ఏపీలో వెల్లువలా తరలివచ్చిన భక్తజనం
* వర్షంలో తడుస్తూనే పుణ్య స్నానాలు
* కిటకిటలాడిన ప్రధాన ఘాట్‌లు
* లోతట్టు ప్రాంతాల్లో పారిశుధ్య సమస్యలు
సాక్షి, రాజమండ్రి: జోరు వానలోనూ భక్తజన కెరటం ఎగసిపడింది. కుండపోతగా కురిసిన వర్షాన్ని సైతం లెక్క చేయకుండా లక్షలాది మంది గోదావరి పుష్కర స్నానానికి పోటెత్తారు. ఉభయ గోదావరి జిల్లాల్లో బుధవారం తెల్లవారుజాము నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకూ ఏకబికిన వర్షం కురిసింది.
అయినప్పటికీ భక్తులు లెక్క చేయకుండా కిలోమీటర్లకొద్దీ నడుస్తూ పుష్కర ఘాట్‌లకు చేరుకున్నారు. వానలో తడుస్తూనే పుణ్య స్నానాలు చేశారు. ఘాట్‌లు, పరిసర ప్రాంతాలన్నీ బురదమయం కావడంతో భక్తులకు ఇబ్బందులు ఎదురయ్యాయి. లోతట్టు ప్రాంతాల్లో భారీగా నీరు చేరడంతో అడుగడుగునా పారిశుధ్య సమస్యలు తలెత్తాయి.
గ్రామీణ ప్రాంతాలకు తాకిడి
పుష్కరాలు ప్రారంభమైనప్పటి నుంచి బుధవారం రాత్రి 7 గంటల సమయానికి యాత్రికుల సంఖ్య 3.40 కోట్లకు చేరింది. బుధవారం ఒక్కరోజే ఉభయ గోదావరి జిల్లాల్లో 35 లక్షల మంది పుణ్యస్నానాలు ఆచరించారు. రాజ మండ్రి కోటిలింగాల రేవు, పుష్కర ఘాట్, కొవ్వూరు గోష్పాద క్షేత్రం, నరసాపురం ఘాట్‌లలో భక్తుల తాకిడి కొనసాగుతోంది. గ్రామీణ ప్రాంతాల్లోని ఘాట్‌లకు కూడా భక్తులు భారీగా తరలివచ్చారు. రాజమండ్రిలో నిర్వహించిన గోదావరి హారతికి రాష్ర్ట మంత్రులు హాజరయ్యారు.
రాజమండ్రి వీఐపీ ఘాట్‌లో పలువురు ప్రముఖులు పుణ్య స్నానాలు ఆచరించారు. నగరంలో మంత్రివర్గ సమావేశాన్ని ఏర్పాటు చేయడంతో ప్రభుత్వ ఉన్నతాధికారులంతా స్నాన ఘట్టాలకు క్యూ కట్టారు. మంత్రులు పైడికొండల మాణిక్యాలరావు, గంటా శ్రీనివాసరావు, వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా తదితరులు వీఐపీ ఘాట్‌లో పుష్కర స్నానాలు చేశారు. మంత్రి అయ్యన్నపాత్రుడు గోష్పాద క్షేత్రంలో స్నానం చేశారు.
చిరంజీవి పుష్కర స్నానం
సినీ నటుడు, రాజ్యసభ సభ్యుడు చిరంజీవి రాజమండ్రిలోని వీఐపీ ఘాట్‌లో పుష్కర స్నానమాచరించారు. చిరంజీవి తన బావమరిది అల్లు అరవింద్, దర్శకుడు బి.గోపాల్, మేనల్లుడు అల్లు శిరీష్‌లతో కలసి వీఐపీ ఘాట్‌కు వచ్చారు. పోలీసు బందోబస్తు నడుమ ఆయన గోదావరిలో స్నానమాచరించారు. అనంతరం పూర్వీకులకు పిండప్రదాన కార్యక్రమం నిర్వహించారు. ఈలోగా అభిమానులు, యాత్రికులు ఆయన్ని చూసేందుకు ఎగబడ్డారు.
చిరంజీవి కొద్ది నిమిషాల్లోనే పిండప్రదానంలో తీర్థవిధులు పూర్తి చేశారు. అనంతరం వాటిని గోదావరిలో కలపలేదు. మెట్లపైనే ఉంచి, వెనుదిరిగి వెళ్లారు. ఇది చూసిన అభిమానులు, యాత్రికులు విస్తుపోయారు. ఇలా చేయడం సరికాదని భావించిన అభిమానులు.. పారిశుద్ధ్య కార్మికుల సాయంతో వాటిని అక్కడి నుంచి తీయించారు.
బోయపాటి ఆధ్వర్యంలో పుష్కరాల ముగింపు ఏర్పాట్లు
గోదావరి హారతి, పుష్కరాల ముగింపు ఏర్పాట్లకు సంబంధించిన పనులన్నీ సినీ దర్శకుడు బోయపాటి శ్రీనివాస్ చూసుకోనున్నట్లు ఎంపీ మురళీమోహన్ వెల్లడించారు. 25న పుష్కరాల ముగింపు సందర్భంగా అద్భుత బాణసంచా ఏర్పాటు చేశామని, అవి 8 నిమిషాలపాటు ఉంటాయన్నారు.