సాక్షి,సిటీబ్యూరో: నభూతో...అనే రీతిలో వైఎస్సార్‌సీపీ నగరంలో నిర్వహించిన ‘సమైక్య శంఖారావం’ విజయవంతం కావడం గ్రేటర్ పరిధిలోని ప్రధాన పార్టీల గుండెల్లో గుబులు రేపుతోంది. రాష్ట్ర విభజనకు అనుకూలంగా లేఖఇవ్వడం ద్వారా తెలుగుదేశం, విభజన ప్రక్రియను ప్రారంభించడం ద్వారా కాంగ్రెస్ గ్రేటర్ పరిధిలోని సమైక్యవాదుల విశ్వాసం కోల్పోగా, రాష్ట్ర సమైక్యతే తన లక్ష్యమని లక్షలాదిజనం సాక్షిగా జగన్ చేసిన ప్రతిన ఐక్యత కోసం ఆరాటపడుతున్న నగరవాసుల ఆశను చిగురించింది.
అదే సమయంలో వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ ద్వారానే రాష్ట్రం కలిసి ఉంటుందని, భవిష్యత్ ఆశాకిరణం ఆపార్టీనేనని శనివారం నిర్వహించిన సమైక్య శంఖారావం ద్వారా తేటతెల్లమైంది. నగర విశిష్టత, దశాబ్ధాల నుంచి ప్రజలు సమైక్యంగా సాగినతీరు, విభజన జరిగితే భావితరాల భవిష్య త్తు వంటి అంశాల్లో జగన్ ఇచ్చిన ‘స్పష్టత’ గ్రేటర్ లో నివసిస్తున్న అన్ని ప్రాంతాల ప్రజలను ఆలోచింప చేసిందనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోం ది. విభజన నిర్ణయం తర్వాత ఏ ప్రాంత ప్రజలకు ఎలాంటి సమాధానం చెప్పాలో తేల్చుకోలేక కొట్టుమిట్టాడుతున్న కాంగ్రెస్,టీడీపీలకు జగన్ చేసిన ప్రసంగంతో గ్రేటర్ హైదరాబాద్‌పై కూడా ఆశలు లేకుండా పోయాయని విశ్లేషకులు భావిస్తున్నారు.
వారే ఆధారం..
గ్రేటర్ పరిధిలోని మూడు లోక్‌సభ, 24 శాసనసభ నియోజకవర్గాల పరిధిలో హైదరాబాద్ పార్లమెంటుతోపాటు కొన్ని అసెంబ్లీ సెగ్మెంట్లను మినహాయిస్తే... సికింద్రాబాద్,మల్కాజిగిరి లోక్‌సభ స్థానాలు, మరో 14 అసెంబ్లీ స్థానాల్లో సమైక్యవాదులే గెలుపు నిర్ణేతలు. మిగతా నియోజకవర్గాల్లో మైనార్టీవర్గాల ఓటర్లు అభ్యర్థుల విజయాన్ని శాసిస్తారు. ముఖ్యమంత్రి కిరణ్ వైఖరితో ఇప్పటి కే గ్రేటర్‌లో బలమైన రాజకీయశక్తి ఎంఐఎం కాంగ్రెస్‌కు దూరం కాగా, మైనారిటీలు కూడా హస్తం పార్టీ పేరు చెబితేనే ఆమడదూరం పోతున్నారు. 2004 నుంచే మైనార్టీలు టీడీపీని నమ్మడం మానేశారు. ఇప్పుడు బాబు మోడీ జపం చేస్తుండడంతో ఆపార్టీలో ఉన్న మైనార్టీ నాయకులు రాజీనామాల బాటపట్టారు.
ఈసారీ కాంగ్రెస్‌కు టీడీపీ గతే ?
టీడీపీ, టీఆర్‌ఎస్,వామపక్షాలు మహాకూటమిగా 2009 ఎన్నికల్లో ఉమ్మడిగా పోటీ చేసినా...సమైక్య రాష్ట్ర నినాదంతో అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి నేతృత్వంలో ఒంటరిగా పోటీచేసి రెబల్‌తో సహా 14 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. టీడీపీ కేవలం రాజేంద్రనగర్ నియోజకవర్గంలో స్వల్పమెజార్టీతో గెలిచింది. అది కూడా మైనార్టీల ఓట్లు కాంగ్రెస్, ఎంఐఎంలకు చీలిపోవడం వల్ల. కాంగ్రెస్ విజయం సాధించిన సికింద్రాబాద్, ముషీరాబాద్,కంటోన్మెంట్, సనత్‌నగర్, ఎల్‌బీనగర్, మల్కాజిగిరి, గోషామహల్, జూబ్లీహిల్స్, పటాన్‌చెరు, కుత్బుల్లాపూర్, ఖైరతాబాద్, ఉప్పల్, శేరిలింగంపల్లి మొదలైన నియోజకవర్గాల్లో వైఎస్ అమ్ములపొదిలోని అభివృద్ధి, సంక్షేమ, సమైక్య నినాదాలే కాంగ్రెస్ గెలుపును ప్రభావితం చేశాయి.
మంత్రి దానం నాగేందర్ ప్రాతినిథ్యం వహిస్తున్న ఖైరతాబాద్‌లో గణనీయ సంఖ్యలో సమైక్యవాదులు ఉండగా, ముఖేష్ ప్రాతినిధ్యం వహిస్తున్న గోషామహల్‌లో మైనారిటీ ముస్లింలతో పాటు తెలుగేతర మైనార్టీలున్నారు. వీరు కూడా సమైక్యవాదానికే ఓటేయడం గమనార్హం. ఈ పరిస్థితుల్లో జగన్ సభ విజయం సాధించిన తీరుతో 2009 ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్ ఎంపీ, ఎమ్మెల్యేల్లో ఆందోళన మొదలైంది. ప్రజల ముందుకు ఎలా వెళ్లాలో అర్థంకాని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు.
ప్రధాన పార్టీల్లో గుబులు
Published Sun, Oct 27 2013 5:09 AM | Last Updated on Fri, May 25 2018 9:12 PM
Advertisement