'పనామా'లో తెలుగువాళ్లు | telugu people in Black money list-3 | Sakshi
Sakshi News home page

'పనామా'లో తెలుగువాళ్లు

Published Thu, Apr 7 2016 2:02 AM | Last Updated on Wed, Apr 3 2019 5:16 PM

'పనామా'లో తెలుగువాళ్లు - Sakshi

'పనామా'లో తెలుగువాళ్లు

‘నల్ల’ జాబితా-3

మోటూరి శ్రీనివాస్, జయకుమార్, వోలం భాస్కర్‌రావు
  నీరా రాడియా, ఎస్‌కే మోదీ, బళ్లారి పారిశ్రామికవేత్త పేర్లూ తెరపైకి
 చార్టర్డ్ అకౌంటెంట్, వజ్రాల వ్యాపారులూ..
 కొన్ని కంపెనీలు మూతపడ్డాయంటున్న యజమానులు

 
 న్యూఢిల్లీ:
 పనామా పేపర్స్ లీక్‌లో భాగంగా బుధవారం వెల్లడించిన తాజా జాబితాలో ముగ్గురు తెలుగువారి పేర్లు తెరపైకి వచ్చాయి. నందన్ క్లీన్‌టెక్ కంపెనీ ఎండీ మోటూరి శ్రీనివాస్ ప్రసాద్, నందన్ టెక్నాలజీస్, గ్రాండ్‌బే కెనాల్ లిమిటెడ్ ఎండీ భావనాసి జయకుమార్, నందన్ టెక్నాలజీస్ మాజీ ఎండీ వోలం భాస్కర్ రావు పేర్లు వెల్లడయ్యాయి. వీరితోపాటు.. ఎనిమిదేళ్ల క్రితం (యూపీఏ హయాంలో) భారత కార్పొరేట్ ప్రపంచంలో సంచలనం సృష్టించిన నీరా రాడియా పేరు కూడా బయటకొచ్చింది. చాలెంజ్ సాకర్ లిమిటెడ్‌లో ప్రధాన భాగస్వామి ఎస్‌కే మోదీ, వరల్డ్ వైడ్ గ్రూప్ హోల్డింగ్ భాగస్వాములు ప్రీతమ్ బోత్రా, శ్వేత గుప్తా, పలువురు వజ్రాల వ్యాపారులతోపాటు బళ్లారికి చెందిన ఇద్దరు ముడి ఇనుము ఎగుమతిదారులు, కోల్‌కతా, అహ్మదాబాద్, హిమాచల్‌ప్రదేశ్‌లకు చెందిన వ్యాపారవేత్తలు ఓ చార్టెడ్ అకౌంటెంట్ ఉన్నారు.
 
 మోటూరి శ్రీనివాస్ ప్రసాద్
 విదేశాల్లో కంపెనీలు: నాలుగు
 ప్రాంత: బ్రిటీష్ వర్జిన్ ఐలాండ్
 
 పనామా పేపర్స్ లిస్టులో హైదరాబాద్‌కు చెందిన పారిశ్రామిక వేత్త మోటూరి శ్రీనివాస్ ప్రసాద్ పేరుంది. ఈయన 2011 నుంచి బ్రిటీష్ వర్జిన్ ఐలాండ్స్‌లోని నాలుగు కంపెనీల్లో డెరైక్టర్‌గా కొనసాగుతున్నారు. శ్రీనివాస్ ప్రసాద్ నందన్ క్లీన్‌టెక్ కంపెనీకి మేనేజింగ్ డెరైక్టర్‌గా, సికా సెక్యూరిటీస్ లిమిటెడ్ కంపెనీకి సహ-యజమానిగా కొనసాగుతున్నారు. ఆసియాలోనే అతిపెద్ద బయో ఇంధనం ప్రాసెసింగ్ కంపెనీతో పాటు.. పలు ఇతర కంపనీలను ఈయన స్థాపించారు. బయో ఇంధనం ఎగుమతిలో అవకతవకలున్నాయన్న కేసులో 2012 ఏప్రిల్ 2న శ్రీనివాస ప్రసాద్ అరెస్టయ్యారు. ఆ తర్వాత బెయిల్‌పై విడుదలయ్యారు.
 
 భావనాసి జయకుమార్
 విదేశీ కంపెనీలు: నందన్ టెక్నాలజీస్ లిమిటెడ్, యస్ డి వెంచర్స్ ఎస్‌ఏ, గ్రాండ్‌బే కెనాల్ లిమిటెడ్ మొదలైనవి
 ప్రాంతం: బ్రిటీష్ వర్జిన్ ఐలాండ్స్ (బీవీఐ)
 
 హైదరాబాద్‌కు చెందిన భావనాసి జయకుమార్ పలు విదేశీ కంపెనీల్లో మోటూరి శ్రీనివాస్ ప్రసాద్, వోలం భాస్కర్ రావుతో కలిసి డెరైక్టర్‌గా ఉన్నారు. రికార్డుల ప్రకారం 2008లో బీవీఐలో నందన్ టెక్నాలజీస్‌ను, 2015లో గ్రాండ్‌బే కెనాల్ కంపెనీని ప్రారంభించినట్లు తెలుస్తోంది. నందన్ టెక్నాలజీస్ కింద నడుస్తున్న ఆరు కంపెనీలకు జయకుమార్ డెరైక్టర్‌గా ఉన్నారు. అయితే.. ఈ కంపెనీలకు తనకూ సంబంధం లేదన్న జయకుమార్ తన భార్య పేరుతో ఈ కంపెనీలున్నట్లు ఒప్పుకున్నారు.
 
 వోలం భాస్కర్ రావు
 విదేశీ కంపెనీలు: నందన్ టెక్నాలజీస్, సంబంధింత ఇతర కంపెనీలు
 ప్రాంతం: బీవీఐ
 
 ఈయన నందన్ టెక్నాలజీకి ఎండీగా బాధ్యతలు నిర్వహించారు. దీంతో పాటు సికా సెక్యూరిటీస్ సహ వ్యవస్థాపకుడిగా, ప్రమోటర్‌గా కూడా ఉన్నారు. దీంతో పాటు నందన్ క్లీన్‌టెక్ లిమిటెడ్‌కు 2008 నుంచి ఎండీగా ఉన్నారు. ప్రస్తుతానికి రిటైర్మెంట్ తీసుకున్నానంటున్న ఈయన.. యూకేలోనే ఎక్కువ కాలం గడుపుతున్నారు.
 
 నీరా రాడియా
 కార్పొరేట్ కంపెనీలకు ప్రభుత్వంలో సులభంగా పనిచేయించేలా మధ్యవర్తిత్వం నడిపినట్లు రేగిన వివాదంలో కేంద్ర బిందువైన నీరా రాడియా.. ఇప్పుడు విదేశాల్లో పెట్టుబడుల విషయంలో మళ్లీ తెరపైకి వచ్చారు. బ్రిటీష్ వర్జిన్ ఐలాండ్స్‌కు చెందిన ‘క్రౌన్ మార్ట్ ఇంటర్నేషనల్’లో రాడియాకు వాటాలున్నట్లు 232 పేపరల్లో వెల్లడైనట్లు ఇండియన్ ఎక్స్‌ప్రెస్ తెలిపింది. అయితే.. దీన్ని రాడియా ఖండించారు.
 
 సతీశ్ కే మోదీ
 మోదీ గ్లోబల్ ఎంటర్‌ప్రైజెస్ కంపెనీ చైర్మన్, కేకే మోదీ చిన్న సోదరుడు సతీశ్ కే మోదీ 2010లో చాలెంజ్ సాకర్ లిమిటెడ్ కంపెనీని ప్రారంభించారు.  2013లో మోదీ టౌన్ ఫుట్‌బాల్ క్లబ్ లిమిటెడ్‌నూ ఈయన ప్రారంభించారు. గోల్డ్‌ఫించ్ హోల్డింగ్ గ్రూపులో షేర్‌హోల్డర్‌గా ఉన్నారు.
 
 ప్రసన్న వి ఘోటాగే, వామన్ కుమార్
 ముడి ఇనుము ఎగుమతి దారైన ప్రసన్న, అతని భార్య నేహ, మిత్రుడు వామన్ కుమార్‌లకు నార్డ్‌బెల్ కమర్షియల్స్ లిమిటెడ్ కంపెనీలో వాటాలున్నాయి. ఈ కంపెనీ బీవీఐలో 2007లో ప్రారంభమైంది.ప్రసన్నకు చెందిన పీవీజీ కంపెనీ కర్ణాటకలోని బళ్లారి నుంచి 3వేల ట్రక్కుల ఇనుప ఖనిజాన్ని ఎగుమతి చేసింది. కాగా వామన్ కుమార్ అంతర్జాతీయ వ్యాపార సంబంధాలు, ముడి ఇనుము వ్యాపారంలో సిద్ధహస్తుడు.
 
 చేతన్ మెహతా, హర్షద్ రామ్నిక్‌లాల్
 వీరిద్దరూ ప్రముఖ వజ్రాల వ్యాపారులు. బ్రిటీష్ వర్జిన్ ఐలాండ్స్‌లోని లీచ్‌టెన్స్‌టిన్ బ్యాంకుతో పాటు హెచ్‌ఎస్‌బీసీ బ్యాంకులో వాటాలున్నందుకు గతంలోనే వీరిని భారత అధికారులు విచారించారు. ప్రపంచంలోనే అతిపెద్ద వజ్రాల వ్యాపారుడైన ‘రోసీ బ్లూ’ సంస్థకు హర్షద్ రామ్నిక్‌లాల్ యజమాని. కాగా, తన పేరుతో వచ్చిన కంపెనీలన్నీ గతంలోనే మూతబడ్డాయని చేతన్ మెహతా తెలిపారు.
 
 జార్జ్ మాథ్యూ
 తిరువనంతపురంకు చెందిన చార్టెడ్ అకౌంటెంట్ జార్జ్ మాథ్యూ 12 ఏళ్ల క్రితం సింగపూర్‌లో సెటిలయ్యారు. ఫ్యూచర్‌బుక్స్ పేరుతో కంపెనీని తెరిచిన ఈయన.. ఇలాంటి కంపెనీల ఏర్పాటుకు సింగిల్ స్టాప్ సర్వీస్ ప్రొవైడర్‌గా ఉన్నారు. సోల్ రిథమ్ ఇంటర్నేషనల్ లిమిటెడ్‌తోపాటు కంపెనీల్లో ఈయనకు షేర్లున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement