బీటెక్ దొంగ అరెస్ట్
బన్సీలాల్‌పేట్: ఇంజనీరింగ్ చదివిన విద్యార్ధి జల్సాల కోసం దొంగతనాలు చేస్తూ కటకటాల పాలయ్యాడు. చెడు అలవాట్లకు బానిసగా మారి.. జల్సాల కోసం దొంగతనాలకు పాల్పడుతున్న ఓ బీటెక్ విద్యార్ధిని గాంధీనగర్ పోలీసులు అరెస్టు చేసి మంగళవారం రిమాండ్‌కు తరలించారు. క్రైమ్ ఇన్‌స్పెక్టర్ శ్రీనాథ్ రెడ్డి కథనం ప్రకారం... మహబూబ్‌నగర్ జిల్లా అమన్‌గల్‌కు చెందిన నునామత్ వినోద్ కుమార్ (21) బీటెక్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. జల్సాలకు అలవాటు పడిన ఇతను అపార్టుమెంట్లు, రోడ్లపై పార్కు చేసిన ఖరీదైన ద్విచక్ర వాహనాలను దొంగలించడం పనిగా పెట్టుకున్నాడు.
గాంధీనగర్, చిక్కడపల్లి, రాంగోపాల్‌పేట్, బంజారాహిల్స్ పోలీసు స్టేషన్ల పరిధిలో పలు బైక్‌లను ఎత్తుకెళ్లాడు. పంజగుట్ట పోలీసు స్టేషన్ పరిధిలో ఓ మహిళ నుంచి సెల్‌ఫోన్ లాక్కెళ్లినట్లు తెలిపారు. నిందితుడి నుంచి మూడు బైక్‌లు, రెండు సెల్‌ఫోన్లను రికవరీ చేశామన్నారు. నిందితునిపై 7 కేసులు నమోదు చేశామని, అతనికి సహకరించిన మరో వ్యక్తి సలీమ్‌ను కూడా రిమాండ్‌కు తరలించినట్లు క్రైమ్ ఇన్‌స్పెక్టర్ శ్రీనాథ్‌రెడ్డి వివరించారు.