సాక్షి, హైదరాబాద్ : మెరుగైన గ్రామ పరిపాలన లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన గ్రామ పంచాయతీల పునర్విభజన, కొత్త పంచాయతీల ఏర్పాటుకు మరో అడుగు ముందుకు పడింది. ప్రభుత్వం రూపొందించిన మార్గదర్శకాల మేరకు.. రాష్ట్రవ్యాప్తంగా 30 జిల్లాల నుంచి 4,122 కొత్త గ్రామపంచాయతీల ఏర్పాటుకు ప్రతిపాదనలు వచ్చాయి. ఇందులో 1,879 సాధారణ ఆవాసాలు, 2,243 తండాలు ఉన్నాయి.
జిల్లాల కలెక్టర్లు మండలాల వారీగా కొత్త గ్రామ పంచాయతీల ప్రతిపాదనలను మ్యాపులతో సహా రూపొందించి పంచాయతీరాజ్ కమిషనర్‌కు నివేదికలు సమర్పించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 8,684 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. తాజాగా వచ్చిన ప్రతిపాదనలు కూడా అమల్లోకి వస్తే.. రాష్ట్రంలో గ్రామ పంచాయతీల సంఖ్య 12,806కు చేరనుంది. ఇక కొత్త పంచాయతీల ఏర్పాటుతో పాటు గ్రామ పరిపాలనలో పలు విధి విధానాలు, మార్గదర్శకాలతో ప్రభుత్వం కొత్త చట్టాన్ని తీసుకురానుంది. ఇందుకు సంబంధించిన బిల్లును త్వరలో నిర్వహించే అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టి ఆమోదం పొందేందుకు ఏర్పాట్లు చేస్తోంది.
నల్లగొండ, మహబూబ్‌నగర్‌లలో అత్యధికంగా..
రాష్ట్రంలో తండాలను గ్రామపంచాయతీలుగా మార్చుతామన్న హామీ మేరకు ప్రభుత్వం కొత్త పంచాయతీల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. ఇదే సమయంలో ప్రధాన పంచాయతీలకు దూరంగా, నిర్ణీత సంఖ్యకు మించి జనాభా ఉన్న శివారు గ్రామాలు, పల్లెలను కూడా గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు మార్గదర్శకాలు రూపొందించి.. వాటి ప్రకారం కొత్త పంచాయతీల ఏర్పాటుకు ప్రతిపాదనలు రూపొందించాల్సిందిగా అధికారులను ఆదేశించింది. దీంతో అధికారులు 4,122 కొత్త గ్రామ పంచాయతీలకు ప్రతిపాదనలు రూపొందించారు.
ఇందులో అత్యధికంగా నల్లగొండలో 309, మహబూబ్‌నగర్‌లో 265, కొత్తగూడెంలో 258, మహబూబాబాద్‌లో 253, వికారాబాద్‌లో 221, ఆదిలాబాద్‌లో 209 కొత్త గ్రామ పంచాయతీల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. ఇక భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఎక్కువగా 110కుపైగా తండాలు గ్రామ పంచాయతీలుగా మారనున్నాయి. మహబూబాబాద్, నాగర్‌కర్నూల్, మహబూబ్‌నగర్ జిల్లాల్లోనూ పెద్ద సంఖ్యలో తండాలు పంచాయతీలుగా మారనున్నాయి.
ఇక ప్రస్తుతమున్న గ్రామ పంచాయతీ పాలకవర్గాల పదవీకాలం ఈ ఏడాది జూలై 31తో పూర్తవుతోంది. దానికి రెండు నెలల ముందే ఎన్నికల ప్రక్రియ మొదలు కావాల్సి ఉంటుంది. ఆ లోగా కొత్త పంచాయతీల ఏర్పాటు పూర్తి చేసి వీటికి కూడా ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. అయితే స్థానిక ప్రయోజనాల ప్రాతిపదికనే కొత్త పంచాయతీల ఏర్పాటుపై ప్రభుత్వ తుది నిర్ణయం ఉంటుందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.
కార్యదర్శులపై భారం
రాష్ట్రంలో ప్రస్తుతమున్న 8,684 గ్రామ పంచాయతీలను పాలనా సౌలభ్యం కోసం 5,500 క్లస్టర్లుగా నిర్వహిస్తున్నారు. కొత్త పంచాయతీలకు అనుగుణంగా వీటిని కూడా విభజించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే గ్రామ కార్యదర్శుల సంఖ్య తక్కువగా ఉండడంతో క్లస్టర్‌తోపాటు కొన్ని గ్రామాల బాధ్యతలను కూడా వారికి అప్పగించారు.
తాజాగా కొత్త పంచాయతీలు ఏర్పాటు కానుండడంతో.. మూడు నాలుగు గ్రామాలకు ఒకే కార్యదర్శి ఉండే పరిస్థితి నెలకొంటుంది. ఈ నేపథ్యంలో పెరుగుతున్న పంచాయతీలకు అనుగుణంగా పూర్తిస్థాయిలో కార్యదర్శులను నియమిస్తేనే పాలనా సౌలభ్యం ఉంటుందని పంచాయతీరాజ్ శాఖ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. మొత్తంగా కొత్త పంచాయతీలతో కలిపి 4,560 మంది వరకు కార్యదర్శులు అవసరమని కలెక్టర్లు తేల్చారు.
ప్రస్తుతమున్న గ్రామ పంచాయతీలు - 8,684
కొత్త పంచాయతీలకు ప్రతిపాదనలు - 4,122
పంచాయతీలుగా మార్చే తండాల - 2,243
పంచాయతీలుగా మారే ఆవాసాలు - 1,879
ప్రతిపాదనలు అమలైతే రాష్ట్రంలో మొత్తం పంచాయతీలు - 12,806
Comments
Please login to add a commentAdd a comment