సాక్షి, హైదరాబాద్: జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ హైదరాబాద్(జేఎన్‌టీయూహెచ్) అనుబంధ గుర్తింపు(అఫిలియేషన్) రద్దు చేసిన 163 కాలేజీల్లోని 807 కోర్సుల్లో 2014-15 ఆర్థిక సంవత్సరానికి మొదటి సంవత్సరంలో చేరిన విద్యార్థులు ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు అనర్హులని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టంచేసింది. అయితే ఈ విషయానికి సంబంధించి కోర్టులో వచ్చే నిర్ణయం, దానిపై జేఎన్‌టీయూహెచ్ తుది ఉత్తర్వులు వెలువరించిన తర్వాతే దీనిపై పునఃపరిశీలించనుంది.
గత నెల 16న జేఎన్‌టీయూహెచ్ 163 కాలేజీల్లోని 807 కోర్సులకు అనుబంధ గుర్తింపును రద్దు చేసినట్లు ప్రభుత్వం దృష్టికి వచ్చింది. అయితే ఈ 163 కాలేజీల్లో 2,3,4 సంవత్సరాలు చదువుతున్న విద్యార్థులకు అనుబంధ గుర్తింపు ఉన్నందున వారు స్కాలర్‌షిప్ పొందేందుకు ఈ-పాస్‌లో దరఖాస్తు చేసుకునేందుకు అనుమతించాలని ఆయా కాలేజీల విద్యార్థులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ విజ్ఞప్తులను పరిశీలించిన ప్రభుత్వం ఈ విద్యార్థులు మాత్రమే ఆన్‌లైన్‌లో అథెంటికేషన్‌ను(రెన్యువల్) పొందేం దుకు అనుమతిచ్చింది. అయితే రాష్ట్రపతి ఉత్తర్వులకు అనుగుణంగా తెలంగాణలో స్థానికులుగా గుర్తించిన విద్యార్థులే ఫీజు రీయింబర్స్‌మెంట్ పొందేందుకు అర్హులని మరోసారి స్పష్టం చేసింది.
ఇందుకు సంబంధించి ఈ-పాస్ వెబ్‌సైట్‌లో అవసరమైన మార్పులు చేసి, ఆధార్ వ్యవస్థ ద్వారా ఆన్‌లైన్‌లో విద్యార్థుల అథెంటికేషన్ చేయాలని సెంటర్ ఫర్ గుడ్ గవరె ్నన్స్‌కు ప్రభుత్వం సూచించింది. అన్ని కాలేజీలు ఆన్‌లైన్‌లో ఆధార్ లింక్ ఉన్న పరికరాల ద్వారా విద్యార్థులను అథెంటికేట్ చేయాలని, బార్‌కోడ్ ఉన్న స్కాలర్‌షిప్ దరఖాస్తులను సిద్ధంచేసి, వాటిపై విద్యార్థులు, యాజమాన్యం గుర్తించిన ప్రతినిధి సంతకాలు చేసి సంక్షేమ అధికారులకు సమర్పించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.
పూర్వాపరాలు ఇవీ..
కొన్ని కాలేజీలు, కొన్ని కోర్సులు మొత్తం కలుపుకుని 163 కాలేజీల్లోని 807 కోర్సులకు 2014-15లో అనుబంధ గుర్తింపును జేఎన్‌టీయూహేచ్ రద్దు చేసింది. దీనిపై ఆయా కాలేజీలు సుప్రీంకోర్టుకు వెళ్లగా షరతులతో అనుమతినివ్వమని కోర్టు పేర్కొంది. ఈ కాలేజీలను మళ్లీ తనిఖీ చేసి నిబంధనలను బట్టి గుర్తింపు ఇవ్వాలని, నిబంధనలకు లోబడే ప్రవేశాలు కల్పించాలని సూచించింది. అయితే జేఎన్‌టీయూహేచ్ ఆధ్వర్యంలో మళ్లీ తనిఖీలు చేయగా ఆయా కాలేజీలు నిబంధనల ప్రకారం నడవడం లేదని తేలింది. దీంతో ఈ కాలేజీల అనుబంధ గుర్తింపును రద్దు చేస్తూ జేఎన్‌టీయూహెచ్ నిర్ణయం తీసుకుంది.
ఆ విద్యార్థులకు ఫీజు నో..!
Published Thu, Jun 25 2015 1:32 AM | Last Updated on Wed, Sep 5 2018 9:00 PM
Advertisement
Advertisement