స్నేహితుడితో కలిసి భర్త దారుణ హత్య.. | the husband brutal murder | Sakshi
Sakshi News home page

స్నేహితుడితో కలిసి భర్త దారుణ హత్య..

Published Wed, Sep 24 2014 2:06 AM | Last Updated on Tue, Oct 16 2018 8:46 PM

స్నేహితుడితో కలిసి భర్త దారుణ హత్య.. - Sakshi

స్నేహితుడితో కలిసి భర్త దారుణ హత్య..

కిరాతకురాలు
 
నాగోలు:  మద్యంలో నిద్రమాత్రలు కలిపింది..స్నేహితుడితో కలిసి భర్తను దారుణంగా హత్యచేసింది. తల, మొండెం వేరు చేసింది. తల, కాళ్లు, చేతులు ఒక సంచిలో.. మొండెంను మరో మూటలో కట్టి మూసినదిలో పడేసిందో కిరాతకురాలు. ఆలస్యంగా వెలుగుచూసిన ఈ హత్య వివరాలను మంగళవారం ఎల్‌బీనగర్ ఎస్‌ఐ విజయ్ విలేకరులకు తెలిపారు. నల్లగొండ జిల్లా దేవరకొండ గాజీనగర్‌కు చెందిన నైనావత్ చంద్రం (42), శాంతి (30) భార్యాభర్తలు.

వీరికి నిఖిల్ (13), అంకిత్ (6) సంతానం. చంద్రం దేవరకొండ సమీపం కొండమల్లెలో కుటుంబాన్ని ఉంచి జిల్లేలగూడలో ఉంటూ ఆటో నడుపుతున్నాడు. కాగా, నల్లగొండ జిల్లా మర్రిగూడ మండలం సరంపేటకు చెందిన రమావత్ గోపాల్ (30) వికలాంగుడు. బీటెక్ మధ్యలో ఆపేశాడు. ఈ ఏడాది మార్చిలో ఆటో కొని డ్రైవర్‌గా చంద్రంను నియమించుకున్నాడు. గోపాల్ తరచూ చంద్రం ఇంటికి వచ్చి వెళ్లే క్రమంలో శాంతితో గోపాల్‌కు వివాహేతర సంబంధం ఏర్పడింది. ఇది తెలిసి చంద్రం భార్యను నిలదీశాడు.

భర్తతో గొడవపడిన శాంతి చిన్నకుమారుడు అంకిత్‌ను తీసుకుని ఇంట్లోంచి వెళ్లిపోయింది. తర్వాత నాగోలు కృషినగర్ కు మకాం మార్చి గోపాల్‌తో కలిసి ఉంటోంది. ఇటీవల చిన్న కుమారుడు అంకిత్‌కు ఫిట్స్ రావడంతో నిలోఫర్ ఆస్పత్రికి తీసుకువెళ్లింది. వైద్యులు మెదడు సంబంధిత వ్యాధి సోకిందని బతకడం కష్టమని చెప్పారు. అంకిత్ చనిపోతే తనమీదికి వస్తుందని గ్రహించిన ఆమె భర్తకు ఫోన్ చేసి కొడుకు పరిస్థితిని వివరించింది. తప్పు చేశానని మన్నించమని బతిమిలాడింది.

దీంతో ఆమెతో కలిసి ఉండేందుకు చంద్రం అంగీకరించాడు. జిల్లెలగూడ నుంచి కృషినగర్‌కు వచ్చాడు. ఇంట్లో గోపాల్, శాంతి కలిసి ఉంటున్న విషయం తెలుసుకుని శాంతిని నిలదీశాడు. గోపాల్ పేరుతో ఉన్న ఆటోను తన పేరుకు మార్పు చేయాలని భార్యను వేధించాడు. దీంతో భర్తను తుదముట్టించాలని గోపాల్‌తో కలిసి పన్నాగం పన్నింది. పథకం ప్రకారం ఆగస్టు 7న గోపాల్ కొత్తపేటలో రెండు కత్తులను కొన్నాడు. రాత్రికి ఇంట్లో పార్టీ ఏర్పాటు చేశారు.

పిల్లలను భవనంపై పడుకోబెట్టారు. చంద్రంకు మద్యం, చికెన్ ఇతర ఏర్పాట్లు చేశారు. మద్యంలో నిద్రమత్తు మాత్రలు కలిపి ఇచ్చారు. దీంతో నిద్రమత్తులో ఉన్న చంద్రంపై కత్తులతో దాడిచేశారు. తలను నరికి చేతులు, కాళ్లను వేరు చేశారు. తల, కాళ్లు, చేతులను ఒక మూట గట్టారు. మొండెం మరో సంచిలో, దుస్తులు, ఇతర సామగ్రిని మరో మూటలో కట్టి రాత్రి 2 గంటల సమయంలో నాగోలు బ్రిడ్జి సమీపంలో మూసీలో పడేశారు. తిరిగి వచ్చి రక్తం మరకలను శుభ్రం చేశారు. అక్కడ ఇళ్లు ఖాళీ చేసి కృషినగర్‌లోనే మరో ఇంట్లోకి మకాం మార్చారు. ఇదిలా ఉండగా సమగ్ర సర్వే నిమిత్తం ఆగస్టు 19న శాంతి సొంతూరికి వెళ్లింది. అన్నరాలేదేమని చంద్రం సోదరుడు శ్రీనివాస్ అడిగాడు.

మా కంటే రెండు రోజులు ముందే ఊరికి బయలుదేరాడని అని చెప్పింది. హైదరాబాద్‌కు వచ్చిన తర్వాత ఫోన్ స్విచ్ఛాఫ్ చేసింది. అన్న ఆచూకీ తెలియకపోవడంతో శ్రీనివాస్ ఆరా తీశాడు. గోపాల్, శాంతిల మధ్య వివాహేతర సంబంధంతో జరిగిన గొడవ విషయాన్ని తెలుసుకున్నాడు. ఈనెల 18న గోపాల్, వదిన శాంతిలపై దేవరకొండ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. వారిని  అదుపులోనికి తీసుకుని విచారించగా నేరాన్ని అంగీకరించారు. సోమవారం దేవరకొండ పోలీసులు గోపాల్‌ను తీసుకుని వెళ్లి హత్య జరిగిన స్థలం, మృతదేహాన్ని పడేసిన స్థలాన్ని పరిశీలించారు. కత్తులను స్వాధీనం చేసుకున్నారు. దేవరకొండ పోలీసుల అదుపులో నిందితులు గోపాల్, శాంతి ఉన్నట్టు ఎల్‌బీనగర్ ఎస్‌ఐ విజయ్ తెలిపారు. మృతదేహాన్ని వెతికిస్తామని ఆయన పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement