మనకు గొడ్డలిపెట్టే! | Negligence of State governments | Sakshi
Sakshi News home page

మనకు గొడ్డలిపెట్టే!

Published Wed, Dec 9 2015 12:40 AM | Last Updated on Tue, Aug 14 2018 10:54 AM

మనకు గొడ్డలిపెట్టే! - Sakshi

మనకు గొడ్డలిపెట్టే!

సాక్షి, హైదరాబాద్: కృష్ణా జలాలపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు పెట్టుకున్న ఆశలు అడియాసలయ్యాయి. ఎగువ రాష్ట్రాల ఒత్తిడి, రాజకీయ ప్రయోజనాలకు మోకరిల్లిన కేంద్రం.. కృష్ణా జలాల వివాదాన్ని రెండు రాష్ట్రాలకే పరిమితం చేసేందుకు సిద్ధమైంది. నీటి పంపకాల్లో తీరని అన్యాయం జరిగిందని ఏడాదిన్నరగా మొత్తుకుంటున్నా పట్టించుకోలేదు. ఈ ఏడాది కళ్లెదుటే కృష్ణాలో గడ్డు పరిస్థితులు కనిపిస్తున్నా కనికరించలేదు. ఈ అన్యాయంపై కేంద్ర పెద్దలను కలిసేందుకు సీఎం  కేసీఆర్ మంగళవారమే ఢిల్లీకి వెళ్లగా.. ఏపీ సీఎం చంద్రబాబు బుధవారం ఢిల్లీ వెళ్లనున్నట్లు సమాచారం. మరోవైపు గురువారం సుప్రీంకోర్టులో జరుగనున్న విచారణలో అన్యాయం జరిగేలా తీర్పు వెలువడితే మళ్లీ సుప్రీంను ఆశ్రయించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.

 దిగువకు కన్నీరే..
 బచావత్ ట్రిబ్యునల్ అవార్డు (తీర్పు) ప్రకారం కృష్ణానదిలో (75 శాతం నీటి లభ్యత) 2,060 టీఎంసీల నికర జలాలు, మరో 70 టీఎంసీల రీజనరేషన్ జలాలు ఉన్నట్టు లెక్క తేల్చారు. అయితే బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ మాత్రం 47 సంవత్సరాల ప్రవాహాన్ని పరిగణనలోకి తీసుకుని 65 శాతం నీటి లభ్యత ఆధారంగా 2,578 టీఎంసీల జలాలున్నట్లు తేల్చింది. కొత్తగా 163 టీఎంసీల నికర జలాలు, మరో 285 టీఎంసీల మిగులు (మొత్తం 448 టీఎంసీలు) ఉన్నట్లు పేర్కొంది. ఆ నీటిని మూడు రాష్ట్రాల (మహారాష్ట్ర, కర్ణాటక, ఉమ్మడి ఏపీ)కు పంపిణీ చేసింది. దీని ప్రకారం ఇప్పటికే ఉన్న కేటాయింపులకు అదనంగా ఆంధ్రప్రదేశ్‌కు 190 టీఎంసీలు, కర్ణాటకకు 177, మహారాష్ట్రకు 81 టీఎంసీలు కేటాయించారు.

ఉమ్మడి ఏపీకి కేటాయింపులు పెంచినట్లు కనిపించినా.. వాస్తవానికి అన్ని జలాలు కృష్ణానదిలో అందుబాటులో ఉండవు. బచావత్ ట్రిబ్యునల్ 75 శాతం డిపెండబులిటీ మీద నీటి లభ్యతను లెక్కవేసి మిగులు జలాలను దిగువన ఉన్న ఉమ్మడి ఏపీ వాడుకునే వెసలుబాటు కల్పించగా... బ్రిజేశ్ ట్రిబ్యునల్ 65 శాతం డిపెండబులిటీ ఆధారంగా లెక్కించి మిగులు జలాలను పంచింది. ఇది బచావత్ ట్రిబ్యునల్ తీర్పునకు విరుద్ధమని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లు ఎప్పట్నుంచో చెబుతున్నా కేంద్రం పట్టించుకోలేదు. అంతేకాదు బచావత్ తీర్పునకు విరుద్ధంగా మిగులు, సరాసరి జలాలను మహారాష్ట్ర, కర్ణాటకలు విద్యుత్ ఉత్పాదన, సాగు అవసరాలకు వాడుకునేందుకు బ్రిజేశ్ ట్రిబ్యునల్ అవకాశమివ్వడం రాష్ట్రాల సమాన హక్కులకు విరుద్ధమని మొత్తుకున్నా స్పందించలేదు.

