ఉన్నట్టుండి ఇప్పుడు అకస్మాత్తుగా గుప్తుల పాలన ‘స్వర్ణయుగం’ అన్న స్పృహ పాలకులకు ఎందుకొచ్చినట్లు? నిజంగా గుప్తరాజుల కాలం ‘స్వర్ణయుగ’మేనా? స్వర్ణయుగం అన్న భావనే బ్రిటిష్ పాలకుల కల్పన. గుప్తరాజులూ సామ్రాజ్యవాదులే. గుప్తులు స్వయంగా పాలనాపరంగా తమ ముద్ర వేసుకొన్న భౌతికమైన ఆధారాలు లేవుగాక లేవు. గుప్తరాజులంతా సామ్రాజ్యాల విస్తరణలో సామాన్య ప్రజల్ని ఏదో ఒక రూపంలో దోచుకున్నవారే, వారి సంపదను కొల్లగొట్టి దాచుకుని, అనుభవించిన వారే. కుల వర్ణ వ్యవస్థలు వేళ్లూనుకున్న , బౌద్ధధర్మాన్ని ధ్వంసం చేసిన గుప్తుల కాలమే నేటి భారతదేశానికి ‘ఆదర్శ’మని భావించి, దానిని ‘జాతీయవాద పతాక’గా అభినవ భారత పాలకులు చెప్పదలిస్తే మాత్రం అంతకన్నా చరిత్ర వక్రీకరణ మరొకటి ఉండదేమో!
‘‘భారతదేశ చరిత్రను సవరించకుండా మమ్ములను అడ్డుకునేదెవరు? 1857 నాటి తిరుగుబాటుకు భారతీయ దృక్పథాన్ని అందించినవాడు వినాయక్ దామోదర్ సావర్కార్. ఆ తిరుగుబాటును తొలి స్వాతంత్య్ర సమరంగా ఆయన దర్శించకపోతే బ్రిటిష్ పాలకుల కళ్లతోనే ఆ సమరాన్ని చూడవలసి వచ్చేది. కాబట్టి మనం చరిత్రను తిరగరాయడానికి మనకు అడ్డొచ్చేదెవరు? పరదేశీయులైన హూణుల దండయాత్రల నుంచి దేశాన్ని కాపాడినవాళ్లు గుప్త రాజు వీరస్కంద గుప్త విక్రమాదిత్య. దురదృష్టవశాత్తు దేశ చరిత్రలో సుదీర్ఘకాలంపాటు ప్రజలు బానిసత్వాన్ని అనుభవించిన తరువాత కూడా సామ్రాట్ స్కందగుప్త గురించి మన పాఠ్యగ్రంథాలలో చదువుకోవడానికి నేడు పట్టుమని వంద పేజీలు కూడా దొరకని పరిస్థితి. కశ్మీర్‌కు స్వేచ్ఛను ప్రసాదించినవాడు స్కందగుప్తుడేనని నా నమ్మకం’’
– కేంద్ర హోం మంత్రి అమిత్ షా లక్నో సెమినార్‌లో ప్రకటన
‘‘గుప్త రాజుల పాలనా శకం ‘స్వర్ణయుగం’ అన్న భావన భార తీయులలో పుట్టింది కాదు, అది బ్రిటిష్ పాలకుల కల్పన. బ్రిటిష్ సివిల్ ఉద్యోగి, చరిత్రకారుడైన విన్సెంట్ స్మిత్ కల్పన. స్మిత్ భారతదేశ నాగరి కతకు చెందిన అనేకానేక అంశాలపట్ల ఎలాంటి ఆర్ద్రత, అనుకంపన లేనివాడు. అతడిది ఎంతసేపూ వలస పాలకుల దృష్టి, ఆ దృష్టినుంచే, వలస పాలనకు అనుకూలంగానే బ్రిటిష్ పెత్తనం కొనసాగించుకోవడా నికి వత్తాసుగా గుప్తుల కాలాన్ని స్తుతించాడు. ఎందుకంటే గుప్త రాజులూ సామ్రాజ్యవాదులే. గుప్తులు స్వయంగా పాలనాపరంగా తమ ముద్ర వేసుకొన్న భౌతికమైన ఆధారాలు లేవుగాక లేవు’’
– మైఖేల్ ఉడ్, చరిత్రకారుడు, ‘ది స్టోరీ ఆఫ్ ఇండియా’ 2007
దేశంలో ఇటీవలి కాలంలో బీజేపీ–ఎన్డీఏ పాలకులు ‘ఒక దేశం–ఒకే ఎన్నిక’ నినాదానికి క్రమంగా ఉద్యమరూపమిచ్చినప్పుడే, ‘ఒకే పార్టీ–ఒకే నేత’ అన్న అనంతర భావం రూపకల్పనకు కూడా నర్మ గర్భంగానే సమాయత్తమవుతున్నట్టు కన్పిస్తోంది. ఇప్పుడు అకస్మా త్తుగా గుప్తుల పాలన ‘స్వర్ణయుగం’ అన్న స్పృహ ఎందుకొచ్చినట్లు? నిజంగా గుప్తరాజుల కాలం ‘స్వర్ణయుగ’మేనా? ఈ ప్రశ్నకు సమా ధానం చెప్పుకోవడానికి ముందు, ‘అవును– స్కందగుప్త విక్రమాది త్యుని’ చరిత్రలో ఆసక్తిని పునరుద్ధరించాల్సిందేనని అమిత్ షా ప్రకట నకు స్పందనగా, చరిత్రను తిరగరాసే కృషిలో భాగంగా స్కంద గుప్త చక్రవర్తి జీవిత చరిత్రను ఒక ఇతిహాసంగా రాసిన ఒక ప్రొఫెసర్ రాకేష్ ఉపాధ్యాయ గ్రంథం ప్రస్తావన కూడా ముందుకు దూసుకుని రావటం విశేషం. ముఖ్యంగా ‘జమ్మూ–కశ్మీర్’ ప్రత్యేక రాష్ట్ర ప్రతి పత్తిని రద్దుచేసి, ఫెడరల్ రాజ్యాంగ స్ఫూర్తిని క్రమంగా ధ్వంసం చేస్తున్న ప్రస్తుత పాలకులకు, ఇప్పటిదాకా మనం ఎరుగని ఒక ఆచార్యుడు కొత్తగా స్కందగుప్త చక్రవర్తి చరిత్రలో పాఠకులకు ఆసక్తి ఎందుకు కలిగించాల్సి వస్తోంది? గుప్తుల పాలనా శకం క్రీ.శ. 300– 550 సంవత్సరాల మధ్య. ఆనాటి చక్రవర్తులు లేదా రాజులంతా సామ్రాజ్యాల విస్తరణలో సామాన్య ప్రజల్ని ఏదో ఒక రూపంలో దోచుకున్నవారే, వారి సంపదను కొల్లగొట్టి దాచుకుని, అనుభవిం చినవారే. విదేశీ దండయాత్రీకుల్నే గాదు, స్వదేశీ పోటీ రాచరిక శక్తుల్ని ఎదిరించి ధ్వంసం చేసి, తమ రాజ్యాల్ని విస్తరించుకున్నవారే. ఇరుగుపొరుగు ఆదివాసీ తెగల్ని, వారి ఆవాసాలను, భూములను ధ్వంసంచేసి, మూలవాసుల జానపద సంస్కృతీ మూలాల్ని అంది నంతమేరకు దోచుకుని ధ్వంసం చేసినవారే. ఈ స్వదేశీ దండయాత్ర లలో ఆరితేరిన వారిలో గుప్త రాజులు మినహాయింపు కారు. ఒక్క గ్రీకులే కాదు, హూణులే కాదు, పిండారులే కాదు, కాలానికి కత్తుల వంతెనలు కట్టిన నరహంతకులు దేశీయంగానూ ఉన్నారు. ఆమాట కొస్తే విదేశీ హూణులే కాదు, స్వదేశీ సంకర చక్రవర్తులు, రాజులు కూడా అనేక దేశీయ మూలవాసులైన ఆదివాసీ తెగలు సంస్కృతినీ, ఉనికినీ దెబ్బతీసినవారే. క్రీ.శ.455లో సామ్రాజ్య దండయాత్రలలో భాగంగా హూణులు జరిపిన దండయాత్రలతోపాటు, దేశీయంగా గుప్త రాజులు కూడా అసంఖ్యాక దేశీయ తెగలను, మూలవాసులను, వారి సంస్కృతిని ధ్వంసం చేసి భూములను స్వాధీనపరచుకుని అనుభవించినవారేనని మరచిపోరాదు.
కొత్తగా అమిత్ షా చెబుతున్న చరిత్ర ‘పునరుద్ధరణ’ కృషికి తోడునీడగా ఆచార్య రాకేష్ ఉపాధ్యాయ తన గ్రంథం రాజకీయ ప్రయోజనం ఏమిటో ఇలా చెప్పక చెప్పుకున్నారు: ‘‘రాజకీయ అధి కారం లేకుండా దేశ సంస్కృతి లేదు, ఆ సంస్కృతి లేకుండా అధికా రమూ ఉండదు. అలాగే సంస్కృతిని కాపాడుకోవాలంటే రాజకీయం ఉండాలి, అలాగే సంస్కృతిని నిలబెట్టుకోకుండా రాజకీయానికి అర్థం లేదు’’. మరి ఏ ‘సంస్కృతి’ని ఏ ‘రాజకీయాన్ని’ కాపాడుకుందాం? రాచరికపు సంస్కృతినా, అరాచకపు రాజకీయాల్నా? అందుకే ప్రసిద్ధ చరిత్రకారుడు మైఖేల్ ఉడ్ (2007) గుప్తరాజులు ‘‘ఇవీ మేం స్వయంగా నెలకొల్పి, కాపాడిన భౌతిక సంపదకు దాఖలాలు అని చెప్పగల్గిన ఉదాహరణలేవి? అక్కడక్కడా చెదురుమదురుగా కని పించే చిన్న చిన్న గుళ్లు తప్ప మరెక్కడా ‘ఇదీ గుప్తుల వారసత్వ సంపద’ అని చెప్పదగిన వారెవరైనా ఉన్నారా? నిర్మించిన మహా ప్రాసాదాలు లేవు, ప్రజల ఆస్తులనదగిన పబ్లిక్ బిల్డింగ్స్ లేవు, కేవలం గుహలు, శిథిలమైన స్తూపాలు. అంతేగాని గుప్తుల దైనందిన జీవన విధానం గురించిగానీ, తమ సామ్రాజ్య పాలనా పద్ధతుల గురించిగానీ, న్యాయవ్యవస్థ తీరుతెన్నుల గురించిగానీ, పోనీ వారు దేశీయంగా లేదా విదేశాలతో జరిపిన వర్తక వాణిజ్యాల నిర్వహణ పద్ధతుల గురించిగానీ మనం తెలుసుకునేందుకు ఎలాంటి ఆనవాళ్లూ మనకు దొరకవు’ (ది స్టోరీ ఆఫ్ ఇండియా). ఈ పతనానికి కారణం ఏమై ఉంటుంది? స్కందగుప్తుడు క్రీ.శ. 5వ శతాబ్ది మధ్యలో ఆహార సేకరణలో ఉన్న అనేక తెగలను, ప్రాచీన జాతులను దారుణంగా అణచివేశాడని భారత్ సుప్రసిద్ధ చరిత్రకారుడు డి.డి. కోశాంబీ పేర్కొ న్నాడు (ఇంట్రడక్షన్ టు– స్టోరీ ఆఫ్ ఇండియా : 1956). గుప్తుల కాలంలోనే సమాజంలో సర్వమానవ సమానత్వాన్ని బోధించి, అమ లుచేస్తూ వచ్చిన బౌద్ధ ధర్మానికి ఆదరణ లేకుండా చేసే ప్రయత్నాలు జరిగాయి. మగధ ప్రాంతంలో మానవతావాదాన్ని ప్రబోధిస్తున్న బౌద్ధ మతం దెబ్బతినడానికి గుప్తులు కారణమయ్యారు. రాచరిక వ్యవస్థా రక్షణలో భాగంగా పితృస్వామిక వ్యవస్థను గుప్త రాజులు పెంచి పోషించారు. వీరి కాలంలోనే స్థానిక భాషల స్థానంలో సంస్కృ తానికి ప్రాధాన్యం పెరిగింది. యజ్ఞయాగాదులకు పెద్దపీట వేశారు గుప్తులు. అందుకే బహుశా ప్రాచీన తొలి మధ్య యుగ భారత చరి త్రలో కుషాణుల పాత్రను, కనిష్కుల శాసనాలను చూస్తే గుప్త రాజుల గుట్టు బయటపడుతుందని మరికొందరు చరిత్రకారుల భావన.
