సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పోలీసు కూమ్యూనికేషన్ విభాగంలో 332 కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి శుక్రవారం నోటిఫికేషన్ విడుదలైంది. ఇప్పటికే వివిధ విభాగాల్లో 9,281 కానిస్టేబుల్, 539 ఎస్సై పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు జారీ అయిన విషయం తెలిసిందే. తాజాగా కమ్యూనికేషన్ విభాగంలో ఖాళీల భర్తీ కోసం పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నెల 25 నుంచి మార్చి 15 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పోస్టుల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించారు. ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన మూడేళ్ల వయోపరిమితి సడలింపు ఈ పోస్టులకు కూడా వర్తిస్తుంది. వాస్తవానికి జనరల్ కేటగిరీలో 18 ఏళ్ల నుంచి 22 ఏళ్ల మధ్య వయసు వారే ఈ కానిస్టేబుల్ పోస్టులకు అర్హులుకాగా... సడలింపుతో 25 ఏళ్ల వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక ఎస్సీ, ఎస్టీ, బీసీలకు నిబంధనల మేరకు అదనపు వయోపరిమితి వర్తిస్తుంది. 360 పనిదినాలు పూర్తిచేసుకున్న హోంగార్డులు 33 ఏళ్ల వరకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
సాంకేతిక విద్య తప్పనిసరి..: కమ్యూనికేషన్ విభాగంలోని ఈ కానిస్టేబుల్ పోస్టులకు సాంకేతిక విద్యను అభ్యసించిన వారే అర్హులు. ఎస్సెస్సీ లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణతతో పాటు ఎలక్ట్రానిక్, మెకానికల్ విభాగంలో ఐటీఐ పూర్తి చేసి ఉండాలి. ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్ టెక్నికల్ (ఈఈటీ), ఎలక్ట్రికల్ టెక్నిషియన్ (ఈటీ) కోర్సులను ఈ ఏడాది జూలై 1 నాటికి పూర్తి చేసుకోవాలి. ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తారు. పరీక్ష ఫీజు ఓసీ, బీసీ కేటగిరీల వారికి రూ.400... ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.200. ఈ ఫీజును టీఎస్ ఆన్‌లైన్, ఏపీ ఆన్‌లైన్, మీసేవ కేంద్రాల్లోగానీ.. క్రెడిట్, డెబిట్, నెట్ బ్యాంకింగ్ ద్వారాగానీ చెల్లించవచ్చు.
ప్రిలిమినరీ పరీక్ష ఉండదు
గతంలో విడుదల చేసిన కానిస్టేబుల్, ఎస్సై పోస్టులకు ప్రిలిమినరీ, శరీర దారుఢ్య పరీక్షలు, తుది పరీక్షలు నిర్వహించేలా నోటిఫికేషన్ జారీ చేశారు. కానీ కమ్యూనికేషన్ విభాగం పూర్తిగా సాంకేతిక అంశాలతో కూడినదైనందున ఈ పోస్టులకు ప్రిలిమినరీ పరీక్ష ఉండబోదు. నేరుగా శరీర దారుఢ్య పరీక్షలు నిర్వహిస్తారు. అందులో ఎంపికైన వారికి సాంకేతిక అంశాలతో కూడిన 200 మార్కుల రాతపరీక్ష నిర్వహిస్తారు. ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ రేడియో, బేసిక్ ఆఫ్ కంప్యూటర్స్, టెలిఫోన్ సిస్టం సిలబస్‌కు సంబంధించిన అంశాలపై ప్రశ్నలుంటాయి. ఇక శరీర దారుఢ్య పరీక్షలకు సంబంధించి పురుషుల కనీస ఎత్తు 162 సెంటీమీటర్లు, ఛాతీ గాలి పీల్చినప్పుడు 84 సెంటీమీటర్లు ఉండాలి, వదిలినప్పుడు 3 సెంటీమీటర్లు తగ్గవచ్చు. మహిళలకు కనీస ఎత్తు 152.5 సెంటీమీటర్లు. మహబూబ్‌నగర్, ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మం జిల్లాలకు చెందిన ఎస్టీ పురుష అభ్యర్థులకు కనీస ఎత్తు 160 సెంటీమీటర్లు, ఛాతీ గాలి పీల్చినప్పుడు 80 సెంటీమీటర్లు ఉండాలి, వదిలినప్పుడు 3 సెంటీమీటర్లు తగ్గవచ్చు. ఈ జిల్లాకు చెందిన ఎస్టీ మహిళా అభ్యర్థుల కనీస ఎత్తు 150 సెంటీమీటర్లు ఉండాలి.
శరీర దారుఢ్య పరీక్షలు..
ఈవెంట్స్ జనరల్ ఎక్స్‌సర్వీస్ మహిళలు
100 మీటర్ల పరుగు 15 సెకన్లు 16.5 సెకన్లు 20 సెకన్లు
లాంగ్‌జంప్ 3.80 మీటర్లు 3.65 మీటర్లు 2.50 మీటర్లు
షాట్‌పుట్ 5.60 మీటర్లు 5.60 మీటర్లు 3.75 మీటర్లు
హైజంప్ 1.20 మీటర్లు 1.05 మీటర్లు -
800 మీటర్ల పరుగు 170 సెకన్లు 200 సెకన్లు -
(షాట్‌పుట్ బరువు పురుషులకు 7.26 కేజీలు, మహిళలకు 4 కేజీలు)