ఫేస్‌బుక్ కిలేడీ
► క్యాన్సర్ పేరుతో యువతి నాటకం
► ఆర్థిక సాయం కోసం ఫేస్‌బుక్‌లో వినతులు
► లక్షల్లో వసూలు ∙ జల్సాలపై మోజుతోనే
► నిందితురాలి అరెస్టు
బంజారాహిల్స్: తనకు క్యాన్సర్ ఉన్నట్లుగా నమ్మించి చికిత్సకు రూ.లక్షలు ఖర్చవుతుందని తన దీనస్థితిని వివరిస్తూ ఫేస్‌బుక్ ద్వారా ప్రచారం చేసుకొని బంధుమిత్రుల నుంచి లక్షలాది రూపాయలు వసూలు చేసి పరారీలో ఉన్న యువతిని బంజారాహిల్స్ పోలీసులు గురువారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఎస్‌ఐ వెంకటేశ్వర్లు కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.. ఓల్డ్ మలక్‌పేట్‌కు చెందిన సమియా ఆబిడ్స్‌లోని సెయింట్‌జార్జ్ డిగ్రీ కాలేజీలో బీఎస్సీ చదువుతోంది. జల్సాలకు అలవాటు పడిన ఆమె తేలికగా డబ్బులు సంపాదించాలని పథకం పన్నింది.
సౌదీలో ఉంటున్న ఆమె తండ్రి అబ్దుల్ హఫీజ్‌కు 2015లో ఓమెగా క్యాన్సర్‌ఆస్పత్రిలో నోటి క్యాన్సర్ చికిత్స జరిగింది. ఆ సమయంలో తరచూ ఆస్పత్రికి వచ్చి పోతుండటంతో వైద్యులతో పాటు ఎండీ డాక్టర్ మోహన్‌వంశీతో పరిచయం ఏర్పడింది. తండ్రి డిశ్చార్జి అయిన తర్వాత కొద్ది రోజులకు సమియా ఇదే ఆస్పత్రికి వచ్చి డాక్టర్ మోహన్ వంశీతో సమావేశమై తన తండ్రి నోటి క్యాన్సర్‌కు సంబంధించి వైద్యం చేయాల్సి ఉందని అందుకోసం ఎంత ఖర్చవుతుందంటూ అతడి ద్వారానే చెప్పిస్తూ రికార్డు చేసింది. ఆ తర్వాత ఆ క్యాన్సర్ తనకే ఉన్నట్లు నమ్మించి డాక్టర్ మోహన్ వంశీ చెప్పిన వివరాలను జోడిస్తూ ఫేస్‌బుక్‌లో పోస్టు చేసింది.
ఇది నిజమని నమ్మిన ఆమె స్నేహితులు, బంధువులు సౌదీ, దుబాయ్ నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు పంపించారు. గన్‌ఫౌండ్రి ఎస్‌బీహెచ్ ఖాతాకు రూ. 21 లక్షలు జమ చేశారు. అయితే సౌదీ నుంచి ఆమెను చూడటానికి వచ్చిన స్నేహితులకు ఆస్పత్రిలో వాకబు చేయగా సమియా పేరుతో ఎవరికీ వైద్యం చేయలేదని చెప్పారు. తమను మోసం చేసిందని తెలుసుకొని ఆస్పత్రి యాజమాన్యానికి సమాచారం ఇచ్చారు. ఈ నెల 7న ఆస్పత్రి హెచ్‌ఆర్ రాజారాం బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు గాలింపు చేపట్టిన పోలీసులు గురువారం ఆమెను అరెస్టు చేశారు. మధ్యాహ్నం కోర్టులో ప్రవేశ పెట్టి అక్కడి నుంచి జైలుకు తరలించారు.