గోల్డ్ స్మగ్లింగ్ ముఠా గుట్టురట్టు
పట్టుబడిన అక్రమ రవాణాదారు రూ. 93 లక్షల విదేశీ కరెన్సీ స్వాధీనం
హైదరాబాద్ : దుబాయ్ నుంచి హైదరాబాద్‌కు సాగుతున్న బంగారం స్మగ్లింగ్ ముఠా గుట్టును టాస్క్‌ఫోర్స్ పోలీసులు రట్టు చేశారు. పాతబస్తీలో ఈ ముఠా నాయకుడిని అరెస్టు చేసిన పోలీసులు అతని నుంచి రూ. 93 లక్షల విలువజేసే విదేశీ కరెన్సీని, కారును స్వాధీనం చేసుకున్నారు. ఈ స్మగ్లింగ్ దందాకు సహకరించిన ఏయిరిండియా సంస్థకు చెందిన ఇద్దరు ఉద్యోగులను కూడా అదుపులోకి తీసుకున్నారు. నగర టాస్క్‌ఫోర్స్ అదనపు డీసీపీ బి.లింబారెడ్డి కేసు వివరాలను శనివారం మీడియాకు వెల్లడించారు. ఫలక్‌నుమాకు చెందిన సయ్యద్ సాజిద్(30) అలియాస్ అజ్జూ పాతబస్తీలో చిన్నపాటి వ్యాపారి. పాత బస్తీకే చెందిన అలీబిన్ సయీద్ అలియాస్ ఫహద్(28)తో కలసి సంవత్సర కాలంగా ఈ వ్యాపారం చేయడం ప్రారంభించాడు. నమ్మకస్తులను కొరియర్లుగా పంపి బిస్కెట్ల రూపంలో బంగారాన్ని తెప్పించుకునేవారు. ఈ బంగారాన్ని నగల దుకాణాలు, నగల తయారీదారులకు విక్రయించేవారు.
మూడు నెలల క్రితం ఫహద్ బంగారం అక్రమ రవాణా చేస్తూ పట్టుబడడంతో చంచల్‌గూడ జైలులో రిమాండ్‌లో ఉంచారు. దీంతో సాజిద్ ఒక్కడే నిర్వహిస్తున్నాడు. ఈ విషయాన్ని పసిగట్టిన ఈస్ట్‌జోన్ ఇన్‌స్పెక్టర్ సి.హెచ్.శ్రీధర్, ఎస్సైలు ఎస్.శేఖర్‌రెడ్డి, ఎ.సుధాకర్, ఎ.రవికుమార్‌ల బృందం సాజిద్ కదలికలపై నిఘా ఉంచింది. ఈ క్రమంలోనే శుక్రవారం తాడ్‌బన్ చౌరస్తాలోని డైమండ్ హోటల్ వద్ద అనుమానాస్పదంగా తచ్చాడుతున్న సాజిద్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద రూ. 93 లక్షల విలువ జేసే ‘సౌదీ అరేబియాకు చెందిన 4.5 లక్షల రియాల్స్, యూఏఈకి చెందిన 1.31 దీరమ్స్ దొరికాయి. మారుతీ స్విఫ్ట్ కారు(ఏిపీ 09 బీఎస్ 0018), రెండు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితున్ని తదుపరి విచారణ నిమిత్తం ఎన్‌ఫోర్స్‌మెంట్ డెరైక్టరేట్‌కు అప్పగించారు. సాజిద్ తెలిపిన వివరాల మేరకు ఏయిరిండియాకు చెందిన వీల్‌చైర్ అసిస్టెంట్లు మహ్మద్ ఫారూఖ్, ప్రవీణ్‌కుమార్‌లను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.