కృష్ణా జలాలను తిరిగి నాలుగు రాష్ట్రాలకు పంపిణీ చేయాలని, నాలుగు రాష్ట్రాల వాదనలు వినాలన్న విజ్ఞప్తినీ ఆలకించలేదు. వాదనలను రెండు రాష్ట్రాలకే పరిమితం చేస్తే ఎగువ రాష్ట్రాలకు కేటాయించిన మిగులు జలాలపై ప్రశ్నించే అవకాశం తెలంగాణ, ఏపీలకు దక్కదు. అదే జరిగితే మిగులు జలాలపై ఆధారపడి ఉన్న తెలంగాణలోని కల్వకుర్తి, నెట్టెంపాడు, ఎస్‌ఎల్‌బీసీ, ఆంధ్రప్రదేశ్‌లోని హంద్రీ-నీవా, గాలేరు-నగరి, వెలుగొండ తదితర ప్రాజెక్టుల భవిష్యత్ ప్రశ్నార్థకం కానుంది.

 ఖరీఫ్ కోసం అక్టోబర్ వరకు ఆగాల్సిందే
 65 డిపెండబులిటీ పద్ధతిన పంచిన నీటిని ఎగువ రాష్ట్రాలు వాడుకోవడం మొదలు పెడితే... దిగువన ఉన్న తెలంగాణ, ఏపీలకు తీరని నష్టం వాటిల్లనుంది. భారీగా వరదలు వస్తే తప్ప సాధారణ పరిస్థితుల్లో ఆయకట్టుకు నీటిని అందివ్వడం సాధ్యం కాదు. ఇప్పుడు అమల్లో ఉన్న పద్ధతి ప్రకారం కృష్ణానది నుంచి కర్ణాటక, మహారాష్ట్రలు 1,319 టీఎంసీల నీటిని వాడుకుంటున్నాయి. కొత్త తీర్పు అమల్లోకి వస్తే అదనంగా మరో 254 టీఎంసీలు (మొత్తంగా 1,573 టీఎంసీలు) వాడుకోవడానికి అవకాశం ఉంటుంది. దాంతో దిగువకు నీటి ప్రవాహం తగ్గిపోతుంది. వర్షాలు సరిగా లేనప్పుడు జూరాల, శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టులు నిండడానికి సెప్టెంబర్, అక్టోబర్ దాకా వేచి చూడాల్సి వస్తుంది. అప్పటి వరకు నీరు రాకపోతే పంటల సాగు సీజన్ కూడా ముగిసి పోతుంది. ఈ ఏడాది అలాంటి పరిస్థితుల కారణంగానే సాగర్ కింద ఆయకట్టుకు నీరివ్వలేని దుస్థితి నెలకొంది. ఉన్న కాస్త నీరు తాగు అవసరాల కోసమే సరిపోనుంది.
 
 రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం..
 కృష్ణా జలాల అంశంలో ముందే మేల్కొనడంలో తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలు విఫలమయ్యాయి. 4 రాష్ట్రాలకు కలిపి విచారణ చేయాలని అధికారుల స్థాయిలో నిర్ణ యం జరిగినా.. రాజకీయ స్థాయిలో వచ్చిన ఒత్తిళ్లతో కేంద్ర నిర్ణయం మారింది. 4 రాష్ట్రాలకు కలిపి విచారించాలని కేంద్రం నిర్ణయించిందని తెలిసిన వెంటనే కర్ణాటక, మహారాష్ట్ర స్పందించాయి. మహారాష్ట్రకు చెందిన కేంద్రమంత్రి నితిన్ గడ్కారీ, కర్ణాటకకు చెందిన కేంద్రమంత్రులు యడ్యూరప్ప, సదానందగౌడ తదితరులు ఉమాభారతిని కలసి ఒత్తిడి పెంచారు. ఈ రాష్ట్రాల్లో రాజ కీయ ప్రయోజనాల దృష్ట్యా కేంద్రం నిర్ణయం మారిపోయిందని ఢిల్లీ వర్గాలు చెబుతున్నా యి.

ఇరు రాష్ట్రాల ప్రయోజనాలకు విరుద్ధంగా కేంద్రం వైఖరి ఉన్న నేపథ్యంలో... తెలంగాణ, ఏపీ ముఖ్యమంత్రులు బుధవారం ఢిల్లీలో కేంద్ర మంత్రి ఉమాభారతి సహా ఇతర పెద్దలను కలిసే అవకాశం ఉందని అధికార వర్గాల సమాచారం. ఇప్పటికే ఢిల్లీలో ఉన్న తెలంగాణ ప్రభుత్వ సలహాదారు విద్యాసాగర్‌రావు, ఏపీ నీటి పారుదల శాఖ ముఖ్య కార్యదర్శి ఆదిత్యనాథ్‌దాస్ ఆయా రాష్ట్రాల సీఎంలకు ఎప్పటికప్పుడు సమాచారాన్ని చేరవేస్తున్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement