కూతురు పుట్టిందని ముఖం చాటేసిన ఎన్నారై!
నాలుగేళ్లుగా అమెరికాలోనే... బిడ్డను చంపేస్తామంటున్న అత్తింటివారు
బాలల హక్కుల కమిషన్‌ను ఆశ్రయించిన బాధితురాలు
హిమాయత్‌నగర్: కూతురు పుట్టిందనే కోపం భార్యాబిడ్డలను వది లేసి అమెరికా వెళ్లిపోయాడో ఎన్‌ఆర్‌ఐ. నాలుగేళ్లుగా అతను వారి ముఖం చూడలేదు... అత్తింట్లోనే ఉంటున్న తల్లితో పాటు చిన్నారిని అత్తింటివారు చిత్రహింసలకు గురిచేస్తున్నారు. దీంతో బాధితురాలు తన కూతురికి రక్షణ కల్పించి, న్యాయం చేయాలని బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ ఆశ్రయించింది. ఈ సందర్భరంగా బుధవారం నారాయణగూడలో బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యులు అచ్యుతరావుకు మీడియాకు తెలిపిన వివరాల ప్రకారం... మహబూబ్‌నగర్ జిల్లా కానాపూర్ సమీపంలోని తలకోనపల్లికి చెందిన జగత్‌రెడ్డి, పుష్పలత కుమారుడు వెంకట పద్మ నారాయణరెడ్డి అమెరికాలో ఉంటున్నాడు. హైదరాబాద్ ఎల్బీనగర్‌కు చెందిన భగవంత్‌రెడ్డి కుమార్తె అర్చనను నారాయణరెడ్డికి ఇచ్చి 2011లో పెళ్లి జరిపిం చారు. 2012 ఆగస్టులో వీరికి కుమార్తె జన్మించింది. ఆడపిల్ల పుట్టిం దనే కోపంతో దుర్భాషలాడుతూ భర్త వెంకట నారాయణరెడ్డి తిరిగి అమెరికా వెళ్లిపోయాడు. అప్పటి నుంచి నేటి వరకు తిరిగి ఇండియాకు రాలేదన్నారు. భార్య అర్చన ఎన్నిసార్లు ఫోన్ చేసినా అతను స్పందించడం లేదు. దీంతో పాటు అత్తామామలు జగత్‌రెడ్డి, పుష్పలతలు ‘‘నా కొడుక్కి మీరు అక్కర్లేదు’ అని ఇంటి నుంచి గెంటేశారు. ఇదే సమయంలో అర్చన మరిది ఎం.రాఘవేందర్‌రెడ్డి చిన్నారిని బెల్టుతో కొట్టడంతో పాటు చంపేస్తానని బెదిరించాడు. దీంతో వేదనకు గురైన అర్చన తన కుమార్తెకు రక్షణ కల్పించి, న్యాయం చేయమని కోరుతూ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ ఆశ్రయించింది.
రంగారెడ్డి జిల్లా కలెక్టర్, డీసీపీలకు నోటీసులు
అర్చన ఫిర్యాదు మేరకు జూన్ 16వ తేదీ లోపు విచారణ జరిపి, చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని రంగారెడ్డి జిల్లా కలెక్టర్, ఎల్బీనగర్ డీసీపీలకు నోటీసులను జారీ చేశామని అచ్యుతరావు తెలిపారు. ఇలాంటి ఘటనలు మరోమారు పునరావృత్తం కాకుండా చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులను కోరారు. అర్చనకు, ఆమె బిడ్డకు ప్రభుత్వం రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. అమెరికాలో నివాసం ఉంటున్న అర్చన భర్త వెంకట నారాయణరెడ్డిని నగరానికి రప్పించి చర్యలు తీసుకోవాలన్నారు.