మనిషి ఎక్కడికెళ్ళినా కనిపించేది ఇంకో మనిషేనని, బాధ – సంతోషం ఒక మనిషిదంటే అది అందరిదీ అని అలన్‌ కుర్ది ఘటన చెప్పకనే చెప్పింది. ఇలాంటి సంఘటనలెన్నో మనుషుల్ని ఒక్కటి చేసింది, మనిషి కోసం బతకమని.

ప్యాషన్‌కు దారిచూపింది..!
ప్రతి మనిషికీ ఏదో ఒక ప్యాషన్‌ ఉంటుంది. తిక్క అన్నా, మరింకేమన్నా తమ ప్యాషన్‌ వైపుకు ఎలా అడుగులు వేయాలా అని తపిస్తూంటారంతా. వారందరికీ సోషల్‌ మీడియా ఒక దారి చూపిస్తోంది. తన్మయ్‌ భట్‌కి నవ్వించడమంటే ఇష్టం. తనే రాసుకొని తనదైన కామెడీ టైమింగ్‌తో కామెడీ పండించగలడతడు. సోషల్‌ మీడియాని వేదికగా చేసుకొని తన ప్రతిభను ప్రపంచానికి చాటాలనుకున్నాడు. ఏఐబీ పేరుతో ఓ యూట్యూబ్‌ చానల్‌ మొదలుపెట్టి వీడియోలు చేశాడు. ఇప్పుడు ఇండియాలో అతనొక పెద్ద స్టార్‌. ఫోర్బ్స్‌ జాబితాలో చోటు సంపాదించుకున్నాడు కూడా.

 చెఫ్‌ సంజయ్‌ తుమ్మ కూడా తన కొత్త కొత్త వంటలను ప్రపంచానికి పరిచయం చేసేందుకు సోషల్‌ మీడియానే ఎంచుకున్నాడు. ఆయనా ఇప్పుడు సోషల్‌ మీడియాలో పెద్ద స్టార్‌. ఇండియాలోనే ఇలా ఉంటే ఇక పాశ్చాత్య దేశాల్లో సోషల్‌ మీడియాతోనే స్టార్స్‌  అయిన వారికి లెక్కే లేదు. ‘ఓపెన్‌ గాంగ్నమ్‌ స్టైల్‌’ అంటూ సందడి చేసిన మ్యూజిషియన్‌ సై (్క ్గ) సోషల్‌ మీడియా ద్వారానే పాపులర్‌ అయిన సూపర్‌స్టార్‌. చైనాలో సోషల్‌ మీడియా స్టార్స్‌ను ‘వాంగ్‌ హాంగ్స్‌’ అని పిలుస్తారు. సోషల్‌ మీడియాను వేదికగా చేసుకొని కోట్లు సంపాదిస్తోన్న వారు వాంగ్‌ హాంగ్స్‌.

బంధాలను బలపరిచింది..!
మన ఊరికి 75 కి.మీ. దూరంలో ఉన్న పెద్దమ్మను ఊరెళ్ళి పలకరించి ఎంత కాలమైంది? చిన్నప్పుడు మనతో స్కూల్‌లో చదువుకున్న ఫ్రెండొకడు ఇప్పుడు అరబ్‌ దేశంలో ఉన్నాడు. ఎలా ఉన్నాడో? మనదనే చిన్న ప్రపంచం కాస్త బిజీ అయిపోయాక, మన నుంచి కొంత బయటకొచ్చి చూస్తే, మిగతా ప్రపంచాలన్నీ ఎలా ఉన్నాయో అని అప్పుడప్పుడూ ఆలోచిస్తూంటాం కదూ!? ఇప్పుడైతే సోషల్‌ మీడియా ఉంది కాబట్టి అనుకున్న క్షణమే వాళ్ళెలా ఉన్నారో తెల్సుకుంటాం. మాట్లాడుకోకపోయినా వాళ్ళ లైఫ్‌ ఎలా ఉందో తెలుస్తూం టుంది. మనమెలా ఉన్నామో మన ఫొటోలు వాళ్ళకు చేర వేస్తాయి. వాళ్ళిలా ఉన్నారని వాళ్ళ ఫొటోలు మనకి కనిపిస్తూం టాయి. సోషల్‌ మీడియా.. బంధాలను చెడగొట్టిందని చెప్పుకుం టాం కానీ, నిజానికి అది బంధాలను ఇంత బిజీ లైఫ్‌లోనూ బలోపేతం చేసింది. తాజాగా అమెరికాలో నిర్వహించిన ఓ సర్వేలో 74.3%మంది పెళ్ళైన జంటలు, సోషల్‌ మీడియా తమ బంధాన్ని మరింత బలపరిచాయని చెప్పుకొచ్చారు.

మానవత్వాన్ని బతికించింది..!
2014లో ఒహాయోలో నాదల్‌ స్టీఫెన్‌ అనే వ్యక్తి రెడ్డిట్‌ డాట్‌ కామ్‌ అనే సోషల్‌ నెట్‌వర్క్‌లో ఓ కోరిక కోరాడు. తనకు ఒక పాప పుట్టి, 20రోజుల పాటు చావు బతుకులతో పోరాడి చనిపోయిందని, పుట్టిననాటి నుంచి ఆ పాపను ఆక్సిజన్‌ పైపులతోనే చూశానని, ఎవరైనా తన పాప ఫోటోను ఎడిట్‌ చేసి, ఆక్సిజన్‌ పైపులు లేకుండా తనెలా ఉంటుందో చూపించమని అడిగాడు. ఈ పోస్ట్‌ చూసి వేలాది మంది చలించిపోయారు. ఫోటోషాప్‌ చేసిన ఫోటోలు వేలకొలది వచ్చి పడ్డాయి. దాదాపు నెలరోజుల పాటు ఆ పోస్ట్‌కు స్పందనలు వస్తూనే ఉన్నాయి. అదిచూసిన స్టీఫెన్‌ ఒక మాటన్నాడు..‘నా పాప చనిపోయినా, మీ అందరూ చూపిన ప్రేమకు తను ఇంకా బతికి ఉన్నట్టే అనిపిస్తోంది. అవును.. మానవత్వం బతికే ఉంది.’
∙∙
విజయవాడలో ఉండే దుర్గా భవాని, బాలరాజు దంపతుల కుమారుడు పవన్‌కు ఆరేళ్ళ వయసులో జబ్బు చేసింది. దగ్గర్లోని హాస్పిటల్‌లో చేర్పిస్తే లివర్‌ దెబ్బతిందని, ట్రాన్స్‌ప్లాంటేషన్‌ చేయాలని, దానికి రూ. 25 లక్షల దాకా ఖర్చవుతుంది చెప్పారు. పవన్‌ తండ్రి దగ్గర అంత డబ్బు లేదు. తన లివర్‌ సెగ్మెంట్‌ని అయితే ఇవ్వగలడు కానీ, డబ్బు ఎక్కడి నుంచి తేవాలో తెలియలేదు. అదే సమయంలో ‘ప్రయత్న ఫర్‌ ఏ ఛేంజ్‌’∙పేరుతో అప్పటికే ఫండ్‌ రైజింగ్‌ కోసం సోషల్‌ మీడియా క్యాంపెయిన్స్‌ నడిపిస్తోన్న జె. రాఘవేంద్ర ఈ విషయాన్ని తెలుసుకొని ‘సేవ్‌ మాస్టర్‌ పవన్‌’ పేరుతో ఒక క్యాంపెయిన్‌ మొదలు పెట్టాడు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి, ప్రధానమంత్రి ఫండ్స్‌ నుంచి వచ్చిన డబ్బులు కాక మరో 10 లక్షల రూపాయల దాకా అవసరమయ్యాయి.

అవన్నీ సోషల్‌ మీడియాలోనే వేలాదిమంది షేర్‌ చేయగా, వందలమంది విరాళాలు ఇవ్వగా సమకూరాయి. గ్లోబల్‌ హాస్పిటల్‌ డాక్టర్ల సహకారం కూడా దీనికి తోడవ్వడంతో గత ఏడాది నవంబర్‌లో పవన్‌ ఆపరేషన్‌ విజయవంతం అయింది. ఇప్పుడు పవన్‌ ఆరోగ్యంగా ఉన్నాడు. రోజూ స్కూల్‌కి కూడా వెళుతున్నాడు. ‘‘మా పరిస్థితి తెలుసుకొని ఎక్కడి నుంచి వచ్చాడో తెలియదు కానీ రఘు బాబు ఎంతో కష్టపడి బాబుకు నయమయ్యేలా చేశాడు. నెట్‌లో అన్నిచోట్ల పెట్టి మాకు అవసరమైన డబ్బులు తెప్పించాడు.’’ అంటోన్న దుర్గా భవాని మాటలు ఎంత అందంగా ఉన్నాయి! ఒకరికి సాయం చేయాలన్న ఆలోచనతో రాఘవేంద్ర ఎంచుకున్న మార్గం ఎంతమందిని కదిలించిందీ!! ఇలాంటి ఎందరో పవన్‌ల నవ్వు చూసి çపడే సంబరమే కదా.. సోషల్‌ రివల్యూషన్‌!!!

జనం ఇచ్చింది... జనం కోసమే పంచాడు..!
మార్క్‌ జూకర్‌బర్గ్‌ పేరు తెలియని వారుండరు. ఫేస్‌బుక్‌ను స్థాపించి మన జీవితాల్లో సంచలనమైన మార్పు తీసుకొచ్చిన జూకర్‌బర్గ్, ఆ ఫేస్‌బుక్‌తోనే బిలియనీర్‌గా అవతరించారు. 2015లో తనకు కూతురు పుట్టిన సందర్భంగా జూకర్‌బర్గ్‌ చేసిన ఓ ప్రకటన అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆ ప్రకటనలో ఫేస్‌బుక్‌లో తన వాటాలోని మొత్తంలో 99% షేర్స్‌ను చారిటీకి ఉపయోగించనున్నట్లు స్పష్టం చేశారాయన. ఇందుకోసం భార్య చాన్‌తో కలిసి జూకర్‌బర్గ్, ‘చాన్‌ జూకర్‌బర్గ్‌ ఇనిషియేటివ్‌’ పేరుతో ఓ సంస్థను స్థాపించారు. ఫేస్‌బుక్‌ ద్వారా వచ్చిన సంపదను, జనం కోసమే పంచాలని జూకర్‌బర్గ్‌  తీసుకున్న ఈ నిర్ణయం వ్యక్తిగా ఆయన స్థాయిని మరింత పెంచింది.

తెలుగు రాష్ట్రాల్లో సోషల్‌ రివల్యూషన్‌!
టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో తెలుగు వారు ఎప్పుడూ ముందే ఉంటూ వస్తున్నారు. ఇప్పుడు సోషల్‌ మీడియాను వాడుకోవడంలోనూ అదే ఉత్సాహం కనబరుస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ఉద్యమకాలం నుంచే సోషల్‌ మీడియా బాగా ప్రాచుర్యంలోకి రాగా, ఇప్పుడు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రెండు రాష్ట్రాలయ్యాక సోషల్‌ మీడియా ప్రభావం బాగా పెరిగింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో భూఆక్రమణ, రైతు సమస్యలకు సంబంధించిన పోస్ట్‌లు గత రెండు సంవత్సరాలుగా ఎక్కువగా కనిపిస్తున్నాయి. అధికార పార్టీ టీడీపీ వైఫల్యాలను ప్రశ్నించడానికి సామాన్యుడు సోషల్‌ మీడియానే ప్రధానంగా వాడుకుంటున్నాడు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం సోషల్‌ మీడియాలో వచ్చే కొన్ని ఈ తరహా పోస్ట్‌లపై ఆంక్షలు విధించింది. ఇది ఫ్రీడం ఆఫ్‌ స్పీచ్‌కు వ్యతిరేకమని ప్రతిపక్ష పార్టీ వైఎస్సార్‌సీపీ పలు ఆందోళనలు కూడా చేపట్టింది.

ట్రంప్‌పై ట్రోల్స్‌ అన్నీ ఇన్నీ కావు..!
అమెరికా ప్రెసిడెంట్‌ ఎలక్షన్‌ వచ్చిందంటే సోషల్‌ మీడియాకు ఓ కొత్త కళ వచ్చిపడుతుంది. అధ్యక్ష పదవికి పోటీకి నిలబడ్డ వారి ప్రతీ విషయం నెటిజన్‌కు ఒక ట్రోలింగ్‌ ఆప్షనే! గతేడాది అమెరికా ఎన్నికల్లో డొనాల్డ్‌ ట్రంప్, హిల్లరీ క్లింటన్‌ల మధ్య పోటీ కూడా సోషల్‌ మీడియాలో రోజూ హాట్‌ టాపిక్‌గా నడిచింది. ముఖ్యంగా ట్రంప్‌పై అమెరికా ప్రజలతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న నెటిజన్ల నుంచి పెద్ద ఎత్తున ట్రోల్స్‌ వచ్చాయి. ఆయన అధ్యక్షుడిగా ఎన్నికయ్యాక కూడా ఈ ట్రోల్స్‌ ఇప్పటికీ అలాగే సాగుతున్నాయి. రిపబ్లికన్‌ పార్టీ ట్రంప్‌ను అధ్యక్ష ఎన్నికలో అభ్యర్థిగా ప్రకటించిన నాటి నుండి ఇప్పటివరకూ ప్రతిరోజూ ఆయనపై ఏదో ఒక ట్రోల్‌ వస్తూనే ఉంది.
– వి. మల్లికార్జున్‌

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement