తెలంగాణను మోసం చేసింది 'ఆ ఇద్దరే'
తెలంగాణను మోసం చేసింది టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్లే అని కాంగ్రెస్ పార్టీ ఎంపీలు గుత్తా సుఖేందర్ రెడ్డి జి.వివేక్లు ఆరోపించారు. మంగళవారం వారు హైదరాబాద్లో విలేకర్లతో మాట్లాడుతూ... తెలంగాణ పునర్నిర్మాణం కేసీఆర్తో సాధ్యం కాదని స్పష్టం చేశారు. ఎన్నికల్లో కేసీఆర్ సీట్లు అమ్ముకున్నారని ఆరోపించారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని పణంగా పెట్టి ఉద్యమద్రోహులకు కేసీఆర్ టిక్కెట్లిచ్చారని వారు విమర్శించారు.
తెలంగాణ ఇస్తే టీఆర్ఎస్ను పార్టీలో విలీనం చేస్తామని టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్, ఆ పార్టీ ఎమ్మెల్యేలు కేటీఆర్, హరీష్లు కాంగ్రెస్ అధిష్టానానికి మాట ఇచ్చారని గుత్తా, వివేక్లు గుర్తు చేశారు. ఇచ్చిన మాటను టీఆర్ఎస్ విస్మరించిందని అన్నారు. కానీ తెలంగాణ ఇస్తామన్న మాటకు తమ పార్టీ అధ్యక్షురాలు సోనియా కట్టుబడి... తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేసి ఇచ్చిన మాటలను నిలబెట్టుకున్నారని తెలిపారు.
తెలంగాణ బొగ్గు గని కార్మిక సంస్థను సరిగ్గా నడపలేని కేసీఆర్.... తెలంగాణను ఎలా పునర్నిర్మిస్తాంటూ వివేక్ టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ను సూటిగా ప్రశ్నించారు. గుజరాత్ లోని గోద్రా అల్లర్లకు ముఖ్య కారకుడు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మోడీ అని గతంలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఆరోపించారని వారు గుర్తు చేశారు. అలాంటి బాబు ప్రస్తుతం మతోన్మాద శక్తులకు ఎందుకు మద్దతిస్తున్నారో చెప్పాలని వారు డిమాండ్ చేశారు.