అందుకే గుప్తుల ఈ ‘గుప్త’ చరిత్ర వెనుక దాగిన ‘గుట్టు’ను తెలుసుకోవడానికి ఒక పూర్తి జీవిత కాలం కూడా చాలదని చెబుతూ ఒక చరిత్రకారుడు ఇలా వ్యాఖ్యానించవలసి వచ్చింది: ‘భారత చరిత్రలోని పెక్కు ప్రసిద్ధ వంశ చరిత్రలకు జ్ఞాపకార్థం నిలబడే గుర్తులు ఉంటాయి, వాటిని మనం చూడొచ్చు. ఉదాహరణకు ఢిల్లీ లోని సుల్తానేట్, బ్రిటిష్ పాలనా చిహ్నాలు, ఆగ్రాలో మొగలాయి చిహ్నాలు, అశోకుడి స్థూపాలు, శాసనాలు చెక్కిన శిలలూ వగైరా, సారనాథ్‌లోని బుద్ధ సైకత శిలాస్థూపం, అజంతా గుహలలోని బౌద్ధ గుహారామాలు వగైరా... క్రీ.శ. 300– 500 శతాబ్దాల మధ్య తుది రోమన్ సామ్రాజ్య పాలకుల సమకాలికులుగా చెప్పుకునే గుప్తులు బంగాళాఖాతం నుంచి సింధునదీ ప్రాంతాల వరకు పాలించినట్టు చెప్పుకున్నారు’ అని రాశాడు. ఏది ఏమైనా గుప్త రాజులు మాత్రం వైష్ణవులేగానీ బౌద్ధ ధర్మావలంబికులు కారు. గుప్తుల కాలంలోనే కుల, వర్ణ వ్యవస్థలు వేళ్లూనుకున్నాయి. అంతేగాదు, గుప్త రాజుల ‘హద్దుమీరిన భోగ లాలసతను, లంపటత్వాన్ని విశాఖదత్తుని ‘ముద్రారాక్షసం’ ‘దేవి చంద్రగుప్త’ నాటకం, రాజశేఖరుని ‘కావ్య మీమాంస’ జల్లెడపట్టి చూపాయని మరికొందరు విమర్శకుల అభి ప్రాయం. ఇదే నేటి భారతదేశానికి ‘ఆదర్శ’మని భావించి, దానిని ‘జాతీయవాద పతాక’గా అభినవ భారత పాలకులు చెప్పదలిస్తే మాత్రం అంతకన్నా చరిత్ర వక్రీకరణ మరొకటి ఉండదేమో! పెక్కు మంది సమకాలీన గుప్త రాజులు మ్లేచ్ఛప్రాయులు (బార్బరస్), ద్రోహులు, అబద్ధాలకోరులు, పిసినారులు.. ఒక జాతిగా, ఒక తెగగా, ఒక కులంగా ఏ కోశానా గుప్తులకు గౌరవప్రదమైన పుట్టు పూర్వా లంటూ కనిపించవని డాక్టర్ డి.డి. కోశాంబి వివరించాడు. కనుక దేన్నిబడితే దాన్ని ‘స్వర్ణ యుగం’గా ముందే అభివర్ణించేకంటే కాలా నికి వ్యవధి ఇవ్వడం మంచిదేమో? ఎందుకంటే, సౌందర్యవంత మైన, నిజమైన స్వర్ణయుగావిష్కరణ కోసం మనం ఎప్పుడూ భవి ష్యత్తు మీదే నిఘా పెట్టి, ఇవాళ్టికంటే రేపే ఎంతో బాగుంటుందను కోవడమే ఆశాజీవుల ఎజెండా!
ఏబీకే ప్రసాద్,సీనియర్ సంపాదకులు
abkprasad2006@yahoo.co.in
Comments
Please login to add a commentAdd a comment