వానొస్తే నరకం
నగరంలో చిన్నపాటి వర్షానికే ట్రాఫిక్ జామ్
గంటల తరబడి కదలని వాహనాలు
రహదారులపై నిలిచిపోతున్న నీరు
మెట్రో పనులు నిర్వహించే ప్రాంతాల్లో ఇక్కట్లు
సిటీబ్యూరో: సునీల్ సోమవారం మధ్యాహ్నం 1 గంటకు దిల్‌సుఖ్‌నగర్ నుంచి అమీర్‌పేట్‌కు బయలుదేరాడు. ఈలోగా వర్షం కురవడంతో మెట్రో పనులు జరుగుతున్న మలక్‌పేట్ ప్రధాన రహదారిపై మోకాళ్ల లోతున నీరు నిలిచిపోయింది. దీంతో దారి పొడవునా ట్రాఫిక్ స్తంభించింది. సాధారణంగా 50 నిమిషాల్లో అమీర్‌పేట్‌కు చేరుకునే సునీల్ రెండు గంటలు ఆలస్యంగా గమ్యస్థానం చేరుకున్నాడు.
...ప్రశాంత్ సోమవారం మధ్యాహ్నం 12.30 గంటలకు ఉప్పల్ నుంచి బంజారాహిల్స్ బయలుదేరాడు. వర్షం కారణంగా మెట్రో పనులు జరుగుతున్న మెట్టుగూడ, బేగంపేట్ ప్రాంతాల్లో ట్రాఫిక్ పద్మవ్యూహంలో చిక్కుకున్నాడు. సుమారు రెండున్నర గంటల పాటు అక్కడి నుంచి కదల్లేని పరిస్థితి ఎదురైంది.
వర్షం పడితే నగరంలో ట్రాఫిక్... జనం అవస్థలు ఏ స్థాయిలో ఉంటాయో తెలిపేందుకు ఈ రెండు సంఘటనలు నిదర్శనంగా నిలుస్తున్నాయి. సోమవారం మధ్యాహ్నం కురిసిన వర్షంతో జనానికి మరోసారి ట్రాఫిక్ కష్టాలు ఎదురయ్యాయి. వాహనదారులు, బస్సులు, ఆటోల్లోని ప్రయాణికులు ట్రాఫిక్‌లో చిక్కుకొని విలవిల్లాడారు. వరదనీరు పొంగిపొర్లడం... మెట్రో పనుల వల్ల అనేక ప్రాంతాల్లో ప్రధాన రహదారులపై బారికేడ్‌ల ఏర్పాటుతో రహదారులు కుంచించుకుపోయాయి. ట్రాఫిక్ ఇక్కట్లు తీవ్రమయ్యాయి. ప్రధానంగా ఎల్బీనగర్-మియాపూర్, నాగోల్-శిల్పారామం రూట్లలో వేలాది మంది ప్రయాణికులు ఇక్కట్లు ఎదుర్కొన్నారు. ప్రధాన రహదారులపై ఉదయం 11 నుంచి సాయంత్రం 4 గంటల వరకు కిలోమీటర్ల మేర వాహనాలు బారులు తీరాయి.
ట్రాఫిక్ నరకానికి కారణాలివే...
లక్డీకాపూల్-కూకట్‌పల్లి రూట్లో మెట్రో పనులతో ప్రధాన రహదారి విస్తీర్ణం తగ్గి వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ ప్రాంతాల్లో ప్రార్థన స్థలాలు, మందిరాల ఆస్తుల సేకరణ ప్రక్రియ పూర్తి కాకపోవడంతో రహదారుల విస్తరణ ఆలస్యమవుతుండడంతో చిక్కులు తీవ్రమవుతున్నాయి.
మలక్‌పేట్, టోలిచౌకి, ఖైరతాబాద్, పంజగుట్ట తదితర 17 ప్రాంతాల్లో రహదారులను నీరు ముంచెత్తుతుండడంతో ట్రాఫిక్ నరకం తీవ్రమవుతోంది. ఈ ప్రాంతాల్లో రూ.200 కోట్లతో జీహెచ్‌ఎంసీ వరదనీటి కాల్వలను మెరుగుపరచని పక్షంలో వర్షాకాలంలో పరిస్థితి విషమిస్తుందని ట్రాఫిక్ విభాగం అధికారులు స్పష్టం చేస్తున్నారు.
మెట్రో పనులు జరుగుతున్న ప్రధాన ప్రాంతాల్లో తవ్విన గోతులను పూర్తి స్థాయిలో పూడ్చకపోవడం, యూ టర్న్‌లు లేకుండా చేయడంతో ఎక్కడికక్కడ వాహనాలు బారులు తీరుతున్నాయి.తరచూ ట్రాఫిక్ ఇబ్బందులు ఎదురవుతున్న ప్రాంతాల్లో జీహెచ్‌ఎంసీ, మెట్రో, ట్రాఫిక్ విభాగం అధికారులు సంయుక్తంగా పర్యటించి ప్రత్యామ్నాయ మార్గాలు, మళ్లింపునకు చర్యలు తీసుకోవడం లేదు. దీంతో సిటీజనులు సమస్యలు ఎదుర్కొంటున్నారు.
ఇవీ కష్టాల కూడళ్లు
సోమవారం నగరంలో ట్రాఫిక్ నరకం చూపిన ప్రాంతాలు... మూసారాంబాగ్, దిల్‌సుఖ్‌నగర్, నల్గొండ ఎక్స్‌రోడ్డు, చాదర్‌ఘాట్, ఎంజీబీఎస్ బస్ స్టేషన్ రోడ్డు. మొజాంజాహి మార్కెట్, అఫ్జల్‌గంజ్, ఎగ్జిబిషన్ రోడ్డు, అబిడ్స్, నారాయణగూడ, సుల్తాన్‌బాజర్, పంజగుట్ట, ఖైరతాబాద్, లక్డీకాపూల్, తెలుగుతల్లి జంక్షన్, అంబేద్కర్ చౌరస్తా, అమీర్‌పేట, ఎస్‌ఆర్‌నగర్, కూకట్‌పల్లి, ఎన్‌సీసీ గేట్, ఉస్మానియా యూనివర్సిటీ, టోలిచౌకి, మల్లేపల్లి ఎక్స్‌రోడ్, దారుసలాం,కోఠి ఆంధ్రాబ్యాంక్.
మ్యాపింగ్ చేస్తున్నాం
ప్రధాన నగరంలో తరచూ వర్షపునీరు నిలిచే ప్రాంతాలను మ్యాపింగ్ చేస్తున్నాం. ఆ ప్రాంతాల్లో తక్షణం, దీర్ఘకాలంలో తీసుకునే చర్యలపై త్వరలో ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నాం. వర్షపునీరు నిలిచే ప్రాంతాల్లోనే ట్రాఫిక్ చిక్కులు తీవ్ర మవుతున్నాయని గుర్తించాం. - రంగనాథ్, ట్రాఫిక్ డీసీపీ
వర్షపాతం వివరాలివీ..
ఆసిఫ్‌నగర్ 18.50 మిల్లీమీటర్లు, శ్రీనగర్ కాలనీ 6.25. నాంపల్లి 5.25, షేక్‌పేట్ 5, మౌలాలిలో 3.75మి.మీ., మాదన్నపేట్ 2.25, తిరుమలగిరి 1.50, గోల్కొండ 1, చిలకల గూడ 1, వెస్ట్‌మారేడ్‌పల్లి 0.75, మల్కాజ్‌గిరి 0.75, ఉప్పల్ 0.75, బండ్లగూడ 0.50, రాజేంద్రనగర్ 0.50 మి.మీ. వర్షం కురిసింది. సగటున 1.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు బేగంపేట్‌లోని వాతావరణ శాఖ తెలిపింది.