నాంపల్లి కోర్టులో లాయర్ ఆత్మహత్యాయత్నం, ఉద్రిక్తత
హైదరాబాద్: నాంపల్లి కోర్టు ఆవరణలో మంగళవారం ఉదయం న్యాయవాదులు ఆందోళన తీవ్ర రూపం దాల్చింది. హైకోర్టు విభజన, న్యాయమూర్తుల నియామకంలో తెలంగాణకు అన్యాయం జరిగిందని ఆరోపిస్తూ గత కొన్ని రోజులుగా తెలంగాణ వ్యాప్తంగా అన్ని కోర్టుల వద్ద న్యాయవాదులు ఆందోళన చేపడుతున్న విషయం తెలిసిందే. ఈ నేపధ్యంలో ఈ రోజు ఉదయం జరిగిన న్యాయవాదుల ఆందోళనలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఓ లాయర్ నిద్రమాత్రలు మింగి ఆత్యహత్యకు యత్నింయడంతో కోర్టు ఆవరణలో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఆత్మహత్యకు పాల్పడిన గంప వెంకటేష్ అనే న్యాయవాదిని పోలీసులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు.
మరోవైపు ఇద్దరు జడ్జీల సస్పెన్షన్ పై హైకోర్టు వద్ద తెలంగాణ లాయర్ల ఆందోళన కూడా కొనసాగుతోంది. దీంతో హైకోర్టు వద్ద భారీగా పోలీసులు మోహరించారు. కోర్టుకు వచ్చే ప్రతీ వాహనాన్ని తనిఖీ చేసిన తర్వాతనే లోపలికి అనుమతి ఇస్తున్నారు. కాగా, మరికొద్దిసేపట్లో టీ న్యాయాధికారుల సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో జడ్డిల సస్పెన్షన్లు, భవిష్యత్ కార్యాచరణపై చర్చించనున్నారు.