నేడు ఎంసెట్ ఆల్ ది బెస్ట్
తొలగిన రవాణా కష్టాలు
విద్యార్థుల్లో సంతోషం
పరీక్ష కేంద్రాలకు 661 బస్సులు
ఆర్టీసీ టోల్ ఫ్రీ నంబర్లు
040-23202813, 99592 26160
విద్యార్థి దశలో కీలకమైన మలుపుగా భావించే ఎంసెట్‌కు హాజరయ్యే విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వ హామీ.. ఆర్టీసీ కార్మికుల సమ్మె విరమణ నేపథ్యంలో ఎంసెట్‌కు హాజర వుతున్న విద్యార్థులు ఊపిరి పీల్చుకున్నారు. తమ డిమాండ్ల సాధనకు కొన్ని రోజులుగా కార్మికులు సమ్మె చేస్తుండడంతో విద్యార్థులు, తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. సమ్మె విరమిస్తున్నట్టు ప్రకటన రాగానే వారి మోముల్లో ఆనందం వెల్లివిరిసింది. గ్రేటర్‌లోని 8 రీజినల్ సెంటర్ల పరిధిలో మొత్తం 1,13,700 మంది విద్యార్థులు గురువారం నిర్వహించనున్న ఎంసెట్ పరీక్షకు హాజరుకానున్న విషయం తెలిసిందే. ఇందులో 67,686 మంది ఇంజినీరింగ్, 45,100 మంది మెడికల్ ప్రవేశ పరీక్ష రాయనున్నారు. మరో 457 మంది ఈ రెండు విభాగాలకూ దరఖాస్తు చేసుకున్నారు. నగరంలో మొత్తం 189 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయగా.. అందులో ఇంజినీరింగ్‌కు 111, మెడికల్ కు 78 కేటాయించారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఇంజినీరింగ్, మధ్యాహ్నం 2.30 నుంచి 5.30 గంటల వరకు మెడికల్ ప్రవేశ పరీక్ష జరగనుంది. నిర్ణీత సమయానికి గంట ముందుగానే కేంద్రాలకు చేరుకోవాలని ఇప్పటికే అధికారులు పలుమార్లు సూచించారు. సమ్మె నేపథ్యంలో విద్యార్థులలో ఇది ఆందోళన పెంచింది. బస్సులు రోడ్డెక్కడంతో ఊరట చెందారు. మరోవైపు ట్రాఫిక్ కష్టాలు ఎదురుకాకుండా పోలీసులూ చర్యలు తీసుకుంటున్నారు.
అందుబాటులో 661 బస్సులు
రవాణా విషయంలో విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశారు. నగరంలోని అన్ని రూట్లనూ కలుపుతూ పరీక్ష కేంద్రాలకు బస్సులు నడుపుతున్నారు. దీని కోసం 661 బస్సులను వినియోగిస్తున్నట్లు కలెక్టర్ కె.నిర్మల వెల్లడించారు. ఇందులో 200కు పైగా ఆర్టీసీవి ఉన్నాయి. వీటితోపాటు కళాశాలలు, స్కూళ్లు, ప్రైవేటు సంస్థలకు చెందిన 400కు పైగా బస్సులను వినియోగించనున్నారు. విద్యార్థులు సులువుగా గుర్తించేందుకు వీలుగా బస్సులన్నింటిపై ఎంసెట్ పరీక్ష కేంద్రానికి సంబంధించిన బ్యానర్ ఉంటుంది.
టోల్ ఫ్రీ నంబర్లు...
రవాణా సౌకర్యాలకు సంబంధించిన సమాచారాన్ని తెలుసుకునేందుకు వీలుగా కలెక్టరేట్‌లో అధికారులు టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేశారు. 040-23202813 నంబరులో విద్యార్థులు, తల్లిదండ్రులు సంప్రదించవచ్చు. కోఠి బస్ టెర్మినల్‌లో మరో టోల్ ఫ్రీ నంబరు 99592 26160ను కూడా అందుబాటులోకి తెచ్చారు. గురువారం సాయంత్రం 6 గంటల వరకూ ఈ నెంబర్లలో సంప్రదించవచ్చు. విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన చెందవద్దని, ప్రత్యామ్నాయ ఏర్పాట్లను వినియోగించుకోవాలని కలెక్టర్ సూచించారు. మరోపక్క విద్యార్థులకు ఇబ్బందులు కలుగకుండా ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలు ఉదారత కనబరుస్తున్నాయి. త మ కళాశాల కేంద్రంగా పరీక్ష రాసే విద్యార్థుల కోసం వివిధ ప్రాంతాల నుంచి బస్సులను నడుపుతున్నాయి.
వీడియో కాన్ఫరెన్స్
జిల్లాలో గురువారం జరుగుతున్న ఎంసెట్ ఏర్పాట్లపై తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ బుధవారం సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ నిర్మల సీఎస్‌తో మాట్లాడుతూ జిల్లాలో 111 కేంద్రాల్లో 1.12 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నట్టు తెలిపారు. వీరి సౌకర్యార్థం 661 బస్సులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
డీఆర్‌కే కళాశాల ప్రత్యేక బస్సులు
తమ కళాశాల కేంద్రంగా ఎంసెట్ రాసే విద్యార్థుల కోసం డీఆర్‌కే ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ప్రత్యేక బస్సులు నడుపుతోంది. మియాపూర్-మేడ్చల్ దారిలో ఉన్న ఈ కళాశాలకు అమీర్‌పేట, కూకట్‌పల్లి, వీవీ నగర్, కేపీహెచ్‌బీ, జేఎన్‌టీయూ, మలేషియా టౌన్‌షిప్, లింగంపల్లి, సికింద్రాబాద్, బాలానగర్, గండిమైసమ్మ నుంచి బస్సులు అందుబాటులో ఉంటాయని యాజమాన్యం తెలిపింది. వివరాలకు 8790911899, 9849285621లో సంప్రదించవచ్చు.